హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా ఇ. జనార్ధన రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.జి. భవాని, సజ్జా వాసు, సంయుక్త కార్యదర్శులుగా మాడూరి మధు, పర్వతనేని రాంబాబు, కోశాధికారిగా ఎం.ఎన్. భూషణ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సాయి రమేష్, బత్తుల ప్రసాద్, నారాయణరావు, పి. హేమసుందర్, ఆర్.డి.ఎస్. ప్రకాష్, ముత్యాల సత్యనారాయణ, పి.మురళీకృష్ణ, రమేష్ చిన్నమూల, సునీతా చౌదరి, జిల్లా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ సభ్యులు లక్ష్మణరావు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, ప్రభు ఈ ఎన్నికలను సమన్వయం చేశారు. ప్రతి రెండేళ్లకోసారి ఈఅసోసియేషన్ కు ఎన్నికలు జరుగుతాయి.
సభ్యుల సంక్షేమమే ధ్యేయం: సురేష్ కొండేటి
ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తానని నూతన అధ్యక్షుడు సురేష్ కొండేటి అన్నారు. తెలుగు సినిమా రంగంలో ఈ అసోసియేషన్ కు ప్రాధాన్యం ఎనలేనిదన్నారు. అందుకే ఈ అసోసియేషన్ కు తన వంతు విరాళంగా లక్ష రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
సభ్యులకు ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సమస్యలపై తమ కమిటీ తక్షణమే కార్యరంగంలోకి దిగుతుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు ఎన్నోసార్లు తాను పదవులు నిర్వహించినందున ఆ అనుభవంతో సభ్యులందరి అభ్యున్నతి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తామని ఎన్నికైన సభ్యులంతా హామీ ఇచ్చారు.