సినీవినోదం రేటింగ్ : 2.25/5
జీఎ2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ పతాకాలపై మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… పేరున్న న్యాయమూర్తి సూర్యనారాయణ (సత్యరాజ్)కుమారుడు లక్కీ (గోపీచంద్). తన తీర్పుతో ఓ అమ్మాయి ప్రాణాల్ని కోల్పోయిందని, ఆమెకు న్యాయం చేయలేకపోయానని న్యాయమూర్తిగా వృత్తికి రాజీనామా చేసి.. చిన్న కిరాణా షాపు పెట్టుకుని సాధారణ జీవితం సాగిస్తుంటాడు. సూర్యనారాయణ. అంత నిజాయతీ గల న్యాయమూర్తి కొడుకు లక్కీ మాత్రం పక్కా కమర్షియల్ లాయర్. డబ్బు లేనిదే ఏ కేసు టేకప్ చేయడు. తండ్రి న్యాయమూర్తిగా రాజీనామా చేయడానికి కారణమైన వివేక్(రావు రమేశ్) కేసు విషయంలో లక్కీ తన తండ్రితో తలపడాల్సి వస్తుంది. ఈ పోరులో న్యాయం కోసం నిజాయతీగా ముందుకెళ్లే సూర్యనారాయణ గెలిచాడా? న్యాయాన్ని మార్కెట్లో పెట్టేసిన కొడుకు లక్కీ గెలిచాడా? లక్కీ అంత కమర్షియల్‌గా మారడానికి కారణమేంటి? వివేక్కి శిక్ష పడాలనే సూర్యనారాయణ కోరిక నెరవేరిందా? అనేది సినిమాలో చూడాలి…
విశ్లేషణ… ఆడియెన్స్ కోణంలో మారుతి బాగా ఆలోచించి.. పక్కా కమర్షియల్ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే కమర్షియల్ అంశాలను ఎక్కడా కూడా మిస్ కానివ్వలేదు. నిజాయతీకి మారుపేరైన న్యాయమూర్తి తండ్రి, అతనికి తెలియకుండా డబ్బు కోసం న్యాయాన్ని, అన్యాయంగా మార్చేసే కొడుకు మధ్య సాగే కథ ఇది. ‘నేను హీరోను కాదు విలన్’ అని చెప్పుకొన్న హీరో.. క్లైమాక్స్‌కి వచ్చే సరికి ‘హీరో’ అవుతాడని ప్రారంభంలోనే తెలిసిపోయింది. క్లైమాక్స్‌కు వచ్చేసరికి తండ్రి కోసం, అతను నమ్మిన న్యాయం కోసం లక్కీ ఏదో చేస్తాడని ముందే మనకు అనిపిస్తుంది. ప్లాష్‌బ్యాక్ తో క్లారిటీ ఇవ్వడం కన్వెన్సింగ్గా ఉంది. తండ్రి–కొడుకుల మధ్య భావోద్వేగాలు పండాయి.
ప్రథమార్థంలో హీరో కమర్షియాలిటీ, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఓ రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు, ఓ రెండు పాటలు అన్నట్టుగా సాగింది. ద్వితీయార్థం అయినా కాస్త సీరియస్ గా సాగుతుందనుకుంటే నిరాశపడతారు. మూస ధోరణితో సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లిపోతే ఆడియన్స్‌ని మెప్పించడం కష్టమే . కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లు రిపీట్‌గా ఉండడంతో విసుగు పుట్టిస్తుంది. పాత చింతకాయ పచ్చడిలా ఫక్తు రెగ్యులర్ ఫార్మెట్లో ట్రీట్మెంట్ సాగింది. కోర్ట్ రూమ్‌లో లాజిక్‌ను పక్కనపెట్టి మ్యాజిక్ చెయ్యాలని మారుతి కొన్ని సన్నివేశాలు రాసుకున్నాడు. అయితే, ఇందులో మారుతి రాసుకున్న కామెడీ ట్రాక్‌కు జనాలు పగలబడి నవ్వాల్సిందే. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా రాశాడు.
నటీనటులు… గోపీచంద్‌ను ఎంతో స్టైలీష్‌గా చూపించారు. డబ్బుల్లేనిదే ఏ పని చేయను, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ పాత్రలో గోపీచంద్ గోపీచంద్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్ చూపించాడు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఆ భ్రమలోనే బతికే పాత్రలో బాగా నటించింది. రాశీ ఖన్నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. తండ్రిగా తనకు అలవాటైన పాత్రలో సత్యరాజ్ మెప్పించాడు. ఎప్పటిలానే ఎమోషన్ పండించాడు. రావు రమేష్ విలనిజం కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఆయన సెటైరికల్ డైలాగ్స్ నవ్విస్తాయి. అజయ్ ఘోష్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి అందరూ బాగా నటించారు.
జేక్స్ బిజోయ్ స్వరపరచిన పాటలు అంత గుర్తుంచుకునేలా లేవు. వాటికి తెరకెక్కించిన విధానం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా కుదిరింది. ఎస్.బి.ఉద్దవ్ ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా సీన్లు తీసేసినా పర్వాలేదనిపించింది. కార్మ్ చావ్లా కెమెరాపనితనం బాగుంది – రాజేష్