సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు, వల్లభ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘తేజ్’. ఐలవ్‌యు అనేది ఉపశీర్షిక. జూన్ 29న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మే 31న హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు, దర్శకుడు ఎ. కరుణాకరన్ పాల్గొన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు మాట్లాడుతూ – ”35 సంవత్సరాల క్రితం నుండి క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో నేను సినిమాలు తీయడం మొదలుపెట్టాను. సినిమాల మీద వున్న ఇంట్రెస్ట్, ప్రేమతో నా అభిరుచి మేరకు ప్రేక్షకులకు నచ్చేవిధంగా సినిమాలు తీశాను. నేను సాధారణ ప్రేక్షకుడిని. అందుకు తగ్గట్లుగా మంచి కథని సెలెక్ట్ చేసుకొని కాన్ఫిడెన్స్‌తో సినిమాలు తీశాను. ఇప్పటివరకు 44 సినిమాలు తీశారు. అందులో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా వున్నాయి. ‘తేజ్’ 45వ చిత్రం. ఈ 45 చిత్రాల జర్నీలో ప్రేక్షకులు, జర్నలిస్ట్‌లు ఎంతోమంది సహకరించి ప్రోత్సహించారు. సత్కారాలు, సన్మానాలు, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ లభించాయి. ఇవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కాదు. డిఫరెంట్‌గా ఇంకా మంచి సినిమాలు ప్రేక్షకులు అందించాలి. నాతోటి ప్రొడ్యూసర్స్ తీసే సినిమాలు అన్నీ చూస్తూ ఇంకా బెటర్‌గా నేనేం తియ్యాలి అని నన్ను నేను రీ పబ్లిష్ చేసుకుంటూ ఫ్యూచర్‌ని కొనసాగిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేను సినిమాలు తీస్తూనే వుంటాను అని నమ్ముతూ మీ అందరి సహకారం నాకు వుండాలని కోరుకుంటున్నాను.
జూన్ 9న ఆడియో విడుదల !
ఇప్పుడున్న కొత్త కొత్త మాధ్యమాల ద్వారా మా ‘తేజ్’ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇదొక లవ్, ఫ్యామిలీ డ్రామా. స్వీట్‌గా, ఈస్థటిక్‌గా వుంటుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, సెన్సార్ కట్స్ లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్, ఎమోషన్స్‌ని కలగలిపి కరుణాకరన్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. చక్కని కుటుంబ కథా చిత్రాలు యూత్‌కి నచ్చేవిధంగా తీసే దర్శకుడు కరుణాకరన్ ‘తొలిప్రేమ’ నుండి ఆయనకొక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వుంది ఆయనకి. ఎంత పెద్ద హీరో అయినా కరుణాకరన్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని కోరుకునే హీరోలు లేకపోలేదు అని నా నమ్మకం. అలాంటి కరుణాకరన్‌తో నేను రెండో సినిమా తీస్తున్నాను. మొదటి సినిమా ‘వాసు’. ప్రజాదరణతో పాటు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యింది. ఉత్తమ ఫ్యామిలీ కథా చిత్రంగా నంది అవార్డుని కూడా గెలుచుకుంది. అలాగే ఈ ‘తేజ్’ కూడా చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం అవుతుంది. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ బ్యూటిఫుల్‌గా నటించారు. గోపీసుందర్ ఐదు పాటలకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి, సాహితి, రాంబాబు, రెహమాన్‌లు ఫెంటాస్టిక్ లిరిక్స్ రాశారు. జూన్ 2న ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్ మ్యాచ్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 9వ తేదీన జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో ఆడియో ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా జరపనున్నాం. ప్రస్తుతం రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని జూన్ నెలాఖరులో తేజ్ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
చిత్ర దర్శకుడు ఎ. కరుణాకరన్ మాట్లాడుతూ – ”క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో రెండో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. నేను ఏదైతే అనుకున్నానో.. ఎలాంటి సినిమా చెయ్యాలనుకున్నానో ఆవిధంగా కె.ఎస్.రామారావుగారు బ్యూటిఫుల్‌గా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ బేనర్లో ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా వుంది. ఇది 10వ సినిమా. సాయిధరమ్ తేజ్, అనుపమతో ఫస్ట్‌టైమ్ వర్క్ చేస్తున్నాను. ఇద్దరూ సూపర్బ్‌గా చేశారు. సినిమా ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. క్యూట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన ‘తేజ్’ చిత్రం అందరికీ నచ్చుతుంది. గోపీసుందర్ వండ్రఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆండ్రూ ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. అలాగే రామారావుగారికి నా కృతజ్ఞతలు” అన్నారు.