కరుణానిధి … దక్షిణాదిన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తి కరుణానిధి. తమిళ భాషన్నా, సంస్కృతన్నా, సాహిత్యమన్నా కరుణానిధికి ఎంతో అభిమానం. అదే ఆయనను తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టేలా చేసింది. ‘కళైంజర్’ అనేది ఆయన బిరుదు. అంటే ‘కళాకారుడు’ అని అర్థం. ఆనాటి ‘జస్టిస్ పార్టీ’ నేత అలగిరిస్వామి స్ఫూర్తితో హిందీ వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అంతేకాదు స్థానిక యువకులతో కలిసి “తమిళనాడు తమిళ మానవర్ మాండ్రం” పేరుతో ఓ విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత కల్లకుడి ఉద్యమంతో ఆయన పేరు మార్మోగింది. 33ఏళ్ల వయస్సులో తొలిసారి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957లో కులత్తలై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాటి నుంచి అలుపెరగని ఈ రాజకీయ కురువృద్ధుడికి ఓటమన్నది తెలియదు. 1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వచ్చారు. మొత్తం 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13 సార్లు గెలిచారు. 1984 ఎన్నికల్లో మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1969లో తొలిసారి సీఎం పదవిని అలంకరించిన ఆయన.. 2006లో ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అవసరమైన ప్రతిసారి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించారు.
ఈ ‘కళాకారుడు’ …దేశ రాజకీయాల్లో చరిత్రకారుడు !
‘కలైంగర్’ముత్తువేల్ కరుణానిధి… తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించిన రాజకీయ చతురుడు. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ గడ్డను పాలించారు. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా ఆయన పని చేశారు. తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలులాంటివెన్నో రాశారు. తమిళ లిటరేచర్ కు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.
1924లో బ్రిటీష్ వారి పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుక్కువలై (నాగపట్నం జిల్లా)లో తమిళ నాయీబ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. కరుణానిధి అసలు పేరు దక్షిణా మూర్తి. స్కూలు రోజుల్లోనే డ్రామా, పొయెట్రీ, రచనపై ఆయన ఆసక్తి చూపించారు. జస్టిస్ పార్టీకి కీలక నేత అలగిరిస్వామి ప్రసంగాలతో ఉత్తేజితుడైన కరుణ… తన 14వ ఏట సాంఘిక పోరాటాల వైపు అడుగులు వేశారు.
14 ఏళ్ల వయసులోనే కరుణ రాజకీయపరంగా యాక్టివ్ అయ్యారు. అలగిరిస్వామి స్ఫూర్తితో ఆయన స్థానికంగా ఓ యూత్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత ‘తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్’ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. దీంతోపాటు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు. అనంతరం… 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే ట్రెజరర్ గా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.
1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. డీఎంకే తొలి అధినేత కరుణానిధే కావడం గమనార్హం. పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉన్నారు.ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలలో డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతాపార్టీతో కరుణ పొత్తు పెట్టుకున్నారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్ ను కరుణ బహిష్కరించారు. దీంతో, అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారు. ఎమర్జెన్సీ తర్వాత జరగిన ఎన్నికల్లో డీఎంకే ఓడిపోగా, అన్నాడీఎంకే విజయం సాధించింది. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
కరుణను 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. తంజావూర్ యూనివర్శిటీ ఆయనను ‘రాజ రాజన్’ అనే బిరుదుతో సత్కరించింది. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవనీతి ఆరోపణలతో అప్పటి జయలలిత ప్రభుత్వం కరుణను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు కరుణానిధి సాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్టీటీఈ నేత ప్రభాకరణ్ తనకు మంచి మిత్రుడు అంటూ కరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పద్మావతి అమ్మాల్, దయాళు అమ్మాల్, రజతి అమ్మాల్ లను కరుణ వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు భార్యలతో ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు, సెల్వి, కనిమొళి జన్మించారు.
తమిళ రాజకీయాలది, సినిమాలది విడదీయలేని బంధం. తన భావాలను బహిర్గతం చేయడానికి సినీ మాధ్యమాన్ని ఎంచుకున్నారు కరుణానిధి. ఆయన రచనలు అప్పటి సమాజాన్ని ఎండగట్టేవి. సమాజంలోని అసమానతల్ని వ్యతిరేకించడం కోసం సినిమాలనే ఒక బలమైన ఆయుధంగా ఎంచుకున్నారు.’సినిమా తారలు సినీ లోకాన్నే కాకుండా రాజకీయ ప్రపంచాన్ని కూడా శాసించగలరు’ అని నిరూపించారు కరుణానిధి. సాంఘీక దురాచాల్ని, సామాజిక రుగ్మతలను వ్యతిరేకిస్తూ తీసిన సినిమాలే ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతాయి. ఉన్నతమైన ఆశలు, ఆశయాలతో సినిమా రంగంలోకి వచ్చి తన పదునైన మాటలతో అప్పటి సమాజాన్ని ఎండగట్టారు.
కరుణానిధి సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ‘పరాశక్తి’. 1952లో వచ్చిన ఈ చిత్రంలోని సంభాషణలు ఆనాటి తమిళ ప్రేక్షకులను కుదురుగా కూర్చోనివ్వలేదు. భారతీయ సినిమాలు అంటే పాటలకే అధిక ప్రాధాన్యం అనుకునే రోజుల్లో పాటలు కాదు కావాల్సింది మాటలు అని తెల్చి చెప్పారు కరుణానిధి. ఆ మాటాలు కూడా రాజకీయ నాయకుల గుండేల్లో తూటాలుగా పెలాయి. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే శివాజీ గణేషన్ తమిళ తెరకు పరిచయమయ్యారు.మనోహర సినిమా, రచయితగా కరుణానిధి ప్రతిభకు అద్దం పడుతుంది. మంత్రి కుమారా, పుదైయల్, పూంబుహర్, నేతిక్కుదండనై, చట్టం ఒరు విలయాట్టు, పాసం పరవైగల్, పొరుత్తుపొదుం లాంటి సినిమాలన్నీ కరుణ కలం నుంచే జాలువారాయి. దాదాపు 39 సినిమాలకు కథలను అందించారు. రచనలు, నవలు, నాటికలు, పాటలు ఇలా అన్ని రంగాల్లో ఆయన తన ప్రతిభను చాటుకున్నారు..
కరుణానిధి, ఎంజీఆర్ ఒకే సమయంలో ఎదిగారు. తన కెరీర్ ను స్క్రీన్ రైటర్ గా ప్రారంభించిన కరుణ… తొలిసారి ‘రాజకుమారి’ చిత్రం కోసం పని చేశారు. ఈ సినిమా హీరో ఎంజీఆర్. ఆ తర్వాత కరుణ, ఎంజీఆర్ ల మధ్య చాలా కాలం పాటు స్నేహం కొనసాగింది. కరుణానిధి తన కలానికి పదును పెడితే.. దానికి ప్రాణం పోస్తూ వచ్చారు ఎంజీఆర్. ఇద్దరు ప్రాణ మిత్రులుగా ఉండేవారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమైంది. వీరిద్దరిపై మణిరత్నం తీసిన సినిమా ‘ఇద్దరు’. రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరూ దూరమయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేషణ్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాలకు ఆయన స్క్రీన్ రైటర్ గా పని చేశారు.కరుణానిధి 2011వరకు కథలు రాస్తూనే వచ్చారు. ఆయన రాసిన ‘పొన్నార్ శంకర్’ నవల ఆధారంగా.. పొన్నార్ శంకర్ పేరుతో 2011 సినిమా వచ్చింది. సినిమాలంటే ఆయనకు చాలా అభిమానం. అందుకే నేటి తరం హీరోలైన రజనీకాంత్, కమల్‌హాసన్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. కరుణా నిధి రెండు పడవలపై ప్రయాణం చేసి.. విజయవంతమయ్యారు.