బాలీవుడ్ మహానటుడు దిలీప్ కుమార్(98) ఈరోజు ఉదయం కన్నుమూశారు. హిందీ సినీ జగత్తులో ట్రాజెడీ కింగ్‌గా పేరొందిన దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత 1944లో జ్వర్ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఆజాద్’ ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం ‘మొఘల్-ఎ-ఆజామ్’తో ఆయన ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. ఓరకంగా చెప్పాలంటే 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను ఏలారనే చెప్పాలి.
గొప్ప నటుడిగా గుర్తింపు !… ఉత్తమ నటుడిగా దిలీప్ కుమార్‌కు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. 1998లో దిలీప్‌కుమార్‌ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాక్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000 – 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్ కుమార్ సేవలందించారు. భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ పరిచయం చేసిన ఆయన సినిమా రంగంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు సాధించారు.
యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్అయ్యారు!… ఆ రోజుల్లో దిలీప్ కుమార్, దేవికారాణిల జంట హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. ఈ సమయంలో దేవికారాణి ఒక రొమాంటిక్ హీరో(దిలీప్ కుమార్)కు యూసుఫ్ ఖాన్ అనే పేరు సూట్ కాదని భావించారట. ఇందుకోసమే ఆమె యూసుఫ్ ఖాన్‌కు కొత్త పేరును వెదికి, చివరికి దిలీప్ కుమార్ అని పెట్టారట. ప్రముఖ రచయిత అశోక్ రాజ్ తన పుస్తకం ‘హీరో’ లో రాసిన వివరాల ప్రకారం అప్పటి సాహితీవేత్త భగవతి చరణ్ వర్మ… దిలీప్ కుమార్ అనే పేరు సెలెక్ట్ చేశారు.
యూసుఫ్ ఖాన్ పేరును మార్చేందుకు దేవికారాణి… దిలీప్ కుమార్, వాసుదేవ్, జహంగీర్ అనే పేర్లను ఎన్నుకున్నారట. ఈ నేపధ్యంలో యూసుఫ్ ఖాన్ కూడా దిలీప్ కుమార్ పేరుకు మొగ్గు చూపారట. దిలీప్ కుమార్ తన ఆత్మకథలో తన పేరు మార్పు తనపై ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. తాను హాలీవుడ్ కళాకారులు జెమ్స్ స్టీవర్ట్, పాల్ ముని, ఇంగ్రిడ్ బర్గ్‌మ్యాన్, క్లర్క్ గోబ్లే తదితరులు సినిమాలు చూసేవాడినని పేర్కొన్నారు. ఆరోజుల్లో సాటి హీరో అశోక్ కుమార్‌తో పోటీ పడిన దిలీప్ కుమార్ పలు భాషలు కూడా నేర్చుకున్నారు.
హాలీవుడ్ వరకూ క్రేజ్!… దిలీప్ కుమార్ ఒకానొక సమయంలో సినిమాల్లో వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. షారూఖ్ ఖాన్ లాంటి నటులు తమకు దిలీప్ కుమార్ ఎంతో స్పూర్తినిచ్చారని చెబుతుంటారు. దిలీప్ కుమార్‌కు బాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకూ క్రేజ్ ఉంది.
దిలీప్ కుమార్‌కు ఒకసారి హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే ఆ సినిమాపై దిలీప్ అంతగా ఆసక్తి చూపలేదు. హాలీవుడ్ సినిమా లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి డేవిడ్ లీన్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ షరీఫ్ అలీ పాత్రను దిలీప్ కుమార్‌కు ఆఫర్ చేశారు. డేవిడ్ ఈ సినిమాలో ఫ్రిన్స్ ఫరీఫ్ పాత్రకు యూరోపియన్ నటుడిని కాకుండా దిలీప్ కుమార్‌ను ఎంపిక చేశారు. భారతీయ సినిమాలంటే ఇష్టం కలిగిన డేవిడ్ ఇందుకోసం దిలీప్ కుమార్‌ను సంప్రదించగా… తనకు హాలీవుడ్లో నటించాలనే ఉద్దేశం లేదని దిలీప్ అతనితో చెప్పారట. 1962లో జరిగిన ఆర్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ సినిమా ఏడు అవార్డులను దక్కించుకుంది.