వెండితెర పై నవరసాలు పలికించగలిగిన ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ అని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు .ఏ పాత్రలోనైనా జీవించగల సమర్థులు కైకాల అని అన్నారు. ‘యువకళావాహిని’ ఆధ్వర్యం లో సీనియర్ నటుడు , రఘుపతి వెంకయ్య నాయుడు గ్రహీత కైకాల సత్యనారాయణ దంపతులకు సహస్ర పూర్ణ చంద్ర దర్శన సన్మానం జులై 27న ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది . ఈ సభలో ముఖ్య అతిధి ముఖ్య అతిధి గా కొణిజేటి రోశయ్య పాల్గొన్నారు.
విశిష్ట అతిధి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ .రామలింగేశ్వర రావు మాట్లాడుతూ…. కళాకారులు లక్షలాదిమందికి ఆనందాన్ని పంచుతారని , ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు కళాకారులను గుర్తించక పోయినా, ప్రజలు వారికి ప్రాధాన్యత నిచ్చి సన్మానించాల్సిన అవసరముందని అన్నారు . అప్పట్లో నటులే కీలకంగా ఉండేవారని, ఇప్పుడు గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత పెరిగిందని అన్నారు . కైకాల సత్యనారాయణ వంటి నటులను సన్మానించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు.
సీనియర్ నటి ,’కళాభారతి’ జమున మాట్లాడుతూ… కైకాల సత్యనారాయణ అప్పటి తరంలో ఎన్టీఆర్ తో ధీటుగా నటించారని,నటన లో అతనికి అతనే సాటి అని అన్నారు. సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… నటుడు గానే కాకుండా నిర్మాతల హితం కోరే వ్యక్తిత్వం కేవలం కైకాల స్వంతమని అన్నారు . సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ సభలో నటీమణులు గీతాంజలి,కవిత,దర్శకులు కోదండరామిరెడ్డి ,గజల్ శ్రీనివాస్,కె.వి.కృష్ణ కుమారి, ప్రవాసాంధ్ర గాయని ఆకునూరి శారద ,సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి, వై .కె .నాగేశ్వరరావు పాల్గొన్నారు. సభ ప్రారంభంలో కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాల్లోని పాటలను ఎస్వీ రామారావు వ్యాఖ్యానంతో ప్రదర్శించారు .