“మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” సెప్టెంబర్ 25-26, 2021 లో కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో అత్యంత విజయవంతంగా జరిగింది.
కెనడా లోని ఆల్బెర్టా రాష్ట్ర మంత్రి ప్రసాద్ పండా ఈ సాహితీ సదస్సుని ప్రారంభిస్తూ.. తన రాజకీయ ప్రస్థానంలో అక్కడి వారికి తెలుగు భాష గురించి చెప్పే అవకాశం తనకు లభించింది అనీ, ఇటువంటి సదస్సుల నిర్వహణ ఉభయ దేశాలలో తెలుగు భాష మనుగడకి దోహదం చేస్తాయి అనీ ప్రశంశించారు. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి నిర్వాహకుల ప్రశ్నలకి సమాధానాల రూపం లో తన సందేశాన్ని వినిపిస్తూ.. ఇండియాలో ముందు ముందు తెలుగు నేర్చుకోవాలి అంటే కెనడా-అమెరికా దేశాలలోని తెలుగు వారి నుంచే నేర్చుకునే పరిస్థితి వస్తుందేమో అని చమత్కరిస్తూ, తెలుగు రాష్ట్రాలలో భాషా సాహిత్యాల పరిస్థితిని వివరించారు. మొదటి రోజు కెనడా తెలుగు సాహిత్య వికాసం గురించి శ్రీమతి సరోజ కొమరవోలు సమీక్షించగా, సాహిత్య పోషణ లో తాత్వికత చోటు చేసుకోవలసిన ఆవశ్యకతని డా. శారదా పూర్ణ శొంఠి వివరించారు. కెనడాలో అధికార భాష అయిన ఫ్రెంచ్ బాష లోనే కాక తెలుగులో కూడా ప్రావీణ్యత ఉన్న ఫ్రెంచ్ పౌరుడు, ప్రొఫెసర్ డెనియల్ నెజెర్స్ మాట్లాడుతూ.. ఆ రెండు బాషల అనువాద ప్రక్రియలో తన నిరంతర కృషిని సోదాహరణగా వివరించారు.
కెనడా రచయితల తొలి కథా సంకలనం “కెనడా కతలు”, “డయాస్పోరా తెలుగు కథానిక-15వ సంకలనం ఈ ప్రారంభ సభలో ఆవిష్కరించబడ్డాయి. ప్రముఖ సినీ కవి సుద్దాల అశోక్ తేజ రెండవ రోజు మహాకవి దాశరధి గారి కవిత్వం, వ్యక్తిత్వ మీద ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఇంటర్ నెట్ సదుపాయం లేని చోట ఉన్నా, ఆ ఆటంకాన్ని అధిగమించి భువన చంద్ర వీడియో ద్వారా రెండు గ్రంధాలు ఆవిష్కరించి, ఈ సదస్సు ప్రాముఖ్యతని గుర్తించి ప్రసంగించడం ఆయన సహృదయతకి నిదర్శనం. ఈ వేదికలో శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది.
అలరించిన వంద ప్రసంగాలు!… “తెలుగు సాహిత్యం లో హాస్యం వ్యంగ్యం” (దామరాజు విశాలాక్షి), కథల కన్న అమెరికా జీవితాలు (భాస్కర్ పులికల్), డయాస్పోరా కవిత్వం-స్థానికత” (డా. కె.గీత) అసలు మంచి కథ అంటే ఏమిటి?(దీప్తి పెండ్యాల) వాడుక భాషకు గొడుగు గిడుగు” (తోటకూర ప్రసాద్), వర్తమాన తెలుగు కథ – కొన్ని ఆలోచనలు (కల్పన రెంటాల), నేటి కాలపు తెలుగు కవిత్వము-ఒక పరిశీలన (ఇంద్రాణి పాలపర్తి) ఫెమినిజంతో నా ప్రయాణం-కవయిత్రిగా (మహెజబీన్), ఓరుగంటి గోపాల కృష్ణ గారు అత్యంత అద్భుతంగా చదివిన స్వీయ రచన “ప్రక్షాళనం” కథ, రామ్ డొక్కా నిర్వహించిన “ఆధునిక కవితా రీతులు” చర్చా వేదికలో “కవిత్వం -కొన్ని అవసరాలు” అనే విన్నకోట రవిశంకర్ ప్రసంగం, ప్రముఖ సాహితీవేత్త స్వాతి శ్రీపాద “”అనువాద ప్రక్రియ” మీద చేసిన ప్రసంగం, “హనుమ శతకం” అనే పేరిట హనుమంత రావు కరవది గారి స్వీయ రచనా పఠనం, లక్ష్మీ సుగుణవల్లి చీమలమఱ్ఱి గారి “అక్ష్రరాభ్యాసం” కథ, “ప్రపంచ కథా సంప్రదాయాలు” అనే అంశం మీద భాస్కర్ రాయవరం ప్రసంగం, తెలంగాణా మాండలీకం లో “ పిల్ల లగ్నం” అనే శ్రీమతి విజయ లక్ష్మి సువర్ణ గారి స్వీయ కథా పఠనం…ఈ సదస్సులో సుమారు 100 ప్రసంగాలూ వేటికవే వాటి ప్రత్యేకత ని చాటుకున్నాయి.
జీవన సాఫల్య పురస్కార వేదిక !… ఈ సదస్సులో రెండు అంశాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మొదటిది..జీవన సాఫల్య పురస్కార వేదిక. పురస్కార గ్రహీత అయిన డా. తిరుమల కృష్ణ దేశికాచారి గారి స్వగృహం లోనే జరిగిన ఈ వేడుకని దేవి చౌదరి, మైత్రి కల్లూరి, సరోజ & రావు కొమరవోలు దంపతులు, సత్యం పోతంశెట్టి & విజయ తదితరులు పండిత సత్కారం చేశారు. శారద కాశీవఝ్ఝుల (వేలీ వేదిక వ్యవస్థాపకురాలు) తన అసాధారణ ప్రతిభతో రూపొందించిన “సరదా సాహిత్యం పోటీ” లో ఈ సదస్సులో ప్రసంగించిన వక్తలు మళ్ళీ పాల్గొని తమ విషయ పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.
ఈ సదస్సు ప్రధాన నిర్వాహకులుగా వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ, త్రివిక్రమ్ సింగరాజు, మధు చెరుకూరి వ్యవహరించగా..డా. కె.గీత, మధుబాల కరవది, దీప్తి పెండ్యాల, సూర్యకుమారి ఉపాధ్యాయుల, సాయి సోమయాజుల, శ్రీవాణి ముప్పాళ్ళ, వాణి ఉప్పుల, రాధిక నోరి, శారద కాశీవఝుల మొదలైన వారు 12 వేదికలలో జరిగిన ఆయా వేదికల నిర్వాహకులుగా వ్యవహరించగా.. శ్రీనివాస్ గాదె, రఘు ధూళిపాళ, వేణు కూరెళ్ళ, శ్రీనివాస్ కస్తూరి, ప్రవీణ్ కోరుకొండ, శశి పట్లోళ్ల, సత్యం పోతంశెట్టి మొదలైన వారు సాంకేతిక నిపుణులుగా, సింగపూర్ కి చెందిన RK Videography (రాధాకృష్ణ గణేశ్న & కాత్యాయని) సాంకేతిక బాధ్యతలు వహించి సదస్సుని విజయవంతం చేశారు.