అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘రాధాకృష్ణ’ చిత్రానికి టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకులు శ్రీనివాసరెడ్డి సమర్పిస్తూ స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ఇది. హారిణి ఆరాధన క్రియేషన్స్, శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకాలపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణ సారథి పుప్పాల కృష్ణ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.
కృష్ణ కుమార్ మాట్లాడుతూ – ‘‘ఆదిలాబాద్ ఆటవీ ప్రాంతంలో లభించే పొనికి చెక్కతో ప్రాణం పోసుకునే నిర్మల్ బొమ్మ తయారీ పై ఆధారపడి ఎంతో మంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఎన్నో గొప్ప విశేషాల్లో నిర్మల్ బొమ్మ ప్రత్యేకమైనది. అయితే ఈ నిర్మల్ బొమ్మ కాలక్రమేనా ప్లాస్టిక్ బొమ్మల తాకిడికి గురయ్యింది. ఈ నేపథ్యంలో హృదయానికి హత్తుకునేలా ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా ఈ చిత్రాన్ని నిర్మించాము ’’ అన్నారు.
అనురాగ్, ముస్కాన్ సేథీ, అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి