‘మాస్టర్’ రాకకోసం సినీ.. రాజకీయుల ఎదురు చూపు !

‘దళపతి’ విజయ్‌ హీరోగా నటించిన 64వ చిత్రం ‘మాస్టర్‌’ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌ తొమ్మిదిన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా.. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో రిలీజ్‌ కాలేక పోయింది. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జేవియర్‌ బిరిటో ప్రకటించినా..ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ‘మాస్టర్‌’ చిత్రాన్ని కొనేందుకు పోటీపడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ చిత్రాన్ని కొనేందుకు ఓటీటీ సంస్థలు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా ఆఫర్లు ప్రకటించాయి. ‘మాస్టర్‌’ ను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాత పదే పదే చెబుతున్నప్పటికీ..ఓటీటీ సంస్థలు చిత్రం కొనుగోలుకు విపరీతంగా పోటీపడుతున్నాయి. ఈ పోటీ కారణంగా ఈ చిత్రం రేటు వందకోట్లు దాటే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
 
విజయ్‌ రాజకీయ ఆరంగేట్రం!
‘దళపతి’ విజయ్‌ రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడు జరుగుతుందోనని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ‘మాస్టర్‌’ విజయ్‌కి ఎప్పటినుంచో వుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్‌ నటించిన ‘తలైవా’ సహా కొన్ని సినిమాలకు సమస్యలు ఎదురయ్యాయి. చెన్నై మీనాంబాక్కం వద్ద అట్టహాసంగా జరగాల్సిన విజయ్‌ జన్మదిన వేడుకలు చివరి క్షణంలో పాలకవర్గం ఒత్తిడి కారణంగా రద్దయ్యాయి. విజయ్‌ నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. ఈ సంఘటనల కారణంగా సీఎం కావాలనే తన కోరికను ప్రక్కన పెట్టి సినిమాల్లో నటించడంపైనే విజయ్‌ దృష్టిసారిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో స్వంత పార్టీ ప్రారంభించ డానికి..ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేయించడానికి విజయ్‌ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
 
పార్టీ పెడితే గెలిచి తీరుతాం!
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల లోపున పార్టీని ప్రారంభించడం కంటే.. 2026లో జరిగే ఎన్నికల సమయంలో పార్టీ పెడితే గెలిచి తీరుతామని విజయ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ,యాభై యేళ్లు దాటిన తర్వాతే రాజకీయాల్లోకి ప్రవేశించమని..అంతవరకూ సినిమాల్లో నటించమని స్నేహితులు ఆయనకు సలహా ఇస్తున్నా రు. ప్రస్తుతం విజయ్‌ వయసు 44 సంవత్సరాలు. అందువలన 2026 వరకు సినిమాల్లో నటించి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు.తమ పార్టీలో చేరమంటూ పార్టీనేతలు ఎందరో ఆహ్వానించినా విజయ్‌ చేరలేదు. ఇక విజయ్‌ తండ్రి, సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తొలుత డీఎంకే వీరాభి మానిగా వుండే వారు. ఓ దశలో డీఎంకే ను విబేధించి అన్నాడీఎంకేకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించిన తర్వాత ఆయనకు లభించే ప్రజా మద్దతును పరిశీలించిన మీదటే విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభించే అవకాశముందని ఆయన సన్నిహితులు అంటున్నారు.విజయ్‌కి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రాజకీయ సలహాదారుడిగా ఉంటున్నారు. విజయ్‌ అభిమాన సంఘాలన్నింటినీ సేవా సంఘాలుగా మార్చి రాజకీయ ప్రవేశానికి మార్గాన్ని సులభతరం చేసింది కూడా ఆయనే. తొందరపడి తన ఇమేజ్‌ను రాజకీ యాల్లోకి దిగి పోగొట్టుకోకూడదని విజయ్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. తన పలుకుబడిని ఉపయోగించి తండ్రికి రాజ్యసభ సీటు ఇప్పిఇంచాలని అనుకుంటున్నారు.
 
ప్రతిపక్షం డీఎంకేకు అనుకూలంగా..
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు సానుకూలంగా వ్యవహరించాలని విజయ్‌ నిర్ణయించారు. ఆ కారణంగానే ఆయన రాజకీయ అరంగేట్రం వాయిదా వేసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే యేడాది ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాలన్న నిర్ణయంతో డీఎంకే ఎన్నికల బరిలోకి దిగనుంది. ఆ సమయంలో తాను రాజకీయ ప్రవేశం చేసి, స్వంత పార్టీని ప్రారంభించి డీఎంకేకు సంకట పరిస్థితి కలిగించకూడదని విజయ్‌ అనుకుంటున్నారు. ‘మెర్సల్‌’ సినిమా పంచాయతీ, ‘సర్కార్‌’ చిత్రం బ్యానర్ల చింపివేత వంటి పలు వ్యావహారాల్లో అధికార అన్నాడీఎంకేపై విజయ్‌ ఆగ్రహంతో వున్నారు. ఆ ఆగ్రహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా ప్రదర్శించబోతున్నారు. తన అభిమాన సంఘాలతో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేయించనున్నారు.
 
ఐటీ దాడుల ఆనవాయితీ!
విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రసార మాధ్యమాల్లో ఏవైనా ఊహగానాలు వెలువడితే చాలు.. ఆయన పై ఆదాయపు పన్నుల శాఖ దాడులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. తమిళనాట రాజ కీయ పార్టీని ప్రారంభించకుండా విజయ్‌ను అడ్డుకోవాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపిస్తోందని చెబుతున్నారు. ‘మాస్టర్‌’ చిత్రం షూటింగ్‌ బిజీగా జరుగుతున్నప్పుడు కూడా.. విజయ్‌ రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఐటీ అధికారులు నైవేలిలో ‘మాస్టర్‌’ చిత్రం షూటింగ్‌లో ఉన్న విజయ్‌ వద్దకు వెళ్ళి విచారణ జరిపారు. అంతటితో ఆగకుండా వారి కారులోనే చెన్నై తీసుకెళ్ళి, నగరంలో విజయ్‌కి చెందిన రెండు నివాసగృహాలలోనూ తనిఖీలు నిర్వహించారు. పార్టీ అనేది ఒక ఆయుధం వంటిందని..కనుక తప్పకుండా పార్టీని ప్రారంభించాలని విజయ్‌పై ఆయన అత్యంత సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే ‘మాస్టర్‌’ వచ్చే ఐదేళ్ల దాకా మరిన్ని సినిమాల్లో నటించిన తర్వాతే రాజకీయప్రవేశం చేస్తారని అనుకుంటున్నారు.