కార్టూనిస్ట్, రచయిత ఉలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నీ ప్రేమ కోసం’. జొన్న పరమేష్, రాధా బంగారు హీరోహీరోయిన్లు. మాస్టర్ గోవింద్ బోగోజు సమర్పణలో సరోవర్ ఫిల్మ్స్ పతాకంపై ఉప్పుల గంగాధర్ నిర్మిస్తున్నారు.
ఈచిత్రం గురించి నిర్మాత గంగాధర్ మాట్లాడుతూ… ‘రెండక్షరాల ప్రేమ రెండు మనసులను కలుపుతుంది. రెండు జీవితాలను నిండు నూరేండ్లు ఆనందమయం చేస్తుంది. అలాంటి ప్రేమ కోసం లైలా-మజ్ను, పార్వతి-దేవదాస్, అక్బర్ సలీం-అనార్కలీ వంటి ఎందరో ప్రేమికులు తమ జీవితాలను అర్పించారు. ఆ కోవకు చెందిన ఒక ప్రేమికుడి కథే ఈ చిత్రం. క్రైమ్ బేస్డ్ లవ్‌స్టోరీ ఇది. అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేమ, కుటుంబం, కులం, మతం, ఉగ్రవాదం, మావోయిజం వంటి పలు సమస్యలను స్పృశిస్తూ, ప్రేమకే ఒక ఛాలెంజ్‌గా నిలుస్తుందీ చిత్రం. నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు.
మచ్చ రవీందర్, నంబి వేణుగోపాలాచార్య కౌశిక, కళ్యాణ్ చక్రవర్తి, కంప్యూటర్ ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వేమూరి చంద్రశేఖర్, ఎడిటర్: సంపత్‌రాజ్, సత్రాజ్, సంగీతం: కె.లక్ష్మణ్‌సాయి.