సామాజిక సేవపై దృష్టి పెట్టినట్లు చెప్పింది కాజల్ అగర్వాల్. సమాజసేవ చేస్తున్నానంటోంది… ఏమిటీ సడన్‌గా సమాజంపై ప్రేమ పుట్టుకొచ్చింది? కొంపదీసి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఉందా? అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. అయితే,సమాజసేవకు తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నట్లు కాజల్ తెలిపింది. ఆంధ్రాలోని అరకు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ఆదివాసుల పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేక అవస్థలు పడడం చూశానని, దీంతో నిధిని సేకరించి ఆ ప్రాంతంలో పాఠశాలను కట్టించినట్లు కాజల్‌అగర్వాల్ తెలిపింది. ఈ అమ్మడికిప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. హిందీ చిత్రం ‘క్వీన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘ప్యారిస్ ప్యారిస్’లో నటించింది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
తమిళంలో నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నానని కాజల్ తెలిపింది. ఇటీవల యువ కథానాయకులతోనే నటిస్తున్నారేమిటని అడుగుతున్నారని… అయితే ‘ఎవరితో నటిస్తున్నాను’ అన్నదానికంటే ‘ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నా’నన్నదే ముఖ్యం అని చెప్పింది. మంచి కథ, పాత్ర అయితే ఏ నటుడితోనైనా నటించడానికి సిద్ధం అని పేర్కొంది.
కమల్ హసన్‌తో శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు–2’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన కాజల్‌అగర్వాల్‌కు… ఆ చిత్రం నిర్మాణంలో జాప్యం నిరాశ పరిచింది. ఇప్పుటికే ప్రారంభం కావలసిన ‘ఇండియన్–2’ చిత్రం కమల్‌హాసన్ ఎన్నికల బరిలోకి దిగడంతో… అవి పూర్తి అయ్యేవరకూ వేచి ఉండక తప్పదు. ఈ సందర్భంగా తన సినీ పయనం గురించి కాజల్ తెలుపుతూ… తనను కలిసిన వారందరూ పెళ్లెప్పుడూ? అని అడుగుతున్నారని, అయితే ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారిస్తున్నానని చెప్పింది.అయితే పెళ్లి అనేది అందరికీ తెలిసేలానే చేసుకుంటానని అంది.