సాహితీవేత్త, పాత్రికేయుడు, నటుడు, రచయిత, దర్శకనిర్మాత, రావి కొండలరావు గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932 ఫిబ్రవరి 11న జన్మించిన రావి కొండలరావు ‘సుకుమార్’ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. నాటికలు, నాటకాలు కూడా రచించారు. 2004లో ఆయన రచించిన ‘బ్లాక్ అండ్ వైట్’ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది. ‘భైరవద్వీపం’, ‘బృందావనం’ చిత్రాలకు సంభాషణలు, ‘పెళ్ళి పుస్తకం’ చిత్రానికి కథ అందించారు. తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆయన సతీమణి దివంగత రాధాకుమారి కూడా ప్రముఖ నటి.ఆమె ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. నాటకరంగం కోసం రావి కొండలరావు ఎంతగానో కృషి చేశారు. రావి కొండలరావు నాటకరంగ పరిస్థితిని గమనిస్తూ.. దానిని నిలబెట్టేందుకు పట్టువదలని విక్రమారుడిలా ప్రయత్నాలు చేశారు. నాటక రంగానికి ఆయన తన భార్య రాధాకుమారితో కలిసి చేసిన సేవ వెలకట్టలేనిది.
దాదాపు ఆయన 600కు పైగా చిత్రాలలో నటించారు. నాటకరంగం, నటుడు అనే కాకుండా రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు. భైరవద్వీపం, బృందావనం, పెళ్లిపుస్తకం, చల్లని నీడ వంటి చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. నిర్మాతగానూ కొన్ని చిత్రాలకు ఆయన వ్యవహరించారు. సినిమా రచనలే కాకుండా ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో ఆయన రచనలు చేశారు. హాస్యరచయితగా గుర్తింపు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ ఇచ్చి ఆయనను గౌరవించింది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు, అలాగే నాటకరంగానికి తీరనిలోటు. ఆయన మరణవార్త విన్న చిత్ర ప్రముఖులు, నాటక రంగ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.