ప్రముఖ కన్నడ రచయిత్రి వైదేహి 2017 సంవత్సరానికి గాను ‘యువకళావాహిని – గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారా’న్ని అందుకున్నారు . ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ జయంతి సందర్భం గా హైదరాబాద్ లో సెప్టెంబర్ 8 న ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తమిళనాడు మాజీ గవర్నర్ కె . రోశయ్య అవార్డును ,పాతికవేల నగదు పురస్కారాన్ని వైదేహికి అందజేశారు . 1987 లో ప్రారంభించిన గోపీచంద్ అవార్డు ను ఏటా ఒక ప్రముఖ రచయితకు బహూకరిస్తున్నారు .
అవార్డు గ్రహీత వైదేహి స్పందిస్తూ …గోపీచంద్ అవార్డు అందుకోవడం గౌరవం గా భావిస్తున్నామన్నారు . తెలుగుతో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు . ప్రాంతీయ భాషలను తిరస్కరించడమంటే… మన సంస్కృతి, సంప్రదాయాలను తిరస్కరించడమేనన్నారు . స్నేహితురాలు,ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య తనను షాక్ కు గురి చేసిందన్నారు . మౌనానికి, మాటకు అపారమైన గౌరవం గల దేశం మనది . అలాంటి మన దేశం లో ఈ రోజు మౌనం,మాట రెండూ ఓడిపోతున్నాయి . మాట్లాడకుండా మౌనం గా ఉండటం సాధ్యమేనా? రాసేవాళ్ళు మూగ బోవడం ఎలా సాధ్యం? మాట, మౌనం అర్ధం కోల్పోయిన ఈ యుగం లో ఒక రచయిత మాత్రమే దానికి మళ్ళీ ఊపిరి పోయగలడు – అని అన్నారు .
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కె . రోశయ్య మాట్లాడుతూ … గోపీచంద్ గొప్ప సాహిత్య వేత్త అని … తెనాలి తో సంబంధం కలిగి ఉన్నందున ఆ ప్రాంత వాసిగా తాను సంతోషపడుతున్నానన్నారు .
‘ప్రజ్ఞా భారతి’ చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి మాట్లాడుతూ… గోపీచంద్ సోషలిస్టు,హ్యూమనిస్ట్. అరబిందోయిస్ట్ – అని అన్నారు . గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ…. గోపీచంద్ గొప్ప రచయితే కాదు ,గొప్ప వక్త కూడానని ప్రసిద్ధ రచయితలు చెప్పేవారని అన్నారు .
గోపీచంద్ తనయుడు, ప్రముఖ సినీ నటుడు సాయిచంద్ మాట్లాడుతూ…. పదేళ్లకిందట వాసిరెడ్డి సీతాదేవి సూచనమేరకు గోపీచంద్ అవార్డు ను జాతీయ అవార్డు గా విస్తరించామని …దీన్ని అంతర్జాతీయ అవార్డు గా చెయ్యాలని ఉందని అన్నారు . ‘అక్కినేని నాటక పరిషత్’ చైర్మన్ సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ సభలో ఇఫ్లూ విశ్వవిద్యాలయం ఆచార్యులు తారకేశ్వర్, ‘యువకళావాహిని’ అధ్యక్షులు వై. కె . నాగేశ్వరరావు పాల్గొన్నారు .