ఓ సక్సెస్ పొందడానికి సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నానని ఫాతిమా సనా షేక్ చెప్పారు. ‘నువ్వేమీ కత్రినా కైఫ్, దీపికా పదుకొణెలా అందంగా లేవు’ అని కొందరు అన్నట్లు తెలిపారు.‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌లో నటిగా గుర్తింపు పొందింది ఫాతిమా సనా షేక్. ఈ సినిమాలో ఆమె ఆమిర్ ఖాన్ కుమార్తెగా నటించారు. దీని తర్వాత ఫాతిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో చేసింది.
‘నేను బాలనటిగా పనిచేశా. అయినప్పటికీ.. ఆఫర్స్ రావడం కష్టంగా మారింది. పని దొరకలేదు. నువ్వు కత్రినా, దీపికలా అందంగా లేవు అని కొందరు అన్నారు. నువ్వు చూడటానికి హీరోయిన్‌లా లేవు కాబట్టి… సినిమాలో పాత్ర ప్రాముఖ్యతతో సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్ లు చేయాలని సలహాలు కూడా ఇచ్చారు. ‘నువ్వు బాగోలేవు’ అని ఇతరులు నాకు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.ఎన్నో మాటలు పడ్డా.. నా మైండ్‌లో కేవలం నటన మాత్రమే ఉంది. ‘కెమెరా ముందు నిల్చోవచ్చు’ అనే ఆశతో అనేక ఆడిషన్లకు వెళ్లా.
నాకు దాదాపు ఆరేళ్లు పట్టింది
‘దంగల్’కు ముందు నచ్చిన ప్రాజెక్టులు ఎంచుకునే పరిస్థితిలో నేను లేను. ‘దంగల్’ సినిమా అప్పట్లో నాకున్న ఒకేఒక్క ఆప్షన్. అందుకే దానిలో నటించా. ఇలాంటి పరిస్థితులు ప్రతి నటీ ఎదుర్కొంటుంది. కానీ ‘దంగల్’ తర్వాత నాకు ఆఫర్లు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తర్వాత నాకంటూ కాస్త గుర్తింపు ఏర్పడింది. దీనికి నాకు దాదాపు ఆరేళ్లు పట్టింది. కనీసం నేను ఎంచుకున్న రంగంలో కొనసాగుతున్నందుకు కృతజ్ఞురాలిని.
‘థగ్స్..’కు ముందు నాలో పోటీపడే గుణం ఉండేది. ‘వాళ్లు ఏం చేస్తున్నారు, ఎలా తయారయ్యారు’ అని చూసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి. అందరి ప్రయాణం ఒకలా ఉండదని అర్థమైంది. చక్కగా పనిచేస్తే ప్రశంసలు వస్తాయి. దీపిక చిత్ర పరిశ్రమలో చాలా ఏళ్లుగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ప్రజలు ఆమె మంచి నటి అని, చక్కటి స్క్రిప్టు ఎంచుకుంటున్నారని అంటున్నారు. దేనికైనా కాస్త సమయం పడుతుంది’ .
ఫాతిమా 1997లో కమల్ హాసన్ ‘చాచీ 420’ సినిమాతో బాలనటిగా పరిచయం అయ్యారు. తర్వాత పలు సినిమాల్లో నటించారు. 2015లో తెలుగులో ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే చిత్రంలో కథానాయిక పాత్ర పోషించారు. 2016లో ‘దంగల్’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు. అనురాగ్ బసు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు