అభిరుచిని పెంచే… ‘జనతా హోటల్’ చిత్ర సమీక్ష

                                              సినీవినోదం రేటింగ్ : 3/5
‘ఓకే బంగారం’తో హిట్ జంట అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ తో రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు . అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది.
కధలోకి వెళ్తే…
అబ్దుల్ రజాక్ తన భార్యకు మగ పిల్లాడు పుట్టాలని కలలు కంటుండగా.. అతనికి మాత్రం వరుసగా నలుగురూ ఆడపిల్లలే పుడతారు. అయినా ఆశ చంపుకోని అతడికి ఎట్టకేలకు ఐదో సంతానంగా మగ పిల్లాడు ఫైజి (దుల్కర్ సల్మాన్) జన్మిస్తాడు. కానీ తనకు జన్మని ఇచ్చి అతని తల్లి మరణిస్తుంది. దాంతో నలుగురు అక్కలే ఫైజిని అల్లారుముద్దుగా పెంచుతారు. దాంతో ఫైజీ ఎక్కువ సమయం వంటగదిలోని అక్కలతోనే గడుపుతూ పెరుగుతాడు. ఈ క్రమంలో అతని అక్కలందరికీ పెళ్లిల్లు అయిపోయి తన ఒంటరి వాడు అయిపోతాడు.
 
ఫైజి స్విజర్ లాండ్ వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాని తండ్రికి అబద్దం చెప్పి చెఫ్ కోర్స్ చేసి తిరిగివస్తాడు. ఈ విషయం పెళ్లి చూపులకి వచ్చి షహానా (నిత్యా మీనన్)కి చెప్తే… అది కాస్త ఫైజీ తండ్రికి తెలిసి ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ తర్వాత ఫైజీ ఇల్లు వదిలేసి కాకినాడలోని తన తాత కలామ్ దగ్గరకి వస్తాడు. అక్కడ ఫైజీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కుంటాడు. ఫైజీ తాత కలామ్ తన మనవడ్ని హోటల్ వ్యవహారాల్లో  తీర్చి దిద్దుతుంటాడు ? ఫైజీ మనసు తెలుసుకున్న షహానా (నిత్యామీనన్) అతన్ని ప్రేమిస్తుంది. తన తాత ‘జనతా హోటల్’ ని ఫైజీ ఎలా బాగు చేశాడు ?  చివరకి ఫైజీ తన తాత చూపెట్టిన దారిలో ఎలా విజయం సాధించాడో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే…
విశ్లేషణ…
దర్శకుడు అన్వర్ రషీద్ జనతా హోటల్ నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. హోటల్ ని వంట వాతావరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూనే.. ఆకలి విలువ గురించి, మనం బతుకున్న సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని సంఘటనల గురించి విలువైన భావోద్వేగమైన సన్నివేశాలను చూపుతూ చక్కని పనితనం కనబర్చాడు. బరువైన సన్నివేశాలని కూడా  బ్యాలెన్స్ డ్ గా నడిపిన విధానం బాగుంది. ”అన్నం కడుపుతో పాటు మనసును కూడా నింపాలి” అని సినిమాలో అంతర్లీనంగా ఇచ్చిన చక్కని మెసేజ్ బాగా ఆకట్టుకుంటుంది.  సినిమాలో హోటల్  వాతావరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూనే.. ఆకలి విలువ గురించి, సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని సంఘటనల గురించి భావోద్వేగమైన సన్నివేశాలతో చాలా చక్కగా చూపించారు. ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటిని అభినందించి తీరాలి.
 
అయితే, దర్శకుడు అన్వర్ కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మది కనపరిచారు. ముఖ్యంగా సెకెండాఫ్ మొదట్లో సాగే సన్నివేశాల్లో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిస్తే  బాగుండేది. విదేశాలు వెళ్లిపోవాలని కలలు కనే హీరో…మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉంటే ఆ పాత్రకి ఇంకా చక్కటి జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా మరింత ఆకట్టుకున్నే విధంగా చెయ్యల్సింది.
నటీనటులు…
హీరో దుల్కర్ సల్మాన్ లుక్స్ పరంగా ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. బరువైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో షహానా పాత్రలో కనిపించిన నిత్యా మీనన్ కూడా  చక్కగా నటించింది. తన అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. దుల్కర్ – నిత్యా ల కెమిస్ట్రీ  చాలా సరదాగా సాగుతూ మంచి ఫీల్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా మిడ్ నైట్ లో వచ్చే ‘లారీ సీక్వెన్స్’లో వారు తమ నటనతో ఆకట్టుకుంటారు.
 
ఇక సినిమాకే కీలకమైన తాత పాత్రలో కనిపించిన సీనియర్ నటులు తిలకన్ ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మనసులను తాకారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన గొప్ప నటన ప్రదర్శించారు. అలాగే హీరోని మార్చే సన్నివేశాల్లో కూడా ఆయన ఒకపక్క నవ్విస్తూనే, మరో పక్క ఎమోషనల్ గా కదిలిస్తారు. తండ్రిగా నటించిన సిద్ధికి , మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతిక నిపుణులు…
ఇక సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. పాటలతో పాటు నేపధ్య సంగీతం సన్నివేశాలకు బలాన్నిచ్చింది.  సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఎస్. లోకనాథన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.  కిచన్ లోని షాట్స్, బీచ్ లోని హోటల్ విజువల్స్ చాలా ప్లజెంట్ గా అనిపిస్తాయి. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో స్లో సీన్స్ ని ఇంకాస్త యాక్టివ్  చేసుంటే బాగుండేది – ధరణి