కరోనా భయాల నేపధ్యంలో ప్రేక్షకులు తమ కారులో కూర్చుని, పూర్తి భద్రతతో ‘డ్రైవ్ ఇన్ సినిమా’ లో సినిమాలను వీక్షిస్తున్నారు . దేశంలో కరోనా విజృంభణ నేపధ్యంలో సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయనేది ఇంకా తెలీలేదు. అటువంటి పరిస్థితిలో ‘డ్రైవ్ ఇన్ సినిమా’ ఆశాజనకంగా వెలుగు లోకి వచ్చింది.ఇది ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో ప్రారంభమైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కరోనా భయాల నేపధ్యంలో ప్రేక్షకులు తమ కారులో కూర్చుని, పూర్తి భద్రతతో సినిమాలను వీక్షిస్తున్నారు. సినిమా చూడటానికి ఈ పద్ధతి ఇప్పటికే పలుచోట్ల ఉన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధానానికి మరింత ఆదరణ పెరుగుతోంది. 1970 వ దశకంలో అహ్మదాబాద్, ముంబైలలో ‘డ్రైవ్ ఇన్ సినిమా’లు ఏర్పాటైనా.. కొద్ది రోజుల్లోనే వాటిని మూసివేయాల్సివచ్చింది. దేశంలో ప్రస్తుతం ఆరు ‘డ్రైవ్ ఇన్ సినిమా’స్ ఉన్నాయి. వాటిలో రెండు గురుగ్రామ్‌లో ఉన్నాయి. గురుగ్రామ్‌లోని డ్రైవ్ ఇన్ థియేటర్ ‘సన్‌సెట్ సినిమా క్లబ్’లో లాక్‌డౌన్ తర్వాత మొదటి స్క్రీనింగ్‌ను నిర్వహించారు. మాస్కులు ధరించిన ప్రేక్షకులు తమ కార్లలో కూర్చుని సినిమాను చూశారు. తదుపరి డ్రైవ్-ఇన్ సినిమా షో ఆగస్టు 22, 23 తేదీలలో ఉండనుంది.
‘సన్‌సెట్ సినిమా క్లబ్’ ప్రతినిధి సాహిల్ కపూర్ మాట్లాడుతూ… ఇలాంటి కాన్సెప్ట్ ద్వారా సినిమాలను సురక్షితంగా చూడవచ్చన్నారు. ఆడియో నేరుగా కారులోకి చేరుకుంటుందని, వీడియో 30 అడుగుల వెడల్పు గల సినిమా తెరపై కనిపిస్తుందని తెలిపారు. ప్రేక్షకుల డిమాండ్‌ను అనుసరించి, సెప్టెంబర్ నుంచి ప్రతి వారాంతంలో స్క్రీనింగ్ చేసే విషయమై థియేటర్ యాజమాన్యం పరిశీలిస్తోందన్నారు
థియేటర్స్‌లో మద్యం.. నాగ్ అశ్విన్ చర్చ!
నాగ్ అశ్విన్ ఆమధ్య చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది. అందులోని సారాంశం ఏంటంటే.. ‘సురేష్ బాబు గారు రానాతో ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. విదేశాల మాదిరి ఒకవేళ థియేటర్స్ గనుక మద్యాన్ని అమ్మే లైసెన్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చింది. అయితే అది ఆదాయాన్ని పెంచుతుందా? అలాంటప్పుడు థియేటర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది? మీరేం ఆలోచిస్తున్నారు? ఇది మంచి ఐడియానా? చెడ్డ ఐడియానా?’ అని ట్వీట్ చేశాడు.
దానిపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. వాటిపై నాగ్ అశ్విన్ మరో ట్వీట్ చేస్తూ.. ” ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యే అవకాశం ఉంది.. అయితే కొన్ని మల్టీప్లెక్స్‌లో మాత్రమే పెడితే పర్లేదు కదా..అది పూర్తిగా ఓ పరిష్కారం కాదనుకోండి.. మరి ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడానికి ఏం చేయాలి?’ అని ప్రశ్నించాడు.
డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్.. నాగ్ అశ్విన్ ట్వీట్
‘థియేటర్స్‌లో డ్రైవ్ ఇన్.. అవుట్ డోర్ కార్, బైక్ పార్క్ చేసుకుని సినిమా చూడడం.. పాత కాలం టూరింగ్ టాకీస్ లాగా.. అల్రెడీ రిలీజ్ అయిన మూవీస్, క్లాసిక్స్, ఫేవరేట్స్.. మీరు మళ్లీ అలా చూడాలని అనుకుంటున్నారా? అని ట్వీట్ చేశాడు.
నెటిజన్స్ అసహనం !..”అలా ఎందుకు చూస్తారు? అలాంటి కాన్సెప్ట్ పెడితే చెడుకే ఎక్కువగా వాడుకుంటారు. క్లోజ్డ్ థియేటర్లో చూస్తేనే ఫీలింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇక చాలా మంది నాగ్ అశ్విన్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా.. ‘మాయాబజార్’ చిత్రాన్ని అలా చూడాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఆపై ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘బాహుబలి’ వంటి సినిమాలు చూస్తే బాగుంటుందని కామెంట్స్ చేసారు.