“దర్శకుడిగా మంచి సినిమా తీస్తా”నని చెప్పిన ఘంటసాల రత్నకుమార్ ఆ కోరిక తీరకముందే కన్నుమూసారు. ఘంటసాల.. ఆ పేరు వినగానే మధురమైన గాత్రం మనకు గుర్తుకు వస్తుంది. వేలాది పాటలతో శ్రోతలను ఎంతగానో అలరించిన ఘంటసాల వెంకటేశ్వరరావు రెండవ కుమారుడు రత్నకుమార్. కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతోనూ బాధ పడుతున్నారు. ఘంటసాల కుమారుడిగా ఇండిస్టీలోకి అడుగుపెట్టిన రత్నకుమార్ డబ్బింగ్ కళాకారుడిగా దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎన్నో చిత్రాలకు వాయిస్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కత భాషల్లో ఇప్పటివరకూ ఆయన దాదాపు 1090 పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కార్తిక్, వినోద్ కుమార్, జగపతిబాబు, అర్జున్, అరవింద స్వామి, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌కి ఎక్కువగా డబ్బింగ్ చెప్పటం విశేషం. ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’, ‘అంబేద్కర్’ చిత్రాలతో పాటు 30 సినిమాలకు పైగా ఆయన మాటలు కూడా అందించారు. అలాగే ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ స్థానం సొంతం చేసుకున్నారు.
రత్నకుమార్ ది వేరే దారి!… ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు రత్నకుమార్ తండ్రి బాటలో పయనించకుండా వేరే దారిని ఎంచుకున్నారు .మాటల రచయితగా కూడా సినీ పరిశ్రమకు తన సేవలను అందిస్తున్నాడు రత్నకుమార్. అయితే దర్శకుడిగా కూడా మారి మంచి సినిమా తీస్తానని చెప్పిన రత్నకుమార్ ఆ కోరిక తీరకముందే కన్నుమూసారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులకు ఆరుగురు సంతానం కాగా, అందులో ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో రత్నకుమార్ రెండోవారు. ఇతను తప్ప మిగిలిన వారెవరూ సినీ రంగంలో అడుగుపెట్టలేదు. కెరీర్ మొదట్లో నాలుగు ఐదు చిత్రాలకు పాటలు పాడిన ఆయనకు అనువాద విభాగంలో అవకాశాలు ఎక్కువ రావడంతో అటు వైపు వెళ్లారు. ఆయన కుమార్తె వీణ తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. తెలుగులో ‘అందాల రాక్షసి’, తమిళంలో ‘ఉరుం’ చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.
ఎప్పటికైనా సినిమా దర్శకుడుగా మారాలని, ఇందుకోసం కథ, డైలాగులు, మాటలు, పాటలు సిద్ధం చేసుకుంటున్నానని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు రత్నకుమార్ . ‘మంచి నిర్మాత దొరికితే త్వరలోనే సినిమా తీస్తా’ అని చెప్పిన ఆయన ఇలా అకాల మరణం చెందడం అందరినీ బాధించింది. డబ్బింగ్ ఆర్టిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు అందుకున్న ఆయన జెమినీ టీవీలో ‘విశ్వదర్శనం’ సీరియల్ యాంకర్‌గా కూడా పనిచేశారు. తమిళనాడు, కర్నాటక మూవీ అసోసియేషన్లు ‘కళై శైవం’, ‘కురల్ సెల్వం’ బిరుదులతో ఆయనను సత్కరించారు.