భర్తల కష్టాలు చూపే ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ (మహిళల నుంచి మగాళ్లను రక్షించండి) అన్నది కాప్షన్. శరత్ చంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో… నేహా దేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించారు. నిన్నటి మేటి కథనాయకి ఆమని, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ మధునందన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ నెల 29న    ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో హీరోయిన్లు విలేకరులతో ముచ్చటించారు.
 
హీరో శరత్ చంద్ర మాట్లాడుతూ.. “మాది నిజామాబాద్. నాన్నగారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఆసక్తి. హీరో కావాలని కలలు కనేవాడిని. కొన్ని సినిమా షూటింగులు చూసిన తరవాత ఆసక్తి తగ్గింది. మా తల్లిదండ్రులు బాగా ఒత్తిడి చేయడంతో కాదని అనలేక అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేశా. అప్పుడు కూడా ఆసక్తి కలగలేదు. కోర్స్ పూర్తయ్యాక తరవాత ఏం చేస్తావని మా గురువుగారు అడిగితే ఇంటికి వెళ్తానని చెప్పా. ఆయన నాతో మాట్లాడి నా దృక్పథాన్ని మార్చారు. తరవాత ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ చేసే అవకాశం వచ్చింది. ఇందులో నేను న్యాయవాదిగా కనిపిస్తా. భార్యా బాధితుల తరపున వాదించే న్యాయవాది పాత్ర. నేను హీరోగా నటించానని అనుకోవడం లేదు. ఈ సినిమాలో కథే హీరో. మన దేశంలో మహిళలు, వృద్ధులకు, చిన్నారులకు అండగా కొన్ని చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. కానీ, భార్యల వల్ల అవస్థలు పడే భర్తల కోసం ఒక్క చట్టం కూడా లేదు. ఇండియన్ పీనల్ కోడ్ లో ఒక కీలకమైన సెక్షన్ ‘ఇల్లాలి పీనల్ కోడ్’గా మారడంతో ఎంతోమంది భర్తలు కష్టాలు పడుతున్నారు. మన దేశంలోని పెళ్లయిన మగాళ్ల ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు. దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఆ విషయాన్ని మా సినిమాలో చూపించాం. అలాగే, పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండాలనేది చెప్పాం. సినిమాలో కామెడీ ఉంది. మంచి పాటలు ఉన్నాయి. సందేశం ఉంది. కుటుంబ విలువలు ఉన్నాయి. యూత్, ఫ్యామిలీ అందరూ చూడవచ్చు” అన్నారు.
 
హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. “నా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. సంప్రదాయమైన అమ్మాయిగా, వెస్ట్రన్ డాన్సర్ గా కనిపిస్తా. కథతో పాటు నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. సినిమాలో సందేశంతో పాటు చక్కటి ప్రేమకథ కూడా ఉంది. ఈ నెల 29న సినిమా విడుదలవుతుంది. అందరూ చూడండి. నచ్చుతుందని ఆశిస్తున్నా. ప్రేక్షకులు తమ అభిప్రాయాలను మా పేస్ బుక్ పేజీలో రాయండి. అలాగే, ఇటీవల విడుదలైన పాటలకు మనిసిని రెస్పాన్స్ వస్తుంది. విననివాళ్ళు యూట్యూబ్ లో పాటలను వినండి” అన్నారు.