స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విశేషం ఏమిటంటే.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్‌గా వ్యవహరించి.. సినిమాకు పనిచేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు….
“మసూద’ సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ విజన్ వరకు అంతా రాహుల్ యాదవ్ చూసుకున్నాడు. రాహుల్‌తోనే లెంగ్త్ గురించి మాట్లాడా. కానీ ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేసేది లేదు సార్ అంటాడు. అప్పుడనిపించింది.. అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని. అప్పుడే చెప్పాడు.. సార్.. ఇది సౌండ్‌తో పాటు చూడాల్సిన సినిమా అని. మసూద సక్సెస్. క్రెడిట్ గోస్ టు రాహుల్, సాయికిరణ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ని ఇంత నమ్మి, డబ్బు పెట్టి సినిమా తీసిన వీరిద్దరూ.. వీరి వెనుక ఉన్న సాంకేతిక నిపుణులు అందరూ సినిమాని ఓన్ చేసుకుని చేశారు. మీ అందరికీ బిగ్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఇది నా ఒరిజినల్ ఫీలింగ్. మీడియా వాళ్లందరికీ థ్యాంక్యూ. ఒక మంచి సినిమాను బతికిద్దాం. సపోర్ట్ చేద్దాం.అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా.. మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. నీ సినిమా టేస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు.. నేను ఏదో మనీ కోసం చేస్తున్నా అని. కానే కాదు. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు.. సపోర్ట్ చేస్తే.. కొంతమందికైనా సినిమా రీచ్ అవుతుందనేది నా నమ్మకం. ఈ సినిమాని థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్సే వేరు.అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడండి” అని అన్నారు.
నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘ఒక సిన్సియర్ ఎఫర్ట్‌ని అందరూ ఆదరిస్తున్నారు. మాములుగా అయితే నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా, నటీనటుల కనబరిచిన అభినయం.. ఇలా ప్రతీది థ్రిల్ ఇస్తుంది. నేను ఏదైతే థ్రిల్ అయ్యానో.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే ఫీలవుతున్నారు. నాకు ఈ టైమ్‌లో ఇలాంటి అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్ గారికి, నన్నీ పాత్రకు సెలక్ట్ చేసిన సాయిగారికి థ్యాంక్యూ. కెమెరా మ్యాన్. ప్రశాంత్ గారు ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతగానో కృషి చేశారు. అందరికీ థ్యాంక్యూ సోమచ్. దిల్ రాజుగారికి థ్యాంక్యూ’’ అని అన్నారు
దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. మొత్తం ఈ ప్రాసెస్‌లో సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు రాహుల్ నాతో షేర్ చేసుకునే వారు. ఆయన ఈ సినిమా కోసం ఎంత వర్క్ చేసింది నాకు తెలుసు. నేను కూడా నిడివి విషయంలో అభ్యంతరం చెప్పాను. కానీ రాహుల్ మొండివాడు. మొండివారు ఎప్పుడూ ఒడిపోరు. అదే ఈ రోజు అతనికి సక్సెస్‌ని ఇచ్చిందని అనుకుంటున్నా. విజువలైజేషన్లో సాయికిరణ్ బ్రిలియంట్ పర్సన్. తన విజన్‌ని నగేష్ కెమెరాతో, ప్రశాంత్ ఆర్. విహారి సౌండ్‌తో ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. నేను ఈ సినిమాని రెండు సార్లు చూశా. గొప్ప ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ రావాలంటే థియేటర్లోనే సినిమా చూడాలి. ’ అని కోరారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశా. నాకు చాలా బాగా నచ్చింది. 10 ఏళ్ల క్రితం కాంజురింగ్ అనే సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి కథలు రావాలంటే పెద్దవాళ్ల సహకారం కావాలి. సినిమాకు సపోర్ట్ అందించిన దిల్ రాజుగారికి థ్యాంక్యూ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఇలాంటి సినిమాలకు సపోర్ట్ వస్తే.. అలాంటి నటీనటులు బయటికి వస్తారు ’’ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు.