‘సంగీతజ్ఞాని’ ఇళయరాజా… ను దక్షిణాది చిత్రపరిశ్రమ వేనోళ్ల కొనియాడింది. సినీ సంగీతంలో ఆయనొక మహా గ్రంథమని ప్రముఖ తెలుగు నటుడు మోహన్‌బాబు కితాబిస్తే… స్వరలోకంలో ఇళయరాజా ఒక ‘స్వయంభు లింగం’గా సూపర్‌స్టార్ రజనీకాంత్ అభివర్ణించారు. తమిళ సినీనిర్మాతల మండలి నిర్వహించిన ‘ఇళయరాజా-75’ కార్యక్రమం సంగీతాభిమానులకు మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. ఇసైజ్ఞాని పాట వింటే చాలు లోకాన్నే మర్చిపోతామనుకుంటే… ఆ పాటకి మ్యూజిక్ మ్యాస్ర్టో రెహ్మాన్ స్వరాలు సమకూరిస్తే… ఊహిస్తేనే ఎంతో గొప్పగా ఉంది కదూ! ఈ అరుదైన సందర్భాన్ని నిజం చేసిందీ కార్యక్రమం. చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో రెండ్రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సంగీతాభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇళయరాజా పాటకు రెహ్మాన్ సంగీతం సమకూర్చిన దృశ్యం అభిమానుల్ని కట్టిపడేసింది. ‘ఇళయరాజా-75’లో ఇళయరాజా స్వయంగా ఆర్కెస్ర్టా నిర్వహించి పాటలు పాడడంతో అభిమానులు మైమరచిపోయారు.ఇళయ రాజా సంగీత విభావరిని ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి సినీ ప్రముఖులు, వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తమిళ నట దిగ్గజాలు రజనీకాంత్, కమల్‌హాసన్, దర్శకుడు శంకర్, విజయ్ సేతుపతి, తెలుగు పరిశ్రమ నుంచి మోహన్‌బాబు, వెంకటేష్ తదితరులు ఇళయరాజాపై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
రజనీకాంత్ మాట్లాడుతూ… ‘‘ఇళయరాజా ఒక స్వయంభు లింగం. తనకు తానుగా ఉద్భవించి అందర్నీ ఆకర్షించిన వ్యక్తి. నాకు చాలా మంచి పాటలు ఇచ్చారు. నాకన్నా మంచి పాటల్ని కమల్‌హాసన్‌కు ఇచ్చారు (సరదాగా). ఇళయ రాజాది, నాది ఆధ్యాత్మిక మార్గం. ఆయన పాటలు వింటే మనసుకు సాంత్వన కలుగుతుంది. కొన్ని కోట్ల మందిని తన సంగీతంతో పరవశింపజేసిన గొప్ప స్వరకర్త ఇళయరాజా.తొలి చిత్రం ‘అన్నక్కిలి’ నుంచి ఇప్పటివరకు ఇళయరాజా సంగీత సామ్రాజ్యం చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఇళయరాజా వంటి సంగీత మేధావులకు దైవ బలం ఉండడం వల్లే మన లాంటి వారికి మనశ్శాంతి కలిగించే సంగీతం అందించ గలుగుతున్నారు’
కమల్‌హాసన్ మాట్లాడుతూ… ‘‘ఇళయరాజా నాకు అన్న మాత్రమే కాదు గురువు. మాది 45 ఏళ్ల ప్రేమానుబంధం. నేను రాజకీయాల్లోకి రావడానికి సలహాలు ఇచ్చిన తొలి వ్యక్తి ఇళయరాజా’’అని చెప్పారు.అలాగే తన కుమార్తె శ్రుతిహాసన్ తో కలిసి కమల్‌హాసన్ కూడా వేదికపై పాటలు పాడి అభిమానులను అలరించారు.
మోహన్‌బాబు మాట్లాడుతూ… ‘ఇదే వైఎం సీఏ కాలేజిలో నేను చదువుకున్నాను. రజినీకాంత్ నాకు మంచి స్నేహితుడు. ఇళయరాజా కూడా స్నేహానికి విలువనిచ్చే మనిషి. నాకు మంచి హిట్ పాటలు ఇచ్చారు. మా స్కూల్‌కు ఒక ట్యూన్ అడిగితే, డబ్బు లేమి తీసుకోకుండానే ట్యూన్ చేసి ఇచ్చారు. అది స్నేహానికి ఆయన ఇచ్చే విలువ. సినీ సంగీతానికి సంబంధించినంతవరకు ఆయనొక మహా గ్రంథం’ అని పేర్కొన్నారు.ఇళయరాజాకు శ్రీవారి ప్రసాదం ఇచ్చి, శాలువాతో సత్కరించారు.
వెంకటేష్ మాట్లాడుతూ… ‘‘నేను నటించిన ప్రేమ, చంటి, బొబ్బిలిరాజా చిత్రాలకు గొప్ప సంగీతం అందించారు ఇళయరాజా’’అని చెబుతూ.. ‘బలపం పట్టి భామ వొళ్లో’ పాట పాడారు.
రెహ్మాన్ మాట్లాడుతూ… ‘ఇళయరాజా నాకు హెడ్మాష్టర్లాగా! ఆయనపై భయంతో కూడిన గౌరవం ఉంది. సాధారణంగా సంగీత దర్శకులంటేనే వారి దగ్గర కొన్ని వ్యసనాలు ఉంటాయని అంటుంటారు. కానీ, ఇళయరాజా సార్ తన జీవితాన్ని ఒక తపస్సులాగా జీవించారు. ఎలా జీవించాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మేధావులు సాధారణంగా ఎవర్నీ ప్రశంసించారు. కానీ, నేను ఇళయరాజా సార్ ప్రశంసలు పొందాను. నేను సమకూర్చే స్వరాలకు మూలం ఇళయరాజానే’ అని గొప్పగా చెప్పారు. అనంతరం ఇళయరాజా మాట్లాడుతూ.. ‘రెహ్మాన్ చిన్నవయసు నుంచే తెలుసు. తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా గడిపాడు. అదే చాలు.. నా దగ్గర 500కు పైగా పాటలకు పనిచేశాడు’ అని పేర్కొన్నారు.