‘నేను చిన్నప్పుడు వ్యోమగామి అవ్వాలనుకున్నా. కానీ అది అంత ఈజీ కాదని పెద్దయ్యాక తెలిసింది’ అని అంటోంది కాజల్ అగర్వాల్. గతేడాది వరుసగా నాలుగు సినిమాలతో విజయాలను అందుకుంది కాజల్. అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా సినిమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ‘చిన్నప్పట్నుంచి నేను అల్లరి పిల్లను. స్నేహితులతో కలిసి స్కూల్ బంక్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మా పేరెంట్స్ నన్ను ఏమీ అనేవారు కాదు. అదే సమయంలో నన్ను చాలా పద్ధతిగా పెంచారు. నా మనస్తత్వం సాహసోపేతంగా ఉంటుంది. చదువుకునే రోజుల్లో కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళారని తెలుసుకున్నా. నేను కూడా వ్యోమగామి కావాలనుకున్నాను. కానీ మనం కాలేమని తర్వాత తెలిసింది. దీంతో ఉన్నత విద్య చేసి వ్యాపారానికి సంబంధించిన ఉద్యోగాలు చేయాలనుకున్నా. అనుకోకుండా నటిని అయ్యాను. సినిమాల్లోకి వస్తానని అస్సలనుకోలేదు. అదొక ఊహించని మలుపు. అయినప్పటికీ మా ఫ్యామిలీ నాకు అన్ని రకాలుగా సపోర్ట్‌నిచ్చారు. చేసే ప్రతి పనికి అండగా నిలిచారు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని’ అని తెలిపింది.
జీవితంలో ప్రతి వారికి కల అనేది ఉండాలి !
కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ హిందీలో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న నటిమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇన్నేళ్ల నటజీవితం కాజల్‌కు చాలా అనుభవాన్ని ఇచ్చింది. చాలా విషయాలను గురించి ఎంతో పరిపక్వతతో చెప్పారు. ‘జీవితంలో ప్రతి వారికి కల అనేది ఉండాలి. దాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమించాలి.నేను చిన్న తనం నుంచి నటినవ్వాలని కలలు కన్నాను. శక్తి వంచన లేకుండ శ్రమించాను. కృషి, శ్రమ పట్టుదల ఉంటే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఒక్కోసారి హీరోహీరోయిన్లు ఎంతో నమ్మకం పెట్టుకున్న చిత్రాలు నిరాశపరచవచ్చు. అందుకు కారణాలు తెలియవు. చిత్రాల జయాపజయాలు మన చేతిలో ఉండవు. అలాంటప్పుడు నిరాశచెందకూడదు. అందులోంచి బయటపడి, ముందడుగు వేస్తే మళ్లీ విజయాలబాట పట్టగలం.
చేసే వృత్తి మనకు ముఖ్యంగా భావించాలి. ఫలితాలను విధి నిర్ణయిస్తుంది. లక్ష్య సాధనే ధ్యేయంగా శ్రమించాలి. మనకు సలహాలివ్వడానికి చాలా మంది వస్తుంటారు. అలాంటివన్నీ వినాలి . అయితే నిర్ణయాలు మాత్రం మనవే అయ్యిఉండాలి. కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు లేకుంటే మనం ఏం చేయలేం. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా అనుబంధాలకు ప్రాముఖ్యతనివ్వాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… సామాజిక మాధ్యమాల్లో విమర్శలను లైట్ తీస్కోవాలి’ అని అన్నారు.