‘లోఫర్’ లో వరుణ్ తేజ్ తో నటించి,ఇటీవల జాకీ ఛాన్ తో ‘కుంగ్ ఫూ యోగా’ లో చేసిన దిశా పటాని పేరు ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె తాజాగా చేసిన ‘బాఘి2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్లు కురిపిస్తోంది. మూడు రోజుల్లో రూ.73.10 కోట్లు వసూలు చేసింది. అందులో దిశా పెర్ఫార్మెన్స్ను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సినిమాల ఎంపికలో సూపర్ కేర్‌ఫుల్ అనేది ఈమెకు మారు పేరు. ఏ సినిమాలు బడితే ఆ చిత్రాలు చేసేయడానికి అంగీకరించదంటారు. అయితే ఈ ఏడాది బాలీవుడ్లో అతి పెద్ద ఓపెనింగ్ చేసిన చిత్రంగా ‘బాఘి2’ నిలిచిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…..
‘నేను సినిమా రంగానికి చెందిన కుటుంబం నుంచి రాలేదు. నా సినిమాలు సక్సెస్ అయితేనే మళ్లీ అవకాశాలొస్తాయని అప్పుడు తెలియదు. నేను నటనను ప్రేమిస్తా. నేను చేసే పెర్ఫార్మెన్స్ ద్వారానే అవకాశాలు వచ్చేలా చూసుకుంటా. నేను తిరస్కరించిన చాలా పాత్రలను మళ్లీ చేశాను. కొన్ని సినిమాలు ప్రారంభించాక, అప్పటికే ఎంపికైన వారి స్థానంలో నన్ను ఎంపిక చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. తిరస్కరణల నుంచి గతంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. కష్టపడడం నుంచి స్ఫూర్తిని పొందుతా. నేను చాలా సానుకూల దృక్పథంతో ఉంటాను. రూ.500తో ముంబయి వచ్చాను. చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. ఎక్కువగా టీవీ వ్యాపార ప్రకటనలకు వెళ్లాను. ఆ సమయంలో జాబ్ రాకపోతే రూమ్ రెంట్ ఎలా కట్టాలనే ఒత్తిడి నామీద ఎక్కువగానే ఉండేది. యాక్టింగ్‌కు రాకముందు చేయనిపని లేదు. నటనా రంగంలోకి వచ్చాక ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు నాకెవ్వరూ స్నేహితులు లేరు. నటించడం, ఇంటికి రావడం నిద్రపోవడం. ఇప్పుడు ఇలాగే నా జీవితం గడుస్తోంది. బోర్ ఫీలవడం లేదు. నేను సినిమాల్లో చేయనప్పుడు ఏం ఉద్యోగం చేయాలా? అని ఆలోచిస్తాను’ అని చెప్పింది.
300 కోట్ల ‘సంఘ మిత్ర’ వారియర్ క్వీన్‌గా ….
కదన రంగంలోకి కాలు పెట్టనున్నారు దిశా పటాని. జులై నుంచి ఈ గ్లామర్ గాళ్ గుర్రపు స్వారీ చేస్తూ, కత్తి తిప్పనున్నారట. ఇదంతా ఎందుకంటే ‘సంఘమిత్ర’ సినిమా కోసం. ఇందులో వారియర్ క్వీన్‌గా కనిపించటం కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు దిశా పటాని. సుందర్.సి దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రం ‘సంఘ మిత్ర’. శ్రీ తేనాండాళ్ ఫిల్మ్ బ్యానర్‌పై మురళీ రామస్వామి, ఎన్. రామస్వామి నిర్మించనున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. హైదరాబాద్‌లో రూపొందించే భారీ సెట్లో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని స్టార్ట్ చేయనున్నారట. ఈ పీరియాడిక్ డ్రామాలో ముందు హీరోయిన్గా శ్రుతీహాసన్‌ని అనుకున్నారు.ఆ తర్వాత ఆమె స్థానంలోకి దిశా పటాని వచ్చారు. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి నుంచే మొదలు కావాల్సిన ఈ షూట్ దిశా పటాని ‘భాగీ 2’లో బిజీగా ఉండటంతో జులైకి పోస్ట్‌పోన్ అయిందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌ని వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట దర్శకుడు సుందర్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్