తెలుగు చలనచిత్రరంగం మదరాసులో ఉన్నప్పుడే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడాలేకుండా తెలుగువారు చాలామంది నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా పేరుతెచ్చుకున్నారు. ఆ క్రమంలో తెలంగాణకు చెందిన వ్యక్తి చిన్నవేషాలు వేయడానికి మదరాసు వెళ్ళి అక్కడనుంచి బొంబాయి చేరుకుని… నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. అటువంటి నటుడు పైడి జైరాజ్. సెప్టెంబర్ 28, 1909లో కరీంనగర్లో జన్మించిన ఆయన వెండితెరపై మక్కువతో అప్పటి బొంబాయికు చేరుకున్నారు. హిందీ సినిమాకు ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. మొట్టమొదటి పద్మభూషణ్ అందుకున్న తెలుగు నటుడు.
పైడి జైరాజ్ స్వాతంత్ర సమరయోధురాలు, జాతీయనాయకురాలు సరోజినాయుడుకు బంధువుకూడా. చదువంతా హైదరాబాద్‌లో సాగింది. గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజీలో చేస్తుండగానే మనసు సినిమాలవైపు లాగింది. 1929లో బొంబాయి చేరుకున్నారు. తొలినాళ్ళలో మూకీ సినిమాలే ఎక్కువగా ఉండేవి. అలా ఆయన కెరీర్లో దాదాపు 11 సినిమాల్లో సాగింది. ‘మాతృభూమి’, ‘ట్రయాంగిల్ లవ్‌స్టోరీ’, ‘ఆల్ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతీ’ వంటి చిత్రాల్లో నటించారు. అనంతరం టాకీ ప్రయాణంలో 1934లో తొలిసారిగా ఆయన నటించిన చిత్రం ‘శిఖరి’. ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో రూపొందింది. అప్పటి కథానాయకుల్లో పేరుపొందిన ఆయన శాంతారామ్, పృథ్వీరాజ్‌కపూర్‌కు సమ ఉజ్జీలుగా ఉండేవారు. అప్పటి అగ్ర నాయికలైన నిరుపమ్రారు, శోభన సమ్రత్, షకీలా, శశికళ, దేవికా రాణి, మీరా కుమారి, మాధురి, జబ్బూరున్నీసా వంటివారితో కలిసి నటించారు. అతని కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘భాబీ’. అటు సాంఘీకాలే కాకుండా హిస్టారికల్ మూవీలైన రాజ్పుతాని, షాజాన్, అమర్‌సింగ్ రాథోడ్, వీర్‌దుర్గాదాస్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పుసుల్తాన్, రజియా సుల్తాన్, అల్లా ఉద్దీన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. దాదాపు ఆయన 170 చిత్రాల్లో నటించారు. అందులో హిందూ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ భాషలు ఉన్నాయి. అంతేకాకుండా దర్శకుడిగా ఆయన పలు చిత్రాలు చేశారు. 1943లో ‘మొహర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనంతరం… ప్రతిమ, రాజ్‌ఘర్, సాగర్ (1951) చిత్రాలు ఉన్నాయి. సాగర్ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. అయితే తెలంగాణాలో పుట్టినా ఆయన ఎప్పుడూ తెలుగు చిత్రాల్లో నటించకపోవడం గమనార్హం.
పంజాబీకి చెందిన సావిత్రిని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1925లో ‘జగ్మగాతి జవానీ’ చిత్రంలో చిన్న పాత్ర వేసిన ఆయన కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రెండు అవార్డులను పొంది జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. 70ఏళ్ళపాటు చలనచిత్రరంగంలో ఉన్న ఆయన ఆగస్టు 11, 2000వ సంవత్సరంలో మరణించారు.