హన్సిక మోత్వాని… “ప్రపంచంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటిని చూసే అవకాశం కలుగుతుందో లేదో!?”…అని అంటోంది హన్సిక.హన్సికకు టూర్లకు వెళ్లడమంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలకు వచ్చి 19 ఏళ్లు పూర్తయింది. బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ బికినీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో షాక్ అయ్యారు. అంతేకాదు తన తాజా చిత్రం ‘మహా’కు సంబంధించిన వివాదాస్పద పోస్టర్లతో తమిళనాట బోల్డంత చర్చను రేపారు.
“నాకు ప్రయాణలంటే చాలా ఇష్టం. ప్రపంచాన్నంతా చూసేయాలన్నది నా కోరిక. తీరుతుందో లేదో! అందుకే షూటింగ్స్‌కు బ్రేక్ వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తాను. ఇప్పటికే చిత్రీకరణల కోసం చాలా దేశాలకు వెళ్లాను. ఆ ప్రాంతాల వ్యక్తులతో మమేకం కావడాన్ని ఎంతో ఇష్టపడతాను. అంతేకాదు ఫోటోలూ తప్పనిసరి. నా జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా ఉంచుకోవాలనుకుంటాను.
ప్రపంచంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటిని చూసే అవకాశం కలుగుతుందో లేదో!?. నా అదృష్టం ఏమిటంటే, చాలా తక్కువ సమయంలో అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాలను చూశాను. ఈ ప్రయాణ అనుభవాలు నన్ను మరింత రాటుదేల్చాయి.
ఆలోచనలను సరైన దారిలో నడిపిస్తాయి !
కొన్నేళ్ల క్రితం నా పుట్టినరోజు వస్తుందనగా నా ఫ్రెండ్స్‌తో కలిసి పెద్ద ట్రిప్ వేశాను. దాన్ని నా జీవితంలో మర్చిపోలేను. బార్సిలోనా, స్పెయిన్, మ్యాడ్రిడ్ నగరాలను చూశాను. మొదట ఆగింది నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్స్టర్డ్యామ్లో. ఆ తర్వాత బార్సిలోనా, స్పెయిన్లకు వెళ్లాను. స్పెయిన్‌లో నాకు బాగా నచ్చిన ప్రాంతం ఇబిజా. పార్టీలకు కేరాఫ్ అడ్రస్! ఇక చివర్లో ప్యారిస్ చూశాను. ఆ నగరం అందాల గురించి కొత్తగా చెప్పడానికేముంటుంది! మనలోని నిజమైన వ్యక్తిని మేలుకొలిపేవి ఇలాంటి పర్యటనలే. చాలా సార్లు కొన్ని విషయాలను ఊహాతీతంగా ఆలోచిస్తాం. కానీ వాస్తవంలోకి వెళితే, అసలు మనవి ఒట్టి భ్రమలని తేలిపోతాయి. అందుకు కొన్నిసార్లు ఇలాంటి ప్రయాణాలు మన ఆలోచనలను సరైన దారిలో నడిపిస్తాయని నా అభిప్రాయం.
సందీప్ కిషన్ చిత్రంలో హన్సిక
సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ BA BL’ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఓపెనింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం కర్నూలులో మొదలైంది. సందీప్ కిషన్, హన్సిక ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జి.నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృధ్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.