నిబద్ధత కలిగిన జర్నలిస్టు పసుపులేటి ఇకలేరు!

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్టు పసుపులేటి రామారావు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. యూరిన్‌ ఇన్ఫ్‌క్షన్‌ కావడంతో రెండు రోజుల క్రితం హాస్పిటల్‌లో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. భార్య, కుమారుడు ఉన్నారు. పసుపులేటి రామారావుకు తెలుగు చిత్రపరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు,జర్నలిస్ట్ లు వారి ఇంటికి చేరుకొని భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కల్యాణ్‌ నాగ చిరంజీవిని పరామర్శించారు.
 
అక్షరమే శ్వాసగా, ధ్యాసగా సుదీర్ఘమైన వృత్తిజీవితాన్ని కొనసాగించిన జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌ ఆయనది. మధ్యలో ఎక్కడా విరామం లేకుండా ఇంతకాలం పనిచేసిన జర్నలిస్ట్‌ ఆయన ఒక్కరే. సాధారణంగా ఓ వృత్తిలోనైనా ఏళ్ల తరబడి పనిచేసిన తర్వాత కొంత విసుగు కలుగుతుంది. మనసు విరామం కోరుకుంటుంది.శరీరం విశ్రాంతి కావాలనంటుంది. ఆరు పదుల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తూ.. యువతరం జర్నలిస్టులకు గట్టి పోటీ..స్ఫూర్తి ఇచ్చేవారు రామారావు. ప్రెస్‌మీట్‌ అంటే చాలు.. మిగిలిన వారి కంటే తనే ముందు ఉండేవారు. పని విషయంలో ఎప్పుడూ బద్దకించేవారు కాదు. ప్రెస్‌ మీట్‌ కానీ, ఏదన్నా ఫంక్షన్‌ కానీ లేట్‌ అయినా తలకు గుడ్డ కట్టేసుకుని ఓపికగా అలాగే కూర్చునేవారు తప్ప.. ఆయన అలిగి వెళ్లిన సంఘటనలు లేవు. తెల్ల ఫ్యాంట్‌, అదే రంగు షర్టు, భుజాన సంచి.. జర్నలిస్టుకు అసలు సిసలు నిర్వచనంలా ఉండేది రామారావు ఆహార్యం. హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిన తర్వాత స్కూటర్‌ కొనుక్కున్నారు కానీ, మద్రాసులో ఉన్న కాలంలో ఆయన ఎక్కువగా సైకిల్‌ మీదే తిరిగేవారు. ఆర్భాటాలకు, ఆడంబరాలకూ ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు.
రామారావు స్వగ్రామం ఉండ్రాజవరం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కన ఉంది. బీఏ డిస్‌కంటిన్యూ చేసిన రామారావు 1970లో మద్రాసులో అడుగుపెట్టారు. ఆరంభంలో చిన్న చిన్న ఉద్యోగాలు కొన్ని చేసినా.. ‘విశాలాంధ్ర’ లో సినిమా జర్నలిస్ట్‌గా ఆయన కెరీర్‌ మొదలైంది. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉండడంతో అక్కడ ఆయనకు ఉద్యోగం తేలికగానే దొరికింది. యాజమాన్యం పూర్తి స్వేచ్ఛనివ్వడంతో కార్మికుల సమస్యలు, చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి ‘విశాలాంధ్ర’లో రాసిన వ్యాసాలు రామారావుకు ఎంతో పేరు తెచ్చాయి.
 
‘జ్యోతిచిత్ర’ తో విశేష అనుబంధం
‘విశాలాంధ్ర’ తర్వాత ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. 1975లో చేరిన ఆయన 25 ఏళ్ల పాటు అంటే 2000వ సంవత్సరం వరకూ ‘ఆంధ్రజ్యోతి’లో పనిచేశారు. డైలీ పేపరు సహా ‘ఆంద్రజ్యోతి’ వీక్లీ, ‘జ్యోతిచిత్ర’, ‘వనితాజ్యోతి’, ‘బాలజ్యోతి.’.. ఇలా ఆంధ్రజ్యోతి గ్రూప్‌ పత్రికలన్నింటికీ రాసేవారు రామారావు. ఆ పత్రికలకు ఎలాంటి ఇంటర్వ్యూ కావాలన్నా చేసి ఇచ్చేవారు.అక్షరాన్ని ప్రేమించే వ్యక్తి కనుక రాయడమంటే ఆయనకు చాలా ఇష్టం.
ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయి ‘చిత్రాంజలి’, ‘సంతోషం’ పత్రికలకు పనిచేశారు. 46 ఏళ్లు పైబడిన తన జర్నలిస్టు జీవితంలో ఎంతో మందితో పరిచయాలు, స్నేహాలు..తొలి తరం కథానాయకులు నాగయ్య, ఎల్వీ ప్రసాద్‌ నుండి ఇప్పటి యువ హీరోల వరకూ ఎందరెందరినో ఇంటర్య్వూ చేసిన కలం రామారావుది. ఆ అనుభవాలను, అనుభూతుల్ని ‘46 ఏళ్ల సినీ ప్రస్తానంలో పదనిసలు’ పేరుతో రాసుకొన్న ఆత్మకథలో వివరించారు రామారావు. ఆత్మకథ రాసుకొన్న అతికొద్ది మందిసినీ జర్నలిస్టుల్లో ఆయన ఒకరు. దర్శకుల్లో దాసరి నారాయణరావుతో, హీరోల్లో చిరంజీవితో ఆయన సన్నిహితంగా మెలిగేవారు. దాసరి తన గురువు అనీ, చిరంజీవి తన ఆత్మబంధువు అని రామారావు చెప్పేవారు.
 
సినీ ప్రముఖుల జీవిత రచనలు 
సినిమా జర్నలిస్టుగా వ్యాసాలు, ఇంటర్వ్యూలు చేయడంతోనే ఆగిపోలేదు రామారావు. సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను అక్షర బద్ధం చేస్తూ కొన్ని పుస్తకాలు కూడా రాశారు. మెగాస్టార్‌ చిరంజీవి, దాసరి నారాయణరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, శ్రీదేవి గురించి ఆయన రాసిన పుస్తకాలు పాఠకుల ఆదరణ పొందాయి.పసుపులేటి రామారావు ఏ పత్రికలో పనిచేసినా తన ప్రత్యేకత చాటుకొన్నారు. నిజాయతీ, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా తెలుగు సినీ పత్రికా చరిత్రలో నిలిచిపోతారు.