నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వంలో స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం హీరో హీరోయిన్. ‘ఏ పైరెటెడ్ లవ్ స్టోరి’ అనేది క్యాప్షన్. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం సీనియర్ పాత్రికేయులు జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్‌లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జీయస్ కార్తీక్ మాట్లాడుతూ… పైరసీ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. సాంకేతిక పెరగడంతో పైరసీ చేయడం, చూడటం తప్పుకాదనే పరిస్థితికి చేరుకున్నాం. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం వుందని మా సినిమా ద్వారా చెబుతున్నాం ఈ రోజుల్లో ఏది చెప్పినా బోల్డ్‌గానే చెప్పాలి. అలా చెబితేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. అందుకే ఈ సినిమా ద్వారా పైరసీ వెనక వుండే వాస్తవాలు, పైరసీ సంబంధించి సినీ పరిశ్రమలో జరిగే వాస్తవాలు ఇలా అన్ని నిజాలే చెబుతున్నాను. ఈ కథ అనుకున్నప్పుడే నవీన్‌చంద్ర అయితే బాగుంటుంది అనుకున్నాను. కథ చెప్పిన తరువాత మరో ఆలోచనలేకుండా చెప్పింది చెప్పినట్టు తీయమని నవీన్ చెప్పాడు. నేను చెప్పాలనుకున్న కథకు కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కించాను. సినిమాలో నవీన్‌చంద్ర పైరసీకి పాల్పడే యువకుడిగా నెగెటెటివ్ ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడు. అలాంటి వ్యక్తికి ఓ నిర్మాత కూతురికి మథ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కథ విని చూడాలని చాలా మంది హీరోలు అడిగారు. ఇండస్ట్రీవారికి త్వరలో ప్రత్యేకంగా ఓ షో వేయబోతున్నాం. హీరో విశాల్ కూడా సినిమా చూస్తాను అన్నారు. ఇండస్ట్రీలో వున్న హీరోల బైట్లతో రోలింగ్ టైటిల్ వేయబోతున్నాం. నిర్మాత నాకు మంచి మిత్రుడు కావడం వల్ల ఏ విషయంలోనూ రాజీపడలేదు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.
నవీన్‌చంద్ర మాట్లాడుతూ… ఈ కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను నటించిన తొలి సినిమా విడుదలైన రోజే పైరసీ అయింది. అది తెలిసి ఏమీ చేయలేకపోయాను. ఆ తరువాత పెద్ద పెద్ద చిత్రాలు కూడా పైరసీ భారిన పడ్డాయి. పైరసీ చేయడం అంటే నిర్మాతల సొమ్మును దోచుకోవడమే. ట్యాక్సీవాలా విడుదలకు ముందై పైరసీ అయినా ఆ చిత్రాన్ని ఆదరించి ఫ్యాన్స్ తలుచుకుంటే ఎలాంటి పైరసీ పనిచేయదని నిరూపించారు. అలా అందరి ఫ్యాన్స్ ముందుకు వస్తే పైరసీని ఆరికట్టేయెచ్చు అన్నారు. పైరసీని ఎలా అరికట్టాలనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. తప్పకుండా మా చిత్రం మంచి కమర్షియల్ విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని నిర్మాత తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.ఎ. రాజు, సురేష్ కొండేటి, గాయత్రి సురేష్ పాల్గొన్నారు. నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి, అభిమన్యుసింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్చిక్ బబ్లూ, సారికా రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, డైరెక్టర్ ఆఫ్ పోటోగ్రఫీ: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: జీయస్ కార్తీక్.