బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డా. మోహన్.
సంగీతం : కోటి, కెమెరా : చిట్టిబాబు, ఎడిటింగ్ : నందమూరి హరి
నటీనటులు : డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామరాజు, సంద్యారాణి రావుపల్లి, శ్రియాంక,రమ్య, ఐ డ్రీం అంజలి, పితామగన్ మహదేవన్ తదితరులు…
రేటింగ్ : 3/5
అఘాయిత్యాల నేపథ్యంలో… సమాజంలో ఉన్న కులమతాల అసమానతల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రాంతాల్లో తక్కువ కులాలపై, ఆ కులాల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజాం పేట గ్రామంలో దొర రాజ్యం చేస్తుంటాడు. పైగా అతను ఆ ఊరికి ఎం ఎల్ ఏ. కూడా. అతన్ని కాదని ఆ ఊరిలో ఎవరు ఏమి చేయలేరు. పైగా అతనికి పోలీసుల ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గంగ అనే అమ్మాయి ఘోరంగా అత్యాచారానికి గురయ్యి మరణిస్తుంది. ఆమె ఈత రాక నీళ్లలో మునిగి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ గ్రామానికి ఏ ఎస్ పి గా వచ్చిన విక్రమ్ రాధోడ్ ( డా. మోహన్ ) నిజ నిజాలు తెలుసుకుని అసలైన దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో దొర ( రామరాజు ) కు సపోర్ట్ చేస్తూ అయన అన్యాయాలను కప్పిపుచ్చే సి ఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్ ) కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే న్యాయం అన్నది తక్కువ కులం , ఎక్కువ కులం అని కాకుండా అందరికి సమానంగా ఉండాలన్న లక్ష్యంతో.. గంగ ను మానభంగం చేసి చంపిన వారిని టార్గెట్ చేస్తాడు విక్రమ్ రాధోడ్. మరి ఈ పరిస్థితుల్లో విక్రమ్ రాథోడ్ కు ఎదురైన అడ్డంకులు ఏమిటి ? దొర కామానికి బలైన గంగ కు న్యాయం జరిగిందా ? అన్నది సినిమాలో చూడాలి…
డా. మోహన్ ఆకట్టుకున్నారు !… హీరో విక్రమ్ రాధోడ్ పాత్రలో డా. మోహన్ అదరగొట్టాడు. ఏ ఎస్ పి గా అయన చక్కగా నటించాడు. హీరోగా తొలి చిత్రమే అయినా, పోలీస్ అధికారిగా భిన్నమైన షేడ్స్ లో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్ సి ఐ చారి పాత్రలో నెగిటివ్ షేడ్ లో దుమ్ము రేపాడు. శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రలో లీనమై నటించాడు. ఇక ఎంక్వయిరీ అధికారిగా హీరో నవీన్ చంద్ర పాత్ర ఉన్నది కొద్దీ సేపే అయినప్పటికీ.. ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారిగా న్యాయం పక్కన నిలబడాలని చేసే ప్రయత్నం బాగుంది. అలాగే దొర పాత్రలో రామరాజు నటన హైలెట్. అలాగే దొర కొడుకు రాంబాబు పాత్రధారి, అన్నల నాయకుడిగా బెనర్జీ.. మిగతా పాత్రల్లో అందరూ బాగా చేసారు.
కోటి ఆర్ ఆర్ ప్రధాన ఆకర్షణ!… ఈ సినిమా టెక్నీకల్ అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి. ఈ సినిమాకు కోటి ఇచ్చిన ఆర్ ఆర్ ప్రధాన ఆకర్షణ. కథను డ్రైవ్ చేయడంలో కోటి ఆర్ ఆర్ సూపర్. ఈ సినిమా లోని ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ పాటకు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని అన్ని వర్గాల నుండి అభినందనలు వచ్చాయి. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ ఫోటోగ్రఫి. చిట్టిబాబు అందించిన ఫోటోగ్రఫి బాగుంది. ఇక ఈ సినిమా విషయంలో మరో ముఖ్యమైన అంశం ఎడిటింగ్. సీనియర్ ఎడిటర్ నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడు , హీరో మోహన్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలో ని సామాజిక సమస్యని తీసుకుని దర్శకుడు మోహన్ ప్రేక్షకుల దృష్టికి తీసుకు పోయే గొప్ప ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో ఉన్న కులమతాల అసమానతలు , మహిళలపై జరుగుతున్న దారుణాల నేపథ్యంలో కథను ఎంచుకున్నాడు దర్శకుడు. ఆలోచింప చేసే కథ, కథనంతో చక్కటి ప్రయత్నం చేసాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ.. ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన కథ ఇది. సమాజంలో అసమానతలకి అద్దం పట్టేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. డా. మోహన్ హీరోగా, దర్శకుడిగా రెండు పాత్రల్లో చక్కగా చేసాడు. హీరోగా ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడిగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. నవీన్ చంద్ర అధికారి పాత్రలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ అయ్యంగార్… చారి అనే పోలీస్‌గా చాలా బాగా నటించారు. అసలు శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర సినిమాకే హైలెట్. ఇక సంగీత దర్శకుడు కోటి ఓ పాత్రతో పాటు ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. నేటి సమాజంలోని సమస్యల నేపథ్యంలో ప్రజలలో మార్పుకోసం చేసిన మంచి ప్రయత్నం ఇది. మొత్తానికి డా. మోహన్ ఓ సమస్యను అందరికి తెలియచెప్పే అభినందనీయ ప్రయత్నం చేసాడని చెప్పొచ్చు.