కాజల్‌అగర్వాల్ ఇటీవల వరుసగా అపజయాలను మూటకట్టుకుంటోంది. ఆమెకు ఎదురుగాలి వీస్తోంది.కాజల్ ఎంతో ఆశ పెట్టుకున్న తేజ ‘సీత’ ఆమెను పెద్ద దెబ్బ తీసింది. జీవితంలో ఎవరికైనా ఎత్తుపల్లాలు తప్పవు. కాజల్ ఇందుకు అతీతం కాదు. నిజం చెప్పాలంటే.. ఈ ఉత్తరాది బ్యూటీ నట జీవితం కోలీవుడ్‌లో అపజయాలతోనే మొదలైంది. అయితే ఆ తరువాత పోరాడి విజయాలు సాధించింది. జయాపజయాలతో కొనసాగుతూ అగ్రనటి గా ఎదిగింది. 2004లో బాలీవుడ్‌లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. అలా నటిగా పదిహేనేళ్ళకి చేరుకున్న కాజల్‌అగర్వాల్ యాభై చిత్రాలను దాటేసింది.
ఆశలు నీరు గారిపోతున్నాయి !
కాజల్ చాలా ఆశలు పెట్టుకుని నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమే అయ్యింది. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్ ఇది. అంతే కాదు.. కాజల్ నటించిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం కూడా ఇదే. నటీమణులు చాలా మంది ఆశ పడ్డ ఈ చిత్రంలో నటించాలన్న అవకాశం తనను వరించడంతో కాజల్ అగర్వాల్ సంబరపడింది.అయితే ఆమె ఆశలు సినిమా విడుదల ఆలస్యం కావడంతో నీరు గారిపోతున్నాయి. ఇకపోతే ఇటీవల మరో పెద్ద ఆఫర్ కాజల్‌ను వరించినట్టే వరించి.. ఇంకా ఊగిసలాడటం కూడా ఈ అమ్మడిని నిరాశ పరుస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ‘ఇండియన్–2’లో నటించే అవకాశం. కొన్ని సమస్యలు ఈ చిత్రానికి బ్రేక్ వేశాయి. కమలహాసన్ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల కూడా ఆ ‘ఇండియన్–2’ నిర్మాణం ముందుకు సాగలేదు.
ఇలా వరుసగా ఒక్కొక్కటి వెనక్కుపోవడంతో కాజల్ అగర్వాల్ సినీ జీవితం మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటి, కోలీవుడ్‌లో ఒకటి అని కాజల్ చేతిలో రెండే రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో జయంరవితో రొమాన్స్ చేస్తున్న ‘కోమాలి’ చిత్రం పైనే కాజల్ అగర్వాల్ చాలా నమ్మకాలు పెట్టుకుందట. ఇక్కడ ఈ అమ్మడు సెంటిమెంట్‌పై ఆశలు పెట్టికుందని చెప్పవచ్చు.జయంరవికి హీరోయిన్ల లక్కీ హీరో అనే పేరుంది. ఆయనతో కాజల్‌అగర్వాల్ జతకట్టిన తొలి చిత్రం ‘కోమాలి’. కాజల్ నమ్మకం పెట్టుకోవడానికి ఇదో కారణం. అయితే ‘కోమాలి’ చిత్రం కథ జయంరవి చుట్టూనే తిరుగుతుందట. అయినా ‘సినిమా హిట్ అయితే హీరోయిన్‌గా అది తన ఖాతాలోనూ పడుతుందిగా. తనకు కావలసింది హిట్ అంతే’ అనే ఆలోచనలో కాజల్ ఉందట.అవకాశాలు సన్నిగిల్లడంతో గ్లామర్‌తో సొమ్ము ఆకట్టుకోవాలని అటుగా అడుగులు వేగంగా వేస్తోంది. తరచూ ఫొటో షూట్ చేయించుకుంటూ గ్లామరస్ ఫొటోలను ఇన్స్టా గ్రం వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. ఈ ప్రయత్నాలు కాజల్ కు ఏ మాత్రం అవకాశాలను తెచ్చి పెడతాయో చూడాలి.