(నేడు రేలంగి వెంకట్రామయ్య 45 వ వర్థంతి)
“రాళ్ళు తిని అరిగే రోజుల్లో జేబులో నాలుగు రాళ్ళు కూడా ఉండేవి కావు. కానీ నాలుగు రాళ్ళు జేబులో ఉన్న కాలంలో మరమరాలు తిన్నా అరగడంలేదు”… 1975 ప్రాంతం లో తాడేపల్లిగూడెం లో తనను పలుకరించడానికి వచ్చిన మిత్రులతో రేలంగి వెంకట్రామయ్య అన్న మాటలివి. “నవ్వూ, ఏడుపూ కలిస్తే సినిమా. ఏడుపూ, నవ్వూ కలిస్తే జీవితం. బాగా డబ్బు వుండి దర్జాగా బతకడం జీవితం కాదు. అలాగే ఏమీ లేకుండా ఎప్పుడూ బాధపడడం కూడా జీవితం కాదు. ఈ రెండూ పెనవేసుకొని వుంటేనే అసలైన జీవితానికి సిసలైన అర్ధం… లేకుంటే జీవితమే వ్యర్ధం”… ఈ జీవిత సత్యాన్ని తనదైన శైలిలో చెప్పింది తెలుగు చలనచిత్ర హాస్యబ్రహ్మ రేలంగి వెంకట్రామయ్య. జీవితంలో మిట్టపల్లాలు, ఎగుడు దిగుడులు అన్నీ చూసినవాడు రేలంగి. చీకటి వెలుగులు, మంచీ చెడ్డలూ అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞాని రేలంగి. జీవితంలో ఏడ్చాడు, నవ్వాడు….సినిమాలో ఏడ్పించాడు, నవ్వించాడు. తెలుగు ప్రజల ఆదరాన్ని చూరగొన్నాడు. ‘మా రేలంగోడు’ అని అభిమానంగా పిలిపించుకున్నాడు. చెప్పులు లేకుండా నడచిన పాండీ బజారులో ఏనుగు అంబారీమీద ఊరేగాడు. పుట్టిపెరిగిన నేలమీద గజారోహణం చేశాడు. అసాధ్యాలను సాధ్యాలుగా మలుచుకున్నాడు. అగ్రశ్రేణి హీరో రామారావు చేత ‘బావా’ అని ఆదరంగా పిలిపించుకున్నాడు. నటీనటులచేత, జర్నలిస్టులచేత సత్కారాలు పొందాడు. దేశాధ్యక్షుని చేతిమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకొన్న తొలి హాస్యనటుడిగా చరిత్ర పుటలకెక్కాడు.. పుట్టిన నేలతల్లిని మరవకుండా చివరి దశలో అక్కడే తనువు చాలించాడు.
ఏడవ యేటనుంచే రంగస్థలంమీద నాటకాలు
రేలంగి వెంకట్రామయ్య పుట్టింది నవంబర్ 27 న 1910న రావులపాలెం సమీపంలోని రావులపాడు గ్రామంలో. కాపురం మాత్రం కాకినాడ జగన్నాధపురంలో. తండ్రి రేలంగి రామస్వామి. తల్లి అచ్చయమ్మ. రేలంగికి మూడో ఏడు రాకముందే తల్లి మరణించింది. ఆమె చెల్లెలు గౌరమ్మను రామస్వామి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ఆవిడే రేలంగిని పెంచి పెద్దచేసింది. రేలంగి తండ్రి కాకినాడలో సంగీతం మాస్టారుగా వుండేవారు. హార్మోనియంలు రిపేరు చేసే దుకాణం కూడా రేలంగి తండ్రికి వుండేది. ఆయన పిల్లలకు సంగీత పాఠాలు బోధించేవారు. అలా రేలంగికి కూడా కాస్త సంగీతం అబ్బింది. తండ్రి రేలంగిని పోలీసు ఇనస్పెక్టరు చెయ్యాలని తండ్రి కలలు కనేవాడు. కానీ రేలంగి రూటు వేరు. కాకినాడ మెక్లారిన్ హైస్కూలులో చదువుతూ, చదువు ఎగ్గొట్టి నాటకాల వెంట తిరిగేవాడు. దాంతో చదువుసంధ్యలు తొమ్మిదో క్లాసుతోనే ఆగిపోయాయి. గండికోట జోగినాధం వద్ద శిష్యరికం చేసి నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తరఫున రేలంగి ఏడవ యేటనుంచే రంగస్థలంమీద నాటకాలు వేసేవాడు. వాటిలో ఆడవేషాలు కూడా ఉండేవి. ‘నర్తనశాల’ నాటకంలో ‘బృహన్నల’ వేషం వేసి మెప్పించాడు. అదే రేలంగి వేసిన తొలి వేషం. కొంతకాలం ఆంధ్రగాన బాలసంఘం, ఆంధ్ర సేవాసంఘం మొదలైన నాటక సమాజాలలో ‘ప్రమీలార్జునీయం’లో సుయోగుడు, ‘చింతామణి’ నాటకంలో సుబ్బిశెట్టి, ’విప్రనారాయణ’లో శ్రీనివాసుడు, ‘శ్రీకృష్ణ తులాభారం’లో వసంతకుడు వంటి పాత్రలు పోషించాడు. ‘రామదాసు’, ‘రోషనార’, ‘చింతామణి’, ‘మోహినీ భస్మాసుర’ వంటి నాటకాల్లో ప్రాధాన పాత్రలు ఆయనవే. జొన్నవిత్తుల శేషగిరిరావు, పారుపల్లి సుబ్బారావుల నాటక సమాజంలో చేరి ‘హరిశ్చంద్ర’, ‘రంగూన్ రౌడి’ నాటకాల్లో పాత్రలు పోషించాడు. ఆ ట్రూపుతో కలిసి కోస్తా జిల్లాలన్నిట నాటకాల్లో పాల్గొన్నాడు.
ఆరోజుల్లో మూకీ సినిమాలు ఆడేవి. వాటిని చూస్తూ, నాటకాలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న రేలంగిని దారిలో పెట్టాలని, చదువుకోకుండా నాటకాలబారిన పడ్డ అతనికి ముకుతాడు వేయాలని తండ్రి రామస్వామి నిర్ణయించాడు. తాడేపల్లిగూడెం శివార్లలో వుండే పెంటపాడు గ్రామంలో చేబోలు వీరాస్వామి కుమార్తె బుచ్చియమ్మతో వివాహం జరిపించాడు. వారి వివాహం 1933 డిసెంబరు 8వ తేదీన జరిగింది. కానీ రేలంగికి మాత్రం సినిమాల్లో నటించాలనే కోరిక సజీవంగానే వుంది. 1935లో కలకత్తా కాళీ ఫిలిమ్స్ వారు ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా నిర్మించేందుకు చిత్ర నిర్మాతలు రాజారావును ముఖర్జీతో కలిసి దర్శకత్వం వహించేందుకు కలకత్తా రమ్మని కబురు పంపారు. రాజారావుతోబాటు గండికోట జోగినాథం, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఆర్. వెంకట్రామయ్య, హార్మోనిస్టు దూసి శాస్త్రి, తబలిష్టు ఎం.పరదేశి కూడా అక్కడకు ప్రయాణమయ్యారు. పరదేశి రేలంగికి మిత్రుడే. అతని చొరవతో ఆహ్వానం లేకపోయినా రాజారావు బృందంతో కలిసి రేలంగి కూడా కలకత్తాకు వెళ్లాడు. ఆ సినిమాలో వసంతకుడి వేషం జోగినాథానికి ఇచ్చారు. రేలంగి ఆ చిత్ర నిర్మాతలను ఒప్పించి అందులో చాకలివాడు, గొల్లవాడు, వాసుదేవుడు వంటి మూడు చిన్నచిన్న వేషాలు వేయగలిగాడు. అందులో జయసింగు కృష్ణుడుగా, కపిలవారి రామనాథశాస్త్రి నారదుడుగా, ఋష్యేంద్రమణి సత్యభామగా, సభారంజని రుక్మిణిగా, లక్ష్మిరాజ్యం నళినిగా, కాంచనమాల మిత్రవిందగా నటించారు. నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరూ స్టూడియోలోనే వుండేవాళ్ళు. రేలంగికి 70 రూపాయల పారితోషికం ముట్టింది. సినిమా ఆర్ధికవిజయం సాధించలేదు. రేలంగి కాకినాడ వచ్చి తిరిగి నాటకాల్లో వేషాలు వెయ్యసాగాడు.
తరవాత చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ‘సతీ అనసూయ’, ‘ధృవ విజయము’ (1936) చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. ఇదే మనదేశంలో విడుదలైన తొలి బాలల చిత్రం. అందులో రేలంగి ఇంద్రుడి వేషం వేశాడు. అంతేకాదు పుల్లయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రొడక్షన్ అసిస్టెంటుగా పనిచేశాడు. అలా పుల్లయ్య వద్ద ప్రొడక్షన్ అసిస్టెంటుగా, కాస్టింగ్ ఏజంటుగా, సహాయ దర్శకుడిగా, వ్యక్తిగత కార్యదర్శిగా, ప్రొడక్షన్ మేనేజరుగా 1937 నుంచి 1947 వరకు పదేళ్లపాటు ‘దశావతారాలు’, ‘కాసులపేరు’, ‘మోహినీభస్మాసుర’, ‘సత్యనారాయణవ్రతం’, ‘వరవిక్రయం’, ‘మాలతీమాధవం’, ‘బాలనాగమ్మ’, ‘నారదనారది’, ‘గొల్లభామ’ వంటి సినిమాలకు పనిచేశాడు. వరవిక్రయం(1939)లో బిచ్చగాడుగా నటిస్తూ ‘జీవా…మాయకాయమురా…మమతలలోబడి చెడితివిగాదరా’ అనే పాటను రేలంగి పాడాడు. ‘బాలనాగమ్మ’ (1942)లో తలారి రాముడుగా, ‘గొల్లభామ’ (1947)లో రాజాస్థానంలో వుండే విదూషికుడుగా రేలంగి నటించి గుర్తింపు తెచ్చుకునాడు.
రేలంగి కాస్టింగ్ ఏజంటుగా పనిచేస్తుండడంతో కృష్ణవేణి, పుష్పవల్లి, హైమవతి, భానుమతి, అంజలీదేవి వంటి నటీమణుల్ని సినిమాల్లో పరిచయం చేసే అవకాశం రేలంగికి దక్కింది. వాళ్ళు పెద్ద నటీమణులుగాను, నిర్మాతలుగాను మారాక రేలంగికి సినిమాల్లో మంచిమంచి పాత్రలను ఇచ్చి గౌరవించారు. ‘వరవిక్రయం’ సినిమాలో భానుమతి నటించడానికి కారకులు రేలంగి. అలాగే అంజలీదేవి ‘గొల్లభామ’లో నటించడానికి ఆమెను పుల్లయ్యకు పరిచయం చేసిన వ్యక్తి రేలంగి. ఇది నిజం. గొల్లభామ సినిమాకి పనిచేశాక రేలంగి కాకినాడ వచ్చేశాడు. భవిష్యత్తుని మాత్రం సినిమా రంగంలోనే తేల్చుకోవాలనే కృతనిశ్చయంతో కుటుంబంతో సహా మరలా మద్రాసు వెళ్ళాడు. ఎక్కువ అద్దెలు కట్టలేక తేనాం పేటలో ‘దెయ్యాలమేడ’ అని పేరుబడిన ఒక ఇంటిలో నెలకు 8 రూపాయల అద్దెకు దిగాడు. అయితే మంచి పాత్రలు ఆయనకు దొరకలేదు. నటి ‘కనకం’ సాయంతో చిన్నా, చితకా వేషాలు సంపాదించేవాడు. భోజనం లేక గంజినీళ్లు తాగి బ్రతికాడు. ఆకలితో శోష వస్తే నిద్ర నటించి గడిపాడు .
ఆ రెండు చిత్రాలతో మంచి పేరు
వైజయంతి ఫిలిమ్స్ వారు 1948లో పింగళి నాగేంద్రరావు నాటకం ఆధారంగా చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ‘వింధ్యరాణి’ చిత్రాన్ని నిర్మించారు. వింధ్యరాజుగా డి.వి.సుబ్బారావు, వింధ్యరాణిగా పుష్పవల్లి నటించిన ఈ చిత్రంలో మంధుడు అనే హాస్యపాత్రలో రేలంగి నటించాడు. రేలంగికి జి.వరలక్ష్మి జంటగా నటించింది. ఆ చిత్రంలో నటించి నందుకు రేలంగికి మూడు వందల పారితోషికం ముట్టింది. ఆర్ధికంగా కాస్త వెసులుబాటు లభించింది. ‘వింధ్యరాణి’ చిత్రం ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా రేలంగికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పుడే శోభనాచల స్టూడియోస్ అధిపతి మీర్జాపురం రాజావారు ‘కీలుగుఱ్ఱం’ (1949) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజావారి శ్రీమతి కృష్ణవేణి రేలంగిని గుర్తుపెట్టుకొని అక్కినేని స్నేహితుడు గోవిందు పాత్రను ఇచ్చింది. కేకిని పాత్రలో కనకం రేలంగికి జంటగా నటించింది. ఇందులో రేలంగి ‘చెంపకేసి నాకింపుచేసితివి చక్కనిదానవే చినదానా’ అనే యుగళగీతాన్ని కనకంతో కలిసి ఆలపించారు. ఈ చిత్రంలో నటించినందుకు రేలంగికి మూడువందల రూపాయల పారితోషికం లభించింది. ఆ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ రెండు చిత్రాలు రేలంగి నటనా వైదుష్యాన్ని చూపి అతనికి మంచి పేరు సంపాదించి పెట్టాయి. 1949లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారి ‘గుణసుందరి’ చిత్రం విడుదలైంది. అందులో రేలంగి ఉగ్రసేన మహారాజు (గోవిందరాజుల సుబ్బారావు)మేనల్లుడు కాలమతిగా నటించారు. అందులో ‘అలువే యెదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం’ అనే పాటను కూడా పాడారు. విడుదలైన అన్నికేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవాలు, అర్ధ శతదినోత్సవాలు జరుపుకొని విజయ దుందుభి మ్రోగించింది.
ఈ చిత్ర విజయంతో రేలంగికి డిమాండు పెరిగిపోయింది. రేలంగి సినిమాలో లేకుంటే చిత్రం విజయవంతం కాదన్న బలమైన నమ్మకం నిర్మాతల గుండెల్లో నాటుకుంది. రేలంగి పెద్ద ‘స్టార్’ అయిపోయారు. అప్పుడే ఎలైడ్ ప్రొడక్షన్స్ పతాకం మీద కస్తూరి శివరావు సొంతంగా ‘పరమానందయ్య శిష్యులు’ (1950) చిత్రం నిర్మిస్తే, అందులో చంద్రసేనుడుగా నటించిన అక్కినేని సరసన హీరోయిన్ హేమగా గిరిజ నటించింది. రేలంగి రావులపల్లి, నల్లరామ్మూర్తి లతో కలిసి ‘పరమానందయ్య శిష్యుల’లో ఒకడిగా నటించారు. గిరిజతో రేలంగికి ఈ చిత్రం ద్వారా పరిచయం ఏర్పడింది. భవిష్యత్తులో ఇద్దరూ మంచి హిట్ పెయిర్ అవుతారని రేలంగి కూడా అప్పట్లో ఊహించలేదు. ‘గుణసుందరి’ సినిమా తరువాత రేలంగికి విభిన్నమైన పాత్రలు, రకరకాల వేషాలు రాసాగాయి. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలకు అచ్చుగుద్దినట్లు సరిపోయే నటుడుగా రేలంగికి పేరొచ్చింది. ప్రేక్షకులు అభిమానంగా ‘రేలంగోడు’ అని పిలిపించుకోవడం మొదలైంది.
హీరోతో సమాన ప్రాధాన్యం
రేలంగి నటజీవిత విజయానికి రచయితలు కూర్చిన సంభాషణలు, ఆహార్యంలో అమరిన స్వరూపం, ఆ స్వరూపానికి అనువైన నటనా కౌశలం, సంభాషణలు పలికే టైమింగ్ అచ్చివచ్చిన వరాలని చెప్పవచ్చు. ‘షావుకారు’, ‘పాతాళభైరవి’, ‘పక్కింటి అమ్మాయి’, ‘పెద్దమనుషులు’, ‘రాజు-పేద’, ‘విప్రనారాయణ’, ‘జయసింహ’, ‘మిస్సమ్మ’, ‘అర్ధాంగి’, ‘రోజులు మారాయి’, ‘దొంగరాముడు’, ‘జయం మనదే’, ‘చరణదాసి’, ‘తోడికోడళ్ళు’, ‘దొంగల్లో దొర’, ‘భాగ్యరేఖ’, ‘మాయాబజార్’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘చెంచులక్ష్మి’, ‘జయభేరి’, ‘ఇల్లరికం’, ‘నమ్మినబంటు’, ‘శాంతినివాసం’, ‘పెళ్ళికానుక’, ‘వాగ్దానం’, ‘ఇద్దరు మిత్రులు’, ‘భార్యాభర్తలు’, ‘జగదేకవీరుని కథ’, ‘కలసివుంటే కలదు సుఖం’, ‘రక్తసంబంధం’, ‘కులగోత్రాలు’, ‘ఆరాధన’, ‘చదువుకున్నఅమ్మాయిలు’, ‘లక్షాధికారి’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘వెలుగునీడలు’, ‘రాముడు భీముడు’, ‘ప్రేమించి చూడు’, ‘అంతస్తులు, ఆత్మగౌరవం’, ‘నవరాత్రి’, ‘లేతమనసులు’, ‘ఆస్తిపరులు’, ‘రహస్యం’, ‘గూఢచారి 116’, ‘భక్త ప్రహ్లాద’, ‘పూజ’ చిత్రాలలో రేలంగి పోషించిన పాత్రలను ఒకసారి గుర్తుచేసుకుంటే… ఎంతటి నటనా వైవిధ్యం మనకు కనపడుతుందో చెప్పలేం.
రేలంగి తొలిరోజుల్లో తనపాటలు తనే పాడుకునేవారు. ‘పాతాళభైరవి’లో ‘వినవే బాలా నా ప్రేమ గోలా’, ‘తాళలేనే నే తాళలేనే అమ్మలారా ఓయమ్మలారా’,పాటలు; ‘విప్రనారాయణ’లో ‘ఆడది అంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం’ పాట; ‘మిస్సమ్మ’ లో ‘ధర్మం చెయ్ బాబూ కాణీ ధర్మం చెయ్ బాబూ’, ‘ సీతారాం సీతారాం, సీతారాం జై సీతారాం’; ‘ఎత్తుకు పైఎత్తు’ లో ‘ఎవడనుకున్నావు’ పాటలు వాటిలో కొన్ని మాత్రమే. తూర్పుయాసలో ‘పెండ్లిపిలుపు’ చిత్రంలో జూనియర్ లాయర్‌గా రేలంగి పలికిన మాటలు మరపురావు. అలాగే ‘పాతాళభైరవి’లో ‘అక్కూ’ అంటూ రాణి వెంటతిరిగే తమ్ముడుగా, ‘నర్తనశాల’లో కౌరవసేనను చూసి వణికిపోయే ఉత్తర కుమారుడుగా, ‘పెద్దమనుషులు’లో తిక్కశంకరయ్యగా, ‘దొంగరాముడు’లో వీరభద్రయ్యగా, ‘మిస్సమ్మ’లో దేవయ్యగా, ‘జయభేరి’లో లచ్చన్న బంగారయ్యగా, ‘అగ్గిరాముడు’లో ఫోర్ ఫార్టీ వన్‌గా, ‘సువర్ణసుందరి’లో కైలాసంగా, ‘జగదేకవీరుని కథ’లో రెండు చింతలుగా, ‘అప్పుచేసిపప్పుకూడు’లో భజగోవిందంగా, ‘ప్రేమించి చూడు’లో బుచ్చబ్బాయిగా, ‘కలసివుంటే కలదుసుఖం’లో విలన్‌గా, ‘వెలుగునీడలు’లో కొసవెర్రి వెంగళప్పగా, ‘భార్యాభర్తలు’లో లాయరుగా, ఇలా పైన చెప్పిన సినిమాలన్నిటిలోనూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ, పాత్రోచితంగా సంభాషణలు నొక్కి వక్కాణించడం హాస్యనటుడిగా ఒక్క రేలంగికే సాధ్యమైంది. అందుకే హీరోతో సమాన ప్రాధాన్యంగా ఉండేలా రచయితలు రేలంగి పాత్రలను తీర్చిదిద్దారు.
ఎన్నో సరదా పాటలు పెట్టారు
అంతేకాదు రేలంగి పోషించిన ఏపాత్రైనా కథలో ప్రధానభాగంగా ఉండేదేకానీ, అతికించినట్లు వుండేదికాదు. ’చెంచులక్ష్మి’ చిత్రంలో నారడుడుగా ‘నీలగగన ఘన శ్యామా’ అనే హరినామ కీర్తన చేస్తూ నటిస్తుంటే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. రేలంగి కోసం ‘సరదా సరదా సిగిరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టు’ (సిరిసంపదలు), ‘అయ్యయ్యో చేతిలో డబ్బులుపోయెనే’ (కులగోత్రాలు), ‘హరిగోవిందగోవింద’ (వెలుగు నీడలు), ‘ఇంగ్లీషులోన మ్యారేజి’ (ఆరాధన), ‘గనగజా తనయం సహృదయం’ (వాగ్దానం), ‘చెక్కిలిమీద చెయ్యిజేర్చి చిన్నదానా’ (మాంగల్యబలం), ‘ఆ దేవుడు మనిషిగ పుట్టాలిరా’ (అంతస్తులు), ‘నీసోకు చూడకుండ నవనీతమ్మో’ (తోడికోడళ్ళు), ‘భలేచాన్సులే బలే చాన్సులే’ (ఇల్లరికం) వంటి ఎన్నో సరదా పాటలు ఆరోజుల్లో సినిమాల్లో పెడితే ప్రేక్షకులు ఎంతబాగా ఆదరించారో తెలియందికాదు. ‘మాయాబజార్’ చిత్రంలో లక్ష్మణకుమారుడుగా ఆ రాజదర్పాన్ని ఆత్మాభిమానాన్ని ఉట్టిపడే రీతిలో రేలంగి ప్రదర్శించిన హావభావాలు మరువలేం. సహనటులు రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, చదలవాడ, బొడ్డపాటి, నల్లరామమూర్తి, సీతారాంలకు రేలంగి పెద్దదిక్కుగా వుండేవారు. తెలుగు సినిమాల్లో రేలంగి-గిరిజ జంటను గురించి, తమిళంలో ఎస్.ఎస్. కృష్ణన్-మధురం గురించి గొప్పగా చెప్పుకునేవారు. రేలంగి సూర్యకాంతం, షావుకారు జానకి, జి.వరలక్ష్మి, జమున, కృష్ణకుమారి, సురభి బాలసరస్వతి, సీత, రాజసులోచన, ఎస్. వరలక్ష్మిల సరసన రేలంగి నటించారు. 1960లో రేలంగి తిరుమల పిక్చర్స్ బ్యానర్ మీద ‘సమాజం’ అనే పేరుతో సినిమా నిర్మించారు. అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించగా కుమారుడు సత్యనారాయణబాబు నిర్మాణ పర్యవేక్షణ కావించారు. ఈ సినిమాతోనే హాస్యనటుడు రాజబాబు సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా మాత్రం గొప్పగా ఆడలేదు.
ఆదుకున్న మిత్రులను మరచిపోలేదు
రేలంగికి ఒకడే కుమారుడు. పేరు సత్యనారాయణ బాబు. తన గారాబం వలన అతనికి పెద్ద చదువులు అబ్బలేదు. సినిమాల పంపిణీ వ్యాపారం చేసేవాడు. రేలంగి బావమరది కూతురుతో సత్యనారాయణ బాబుకు 1958లో వివాహం జరిగింది. రేలంగి వృద్ధిలోకి వచ్చాక కష్టాలను, కష్టాలలో ఆదుకున్న మిత్రులను మరచిపోలేదు. తను తిండితిప్పలు లేకుండా అవస్థపడినవాడు కనుక.. తను భోజనం చేసేటప్పుడు కనీసం పాతికమందికి భోజనం పెట్టేవారు. తనకు చదువు అబ్బలేదు కనుక.. చదువుకోసం అర్దించే వాళ్లకు ఆర్దిక చేయూత ఇచ్చేవారు. మద్రాసులో కాలినడకన మైళ్ళకొద్దీ నడిచినవాడు కనుక.. తను స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ ఎంతోమందికి లిఫ్ట్ ఇచ్చేవారు. రేలంగి ఏనాడూ ధనమదంతో విర్రవీగలేదు. తనకు కొండంత అండగా నిలిచిన పాత సైకిల్ని భద్రంగా దాచుకున్నారు. ‘చిత్రపరిశ్రమ నన్ను తరిమేస్తే, యీ ఆస్తిపాస్తులన్నీ ఎక్కడివక్కడ వదిలేసి, ఈ సైకిలు తొక్కుకుంటూ తాడేపల్లిగూడెం వెళ్లిపోతాను’ అని స్నేహితులతో అనేవారు. తాడేపల్లిగూడెంలో వున్నప్పుడు ఇంటినుంచి థియేటర్‌కు వెళ్లాలనుకుంటే రిక్షాలో వెళ్లేవారు. తనను సినిమాకు పరిచయం చేసిన చిత్తజల్లు పుల్లయ్యంటే రేలంగికి ఎంతో భక్తీ, గౌరవం కూడా. తను వున్నత స్థాయికి చేరుకున్న తరువాత కూడా పుల్లయ్య ఎదుట ఎప్పుడూ కూర్చోలేదు. సేవకుడిలా ఆయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడేవారు. రేలంగి చిత్ర మందిర్ థియేటర్ ప్రారంభోత్సవానికి పుల్లయ్యను ఆహ్వానించి సత్కరించారు. కె.వి. రెడ్డి గారిచేత థియేటర్ ప్రారంభోత్సవం కావించారు. రామారావు, నాగేశ్వరరావు కన్నా ముందే చిత్రసీమలో అడుగుపెట్టినవాడు కావడంతో ఇద్దరూ రేలంగిని ఎంతగానో గౌరవించేవారు. రామారావు రేలంగిని ‘బావ గారూ’ అని సంబోధించేవారు. రేలంగికి దైవభక్తి మెండు. ఎన్నో గుప్తదానాలు చేసేవారు. తనవద్ద పనిచేసిన డ్రైవరుకు వుద్ధాప్యం వలన కళ్లు కనుపించకపోతే, అతనికి ఒక ఇల్లు కట్టించి నెలనెలా పించను వచ్చేలా కొంత పెద్ద మొత్తాన్ని బ్యాంకులో వేసి ఆదుకున్నారు. రేలంగికి ఒకే ఒక చెల్లెలు. ఆమెకు కాకినాడలో పెద్ద ఇల్లు కట్టించి, ఆ ఇంటి బాగోగుల్ని తనే చూసేవారు. అలాంటి దానాలు రెండో కంటికి, చేతికి తెలియకుండా ఎన్నో చేశారు.
భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డు
1970లో భారత ప్రభుత్వం రేలంగికి ‘పద్మశ్రీ’ అవార్డు ఇచ్చి సత్కరించింది. పద్మ పురస్కారం అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి కావడం విశేషం. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి రేలంగి సెనేట్ సభ్యుడుగా వ్యవహరించారు. ఆంధ్రనాటక కళాపరిషత్తు, హైదరాబాదు వారు 1955లో రేలంగికి ఘనసత్కారం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఫెలోషిప్ ఇచ్చారు. విజయా గార్డెన్స్‌లో నటీనటులందరూ కలిసి రేలంగిని ఘనంగా సత్కరించారు. తోటి కళాకారులు కలిసి సహ కళాకారుణ్ణి సత్కరించడం విశేషం. ఇక సన్మానాలు, సత్కారాలు కోకొల్లలు. షష్టిపూర్తికి ముందు రేలంగి అనారోగ్యం బారిన పడ్డారు. షష్టిపూర్తి మహోత్సవం చక్రాల కుర్చీలో కూర్చునే జరిపించుకున్నారు. అవుట్ డోర్ షూటింగులకు స్వస్తి చెప్పారు. జబ్బుపడి లేచాక ‘గంగ-మంగ’ వంటి ఓ పాతిక సినిమాల్లో నటించారు. రేలంగి నటించిన చివరి సినిమా ఎన్టీఆర్ నటించిన ‘నిప్పులాంటి మనిషి’ (హిందీలో అమితాబ్ బచన్ నటించిన ‘జంజీర్’ చిత్రానికి రీమేక్). 1975 కార్తిక మాసం నవంబరు 26వ తేది గురువారం నాడు తాడేపల్లిగూడెం లోని స్వగృహంలోనే ఆశువులుబాశారు. భర్త మరణానంతరం బుచ్చియమ్మ ముప్పై ఏళ్ళకు పైగానే జీవించింది. ఆమె రేలంగికన్నా వయసులో పదిహేనేళ్లు చిన్నది.
#రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు లేవు. కానీ సంచలన వార్తలకు, అవాస్తవమైన రాతలకు, ఎల్లో జర్నలిజానికి ‘కాగడా’పత్రిక శర్మ పెట్టింది పేరు. ఒకసారి తనపత్రికలో ‘రేలంగి తాగి తందానా లాడతాడు’ అంటూ చాలా నీచమైన, అసభ్యమైన భాషలో రాశాడు. మరుసటిరోజు స్టూడియోలో షాట్ బ్రేక్‌లో కాగడా శర్మ రేలంగికి ఎదురయ్యాడు. వెంటనే రేలంగి అతడి చెంప చెళ్లు మనిపించేలా నాలుగు పీకాడు. పోలీసు కేసు పెడతానని బీరాలు పలికిన కాగడా శర్మను సహచర జర్నలిస్టులు చీవాట్లు పెట్టారు. అప్పటినుంచి కాగడా శర్మకు రేలంగి అంటే హడల్.
#తన తోటి హాస్యనటులందరితో కలిసి ఒక పూర్తి స్థాయి సినిమా నిర్మించాలని రేలంగికి కోరికగా వుండేది. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. అలాగే హిందీ సినిమాల్లో కూడా నటించాలనే రేలంగి కోరిక తీరనే లేదు. ఆయన ‘పాతాళభైరవి’ హిందీ వర్షన్లో మాత్రమే నటించారు. మొత్తంమీద రేలంగి 280 చిత్రాలదాకా నటించారు.
#జెమినీ వారు నిర్మించిన ‘బాలనాగమ్మ’ (1942) చిత్రంలో తలారిరాముడు పాత్ర పోషించిన రేలంగి మరలా పదిహేడు సంవత్సరాల తరువాత శ్రీవేంకటరామణా వారు నిర్మించిన ‘బాలనాగమ్మ’ (1959) చిత్రంలో అదే పాత్రను పోషించడం విశేషం. అలాగే ‘గొల్లభామ’ (1947)లో ధరించిన విదూషకుడి పాత్రనే ఇరవై ఏళ్ల తరవాత ‘భామావిజయం’ (1967) చిత్రంలో మరలా పోషించారు.
#హాలీవుడ్ నటులు ఆంథోని క్విన్, చార్లెస్ లాటన్ పోషించిన ‘క్వాసిమోడో’ పాత్రను ఏదైనా తెలుగు సినిమాలో జొప్పించి పోషించాలనే కోరిక రేలంగికి వుండేది. ఈ ‘క్వాసిమోడో’ వికలాంగుడు. మరుగుజ్జు, గూని వంటి అంగవైకల్యంలో వుండే మూగవాడు. అయితే ఆ కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది.
– అడపా అప్పారావు, కాకినాడ