నా దృష్టిలో సినిమా రంగమనేది అందరికీ సరిపోయేది కాదు. ఇక్కడ పైకి రావాలంటే ఏం చేయాలనడానికి ప్రత్యేకించి పుస్తకాలూ, పద్ధతులూ ఏమీ ఉండవు. సరైన సమయంలో, సరైన చోట ఉండడం కూడా చాలా ముఖ్యం. నేను సినిమాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి చాలా మారింది. అప్పటి కన్నా ఇప్పుడు మరింత పోటీ పెరిగింది. కాబట్టి, సినిమా రంగంలోకి రావాలనుకొనేవాళ్ళు ఎన్ని కష్టనష్టాలకైనా, ఊహించనిది ఎదుర్కోడానికైనా సిద్ధమవ్వాలి. ఈ జీవితం, కెరీర్ పూలపాన్పేమీ కాదు. ఇక్కడ ఎవరూ ఎవరినీ పెద్దగా మెచ్చుకోరు. మీకు మీరే ఛీర్ లీడర్. ఎందుకంటే, కెమేరా వెనుక ఏం జరిగింది, మనం ఎంత కష్టపడ్డామన్నది ఎవరికీ అవసరం లేదు…..అంటూ తన సినిమా రంగ అనుభవాన్ని చెబుతోంది అందాల నటి ఇలియానా
మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది !
సినిమా పరిశ్రమ ప్రతి ఒక్కరినీ ఒంటరిని చేసేస్తుంది. అది ఏదో ఒక దశలో జరుగుతుంది. అందుకే, ఈ రంగానికి చెందిన చాలామంది తాము ఒంటరివాళ్ళమనీ, నైరాశ్యంలో మునిగిపోయామనీ అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే, అసలు ‘మనం ఏం కోరుకుంటున్నాం’ అన్నదాన్నిబట్టి ఇదంతా ఉంటుంది.
మధ్యలో ఒక నెల గ్యాప్ తీసుకొని, ఇంటికి వెళ్ళి మా కుటుంబ సభ్యులతో గడిపితే, అది కెరీర్‌కు దెబ్బే కావచ్చు. కానీ, నేను మాత్రం అదే చేస్తా. ఎందుకంటే, ఇటు వృత్తి జీవితానికీ, అటు వ్యక్తిగత జీవితానికీ మధ్య సమతూకం సాధించడం చాలా ముఖ్యం. లేదంటే, ఈ పైపై మెరుగుల రంగుల ప్రపంచంలో మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఓ రెండు, మూడేళ్ళయ్యాక వెనక్కి తిరిగి చూసుకొని, ఫలానా సినిమా చేస్తుండడం వల్ల కుటుంబంతో తగినంత సమయం గడపలేదే అని బాధపడకూడదు.
నా వరకు నాకు జీవితంలోనైనా, కెరీర్‌లోనైనా… ‘అలా కాకుండా, ఇలా జరిగి ఉంటే…’ అనే ఆలోచనకు అర్థం లేదు. నేను ఏదైనా సినిమా అవకాశం వదిలేశాననుకోండి.. దాన్ని మరొక నటి అందిపుచ్చుకొని, ఆమె కెరీర్ ఒక్కదెబ్బతో శిఖరాగ్రానికి చేరుకొని ఉండవచ్చు. అది చూసి, ‘అరెరే… మంచి ఛాన్స్ వదిలేశానే’ అని బాధపడడం నాకు అలవాటు లేదు.