కళ్యాణ్, రీహా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కృష్ణతేజ (వడ్డే నవీన్ ‘వన్’ చిత్రం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ సినీ ప్రొడక్షన్, హర్ష సినీ క్రియేషన్స్ పతాకాలపై కె.శ్రీకాంత్, కె.చంద్రమోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను అతిథిగా విచ్చేసిన వి.సాగర్ విడుదల చేయగా, మోషన్ పోస్టర్ ను సీనియర్ నటి కవిత, టైటిల్ పాటను ‘తెలంగాణ ఫిలిం చాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ… తెలుగు ప్రజలలో మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సబ్జెక్టును తయారు చేసుకోవడం వెనుక వారికి ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమౌతోంది. ఈ చిత్ర హీరో కళ్యాణ్ పోలికలు పవన్ కు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆయనలా అభినయించి, డ్యాన్స్ కూడా అలానే చేస్తే…ఈ చిత్రానికి అభిమానులు తప్పకుండా పట్టం కడతారు- అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
నటి కవిత మాట్లాడుతూ… సినీరంగంలో ట్రెండ్ మారింది. నేటి ప్రేక్షకులు ఆర్టిస్టులు ఎవరని చూడకుండా మంచి సినిమాలకు పట్టం కడుతున్నారు. ఆ కోవలో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి అని అన్నారు.
చిత్ర హీరో కళ్యాణ్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని…ప్రస్తుత సమాజంలో ఎదురైన ఓ సమస్యను కథానాయకుడు ఏ రకంగా పరిష్కరించుకుని బయటపడ్డాడన్న కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని అన్నారు. పవన్ ను ఎంతగానో అభిమానిస్తూ, ఆరాధిస్తున్న తాను ఇందులో హీరోగా నటించడం ఎనలేని ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు కృష్ణతేజ మాట్లాడుతూ, కెరీర్ పరంగా ఇది తనకు నాలుగో చిత్రమని అన్నారు. పవన్ అభిమానుల అంచనాలకు చేరవయ్యేలా ఈ చిత్రాన్ని మలచబోతున్నామని చెప్పారు.
నిర్మాతలలో ఒకరైన కె.చంద్రమోహన్ మాట్లాడుతూ… ఇప్పటివరకు ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాం. రాజమండ్రి, వైజాగ్, అమలాపురం, యానం తదితర ప్రాంతాలలో పాటలతో సహా చిత్రీకరణ పూర్తిచేస్తాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాం అని చెప్పారు. సంగీత దర్శకుడు జయసూర్య మాట్లాడుతూ, మిగతా పాటలు, రీరికార్డింగ్ కూడా ఆకట్టుకునేలా రూపొందిస్తానని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సాయికుమార్, పోసాని, భానుచందర్్, కవిత తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా-మహి సరళ, సంగీతం-జయసూర్య, ఎడిటింగ్-నందమూరి హరి, నిర్మాతలు-కె.శ్రీకాంత్, కె.చంద్రమోహన్, దర్శకత్వం-కృష్ణతేజ