సహజమైన విధానంలో ‘వంద రోజుల ఛాలెంజ్’

‘‘సవాళ్లను స్వీకరించడం నా వృత్తి హక్కు. అందుకు ఎందాకైనా వెళ్తాను’’ అని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. అనడమే కాదు ఆ చాలెంజ్‌కు గడువు కూడా ఫిక్స్‌ చేసేసింది. విషయమేంటంటే… వంద రోజుల్లో ఫిట్‌గా మారిపోవాలని కాజల్‌ నిశ్చయించుకుంది. అందుకే ఈ చాలెంజ్‌ కూడా టేకప్‌ చేసింది. ఈ చాలెంజ్‌ గురించి కాజల్‌ మాట్లాడుతూ – ‘‘యాక్టర్సే కాదు అందరూ ఫిట్‌గా ఉండాలి. నా శరీరాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ చాలెంజ్‌ తీసుకుంటున్నాను. నా కోచ్‌ శ్రీరామ్‌ పర్యవేక్షణలో దీన్ని మొదలుపెడుతున్నాను. ఏం తినాలి? ఏ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి? అనేవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. వాటిని కూడా చాలా తేలిక చేస్తున్నారు ఆయన. ఈ చాలెంజ్‌లో అసహజత్వానికి చోటే లేదు. కేవలం న్యాచురల్‌గా లభించే న్యూట్రిషన్స్‌తోనే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నాను. ఎలాంటి మార్పు కనిపిస్తుందో వంద రోజుల్లో చూద్దాం’’ అని చెప్పింది.
 
మనసులో ఒక వేదన వెంటాడుతోంది !
కాజల్‌ చేసిన సినిమాలు ఒకప్పుడు ఏడాదికి కనీసం ఆరేడు విడుదలయ్యేవి. కాగా ప్రస్తుతం కాజల్‌ చిత్రాలను తగ్గించుకుంది. తగ్గడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కాజల్‌అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో బదులిస్తూ…” మనసులో ఒక వేదన వెంటాడుతోంద”ని చెప్పింది. దాన్ని చాలా ఆలస్యంగా గ్రహించినట్లు తెలిపింది. 2013లో తన చెల్లెలి పెళ్లి అయ్యిందని , ఆ వేడుకలోనూ తాను అతిథిగానే పాల్గొన్నానని చెప్పింది. కుటుంబంలోని సభ్యురాలిగా సంతృప్తిగా ఆ వేడుకలో పాలుపంచుకోలేకపోయానని అంది. తన చెల్లెలంటే తనకు చాలా ప్రేమ అని పేర్కొంది. తామిద్దరం చాలా సన్నిహితంగా ఉంటామని, అలాంటి తన చెల్లెలి పెళ్లిరోజున తాను ఆమెతో పూర్తిగా గడపలేకపోయానన్న బాధ తనను వెంటాడుతూనే ఉందని చెప్పింది. అందుకు కారణం షూటింగ్‌లతో బిజీగా ఉండడమేనని వివరించింది. అందుకే ఆ తరువాత చిత్రాలను తగ్గించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏడాదికి నాలుగు చిత్రాల్లో నటిస్తే చాలని భావించానని చెప్పింది. ఇప్పుడు తాను చిత్రాల్లో నటిస్తున్నా, కుటుంబసభ్యులకు వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ సంతోషంగా గడుపుతున్నానని చెప్పింది. పాత్రలకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమిస్తున్నా, ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉండడం లేదని చెప్పింది. ప్రస్తుతం కాజల్‌ జయంరవికి జంటగా ‘కోమాలి’ చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే హిందీ చిత్రం ‘క్వీన్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రం విడుదల కావలసి ఉంది.