జి.వి ప్రకాష్ కుమార్, నిక్కీ గల్రానీ జంటగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో `చెన్నై చిన్నోడు`. `వీడి లవ్ లో అన్నీ చిక్కులే` అనే ఉప శీర్షిక టైటిల్ తో శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై వి.జయంత్ కుమార్ (బి.టెక్) తెలుగులో అనువదిస్తున్నారు. యశ్వంత్ సాయికుమార్ సమర్పకుడు. ఎం. రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్టు లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ టీజర్, ఫస్టు లుక్ ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, `తమిళ్ లో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. తెలుగులో చక్కని క్యాచీ టైటిల్ తో జయంత్ అనువదిస్తున్నాడు. నిర్మాతగా ఆయనకు తొలి సినిమా ఇది. నేను కూడా డబ్బింగ్ సినిమాలతోనే నిర్మాతగా పరిశ్రమకు పరిచయమై తర్వాత పెద్ద సినిమాలు నిర్మించాను. జయంత్ కూడా భవిష్యత్ లో మంచి సినిమాలు నిర్మించి పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి. సినిమా చూడలేదు కానీ ప్రకాష్ రాజ్ పాత్ర చాలా బాగుందంటున్నారు. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. ఈ చిత్రం విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి` అని అన్నారు.
నిర్మాత వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ, `తమిళ సినిమా బాగా నచ్చడంతో ఇలాంటి మంచి సినిమాను తెలుగు ప్రేక్షక్షులకు అందించాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నమిది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ప్రకాష్ రాజు గారి పోలీస్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. జి.వి ప్రకాష్ నటన తో పాటు, సినిమాకు మంచి సంగీతాన్ని కూడా అందించారు. అందమైన ఫారెన్ లోకేషన్లలో పాటలు చిత్రీకరించారు. ఆ పాటల్లో కూడా వినోదం పడటం హైలైట్ అవుతుంది. నా తొలి ప్రయత్నానాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.కృష్ణ మాట్లాడుతూ, ` లవ్, కామెడీ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నూటికి నూరుశాతం సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత కె.వి సత్యానారాయణ గారి చేతుల మీదుగా టీజర్ , ఫస్టు లుక్ ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
పాటలు రచయిత సి.హెచ్ పూర్ణాచారి మాట్లాడుతూ, ` తమిళ వెర్షన్ సినిమా చూశాను. చాలా బాగుంది. మాటలు చక్కగా కుదిరాయి. సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: వెలిదేండ్ల రాంమూర్తి, పాటలు: సి.హెచ్ పూర్ణాచారి, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్.కృష్ణ, నిర్మాత వి.జయంత్ కుమార్ (బి.టెక్).