వ్యాధి నివారణకూ ఇకపై ఇళయరాజా సంగీతం !

‘మేస్ట్రో’ ఇళయరాజా…. దశాబ్ధాలుగా తన అద్బుత సంగీతంతో కోట్లాది మందిని అలరిస్తున్న ‘మేస్ట్రో’ ఇళయరాజా సంగీతం ఇకపై వివిధ జబ్బులను నయం చేయడంలోనూ ఉపయోగ పడనుంది. వెయ్యికిపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఆయనది. వీనులవిందైన ఇళయరాజా సంగీతాన్ని వైద్యానికి ఉపయోగపడేలా మార్చేందుకు సింగపూర్‌కు చెందిన ప్రముఖ మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రి నిర్వాహకులు పని చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇళయరాజా రూపొందించిన సంగీత ఆల్బమ్‌లపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇళయరాజా కూడా ఇందుకోసం కొన్ని ప్రత్యేక బాణీలను సమకూర్చుతున్నట్లు సమాచారం. ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘పద్మవిభూషణ్‌’ పురస్కారంతో గౌరవించింది.
 
సహజ సంగీత వాయిద్యాలతో బాణీలు కట్టాలి !
“ఎలక్ట్రానిక్‌ సంగీతాన్ని దూరంగా పెట్టండి” అని సంగీతజ్ఞాని ఇళయరాజా ఈ తరం సంగీత దర్శకులకు హితవు పలికారు. ఆయన కొడుకు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా వైఎస్‌ఆర్‌ పిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్‌ రాజరాజన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’. యువ నటుడు హరీశ్, నటి రైసా విల్సన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇళన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్‌ శంకర్‌రాజానే సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇళయరాజా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు.
 
ఇళయరాజా మాట్లాడుతూ… తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన యువన్‌శంకర్‌రాజాను ఆశీర్వదించడానికి వచ్చానన్నారు. ఈ తరం సంగీత దర్శకులకు తాను చెప్పేదొక్కటేనని, ఎలక్ట్రానిక్‌ సంగీతాన్ని దూరంగా పెట్టి, సహజ సంగీత వాయిద్యాలతో బాణీలు కట్టాలని అప్పుడే నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని హితవు పలికారు. 
నిర్మాతగా మారిన యువన్‌ శంకర్‌రాజా మాట్లాడుతూ… తన మిత్రుడు ఇర్ఫాన్‌ ఒకసారి మీ అభిమానుల కోసం ఒక చిత్రం చేయవచ్చుగా అని అన్నాడన్నారు. తన బలమే ప్రేమ గీతాలని, సమీప కాలంలో అలాంటి పాటలు తన చిత్రాల్లో చోటు చేసుకోలేదని అన్నారు. అందుకే ప్రేమ గీతాలతో కూడిన చిత్రం చేయాలన్న ఆలోచనే ఈ ‘ప్యార్‌ ప్రేమ, కాదల్‌’ చిత్రం అని తెలిపారు.కార్యక్రమంలో ధనుష్‌ ,శింబు ,దర్శకుడు రామ్, శీనూరామసామి, అమీర్, అహ్మద్, నటుడు జయంరవి, విజయ్‌సేతుపతి, ఆర్య, కృష్ణ, శాంతను, నటి రేఖ, బింధుమాదవి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, సంతోష్‌నారాయణన్‌ పాల్గొన్నారు.