అన్నమాచార్యను అహరహరమూ గొంతులో నింపుకున్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఇంటిలో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది ఏడు కొండలవాడు వేంకటేశ్వరుడే. సంసారపక్షంగా, క్లుప్తంగా ఉన్న ఆ ఇల్లు పదకవితా పితా మహునికి నిత్యం నీరాజనాలర్పించే గాయకుని ఆవాసం. సకుటుంబంగా సభతీర్చి హార్దికంగా, సామూహికంగా ఒక జీవితకాలపు చరిత్రల్ని సురభి ముందు ఆవిష్కరించింది ఆయన కుటుంబం.
రెండు తరాలుగా అటు మాతామహులు, ఇటు పితామహుల కుటుంబాలలో సంగీతం ఉంది. *బాలకృష్ణ ప్రసాద్ స్వస్థలం గుంటూరులో మంచాల అగ్రహారం.* కానీ తాతల కాలంలో తెలంగాణలోని మెదక్‌కు తరలి వెళ్లారు. నాన్నగారు నరసింహారావు గారు రాజమండ్రి వచ్చి మృదంగం, వయొలిన్, హార్మొనీ నేర్చుకున్నారు. కుటుంబ కారణాల వల్ల వారి నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తల్లుల అలనలో బాలకృష్ణ ప్రసాద్ సంగీతం పరిపుష్టమయింది.
ఆయన తొలినాటి జ్ఞాపకం.. రాజమండ్రిలో శ్రీపాద వారి ఇంట్లో ఒకాయన తనను ఇంటికి తీసుకువెళ్లి పాట పాడించుకొని జామపండు ఇచ్చేవారు. ఇది చిన్ననాటి జ్ఞాపకం. అమ్మతో చెప్తే “అవును. అప్పుడు నీకు రెండేళ్లు” అన్నారట. ఏవో నోటికొచ్చిన సినిమా పాటలూ అవీ పాడుకోవడమే కాక 7వ ఏట తండ్రిగారి దగ్గర మృదంగం నేర్చుకున్నారు. క్రమంగా హరికథలకు పక్కవాద్యం వాయించేవారు. ఆనాటి ప్రసిద్ధ హరికథకులు బుర్రా శివరామ శాస్త్రి, కూచిభొట్ల కోటేశ్వరరావు, ములుకుట్ల సదాశివ శాస్త్రి గార్లకు పక్కవాద్యం వాయించారు. అప్పటికి ఆయన వయసు 16పై మాట. తండ్రి సంగీతం పాఠాలు చెప్పేవారు. ఆ పాఠాలన్నీ నేర్చుకోకపోయినా బాలకృష్ణ ప్రసాద్ చెవుల్లో పడి మనసులోకి ఫిల్టర్ అయి స్థిరపడేవి.
ఓ సారి తండ్రిగారి శిష్యులు ఆర్. ఛాయాదేవి అనే అమ్మాయి పాడుతున్నప్పుడు ఏదో తప్పు పట్టారు బాలకృష్ణ ప్రసాద్. ఆమె తండ్రి ఎస్.ఎస్. ప్రకాశరావు గారు “పాడటమంటే తమాషా కాదు తెలుసా? నీకేం వచ్చని వేలు పెడుతున్నావు?” అన్నారు. “ఏదీ వీళ్లు పాడింది నువ్వు పాడు” అని రెచ్చగొట్టారు. “ఎంత టైమిస్తారు?” అడిగారు బాలకృష్ణ ప్రసాద్. “ఒక వారo.” అంతే. వారం తరువాత ఆమె పాడిన పాటలన్నీ యథాతథంగా పాడేశారు. ప్రకాశరావుగారు (ఆయన పాటకి మృదంగం వాయించారు బాలకృష్ణ ప్రసాద్) కోపాన్ని మరిచిపోయి “నీ గొంతు చాలా బావుందయ్యా, మృదంగం వాయిస్తావేమిటీ?” అన్నారు. ఏదైనా పాడితే బాల మురళీకృష్ణ లాగా పాడాలనిపిం చేది. తమిళ సినిమా ‘తిరువిళైయాడల్’లో “ఒరు నాళ్ పోదుమా” అనే బాల మురళి పాటను ప్రాక్టీసు చేశారు. ఆయన పినతల్లి ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె చెల్లెలు సరోజ ద్వారా మద్రాసు నుంచి “ఒరునాళ్ పోదుమా” పాట 78 ఆర్.పి.ఎమ్. రికార్డు తెప్పించు కున్నారు. జానకి మామగారు ప్రముఖ మోనో యాక్టర్ చంద్రశేఖరం గారు. పెద్ద బూర, కుక్క బొమ్మ ఉన్న గ్రామ్‌ఫోన్ ప్లేయర్ ఇచ్చారు. ఇక సినిమా పాటలకది ‘కీ’ ఇచ్చిన అవకాశం. బాలకృష్ణ ప్రసాద్ ‘భక్త ప్రహ్లాద’లో ‘ఆది అనాదియు నీవే దేవా’, ‘శివ శంకరీ’, ‘ముక్కోటి దేవతలు’ వంటి పాటలు విరివిగా పాడేవారు. ఈ పాటలు విన్నకొద్దీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనే కోరిక పెరిగింది. అప్పటికి ఆయనకు 18 ఏళ్లు. ఇంట్లోనే ఇద్దరు గురువులు- ఇద్దరు తల్లుల రూపంలో ఉన్నారు. 1968లో ప్రారంభించి ‘సంగీత భూషణ్’ కోర్స్ ప్రైవేటుగా పూర్తి చేశారు. అతి కష్టం మీద హెచ్.ఎస్.సి పూర్తి చేసి (వారిదే ఆఖరి బ్యాచ్) 11వ క్లాసు వరకు లాగారు. తర్వాత టైపు, షార్ట్ హాండ్ సంస్కృతం నేర్చుకున్నారు.
మొదటి ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. సి.సి.డబ్ల్యు.డిలో గుమాస్తా, టైపిస్టు. అయితే మనసు మరెక్కడో ఉంది. ఆరు నెలలు ఉద్యోగం చేశారు. 3 సార్లు రాజీనామా చేశారు. పెద్దలు ఒప్పించి మళ్లీ ఉద్యోగంలో చేర్చేవారు. ఇక లాభం లేదని ఈసారి రాజీనామా చేసి పుట్టపర్తికి పారిపోయారు. బెంగుళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. మరి కొన్నాళ్లకి హైదరాబాద్‌లో ఉప్పల్ దగ్గర పెంగ్విన్ టెక్స్ టైల్స్ చేశారు. ఆ ఉద్యోగం మూడున్నరేళ్లు సాగింది. ఒక పక్క లలిత సంగీత సాధన జరుగుతోంది. 15వ ఏట ఆలిండియా రేడియోలో మృదంగం ఆడిషన్లో ఎంపికయ్యారు కానీ ఆ వయసు చెక్కు సంతకం చేసే వయసు కాదన్నారు. హైదరాబాద్‌లో కళాసాగర్ సంస్థ త్యాగరాజ కీర్తనలు, శాస్త్రీయ సంగీత పోటీలను నిర్వహించింది. అందులో బాలకృష్ణ ప్రసాద్‌కు మొదటి బహుమతి వచ్చింది. ముందు ముందు తన జీవితాన్నంతటినీ ప్రభావితం చేసే గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా నొటేషన్స్ ఉన్న 14 దీక్షితార్ కీర్తనల గ్రంథాల్ని బహుమతిగా అందుకున్నారు. మరొక పక్క రేడియోలో లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతానికి ఆడిషన్ అయి పాటలు పాడుతున్నారు. రేడియోలో సంగీత విభాగం ప్రొడ్యూసర్ పాలగుమ్మి విశ్వనాథం గారికి వారి పాట రుచి అందింది. రేడియో స్టేషన్‌కు వెళ్లినప్పుడల్లా సరస్వతి (వీణ), ఈమని శంకరశాస్త్రి గారి సోదరీమణి పాకాల సావిత్రీదేవి వంటివారి పరిచయాలు దొరికాయి. 1976లో ‘భక్తి రంజని’ కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి గారి సారథ్యంలో అన్నమాచార్య కీర్తనలు రికార్డు చేయించాలని పాలగుమ్మి సంకల్పించారు. ఆ కార్యక్రమానికి ఎన్నికయిన కళాకారులు బాలకృష్ణ.
చిత్తరంజన్, ఛాయాదేవి, లలిత, హరిప్రియ. ఒక రోజు రిహార్సల్. రెండు రోజులు రికార్డింగ్. మొదటి రోజు రికార్డింగ్ అయ్యాక అందరూ లాన్స్‌లో కూర్చున్నారు. నేదునూరితో బాలకృష్ణ ప్రసాద్ “అన్నమాచార్య కీర్తనలు అతి మధురంగా ఉన్నాయి” అన్నారు. నేదునూరి నవ్వారు. “ఈ పాటలు ఇంకా ఉన్నాయా?” అని అడిగారు భవిష్యత్తులో అన్నమాచార్యను కొంగు బంగారం చేసుకోనున్న బాలకృష్ణ ప్రసాద్. “వేల సంఖ్యలో ఉన్నాయి” అన్నారు నేదునూరి, “అవన్నీ మాకెలా వస్తాయి? ఎలా నేర్చుకోవాలి?” అని ప్రశ్న. అప్పుడు నేదునూరి చెప్పారు- సంగీతంలో ప్రవేశం ఉన్నవారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించి స్కాలర్షిప్ ఇచ్చి సంగీతం నేర్పించి రెండేళ్ల పాటు ఈ కీర్తనలను నేర్పించే ఒక పథకాన్ని సిద్ధం చేస్తోందని అయితే రెండేళ్ళ తర్వాత దాని వల్ల వృత్తిపరంగా ఏం లాభమో ఆలోచించుకోమన్నారు నేదునూరి. నేదునూరి నేతృత్వంలో బాలకృష్ణ ప్రసాద్ నోటిలో పలికిన మొదటి అన్నమాచార్య కీర్తన శుద్ధ ధన్యాసి రాగంలో “భావములోన” బాలకృష్ణ ప్రసాద్ మనసు తిరుపతి ప్రాజెక్ట్ వైపే లాగుతోంది. దరఖాస్తు పెట్టారు. మరో నాలుగు నెలలకు ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఎంపిక చేసే గాయకులు పద్మవిభూషణ్ (అప్పటికింకా రాలేదు) నేదునూరి కృష్ణమూర్తిగారి గురువులు శ్రీపాద పినాకపాణిగారు. 30 మంది దరఖాస్తులు పెట్టారు. ఒక్క బాలకృష్ణ ప్రసాద్‌ని ఎంపిక చేశారు పినాకపాణిగారు. నేదునూరి కృష్ణమూర్తిగారు ఒక ఏడాది శిక్షణ ఇచ్చాక వారికి సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా విజయనగరం బదిలీ అయింది. ఆ స్థానంలో పశుపతిగారొచ్చారు.
తిరుపతిలో గోవిందరాజ స్వామి ఉత్తరమాడ వీధిలో నమ్మాళ్వార్ గుడిలో బస. సర్వకాల సర్వావస్థలలోనూ సంగీతమూ, అందునా అన్నమాచార్య మీదే ధ్యాస. రోడ్డు మీద వెళ్తున్నా పాట పెదాల మీద కదిలేది. గుడికి నాలుగైదు ఇళ్ల అవతల ‘ఇంట్లో ఒక తమిళ అమ్మాయి కుటుంబం ఉండేది. ఆమె పేరు రాధ. ఆవిడ బాలకృష్ణ ప్రసాద్ సంగీతం తుంపర్లను ఒడిసి పట్టుకునేది. ఒకసారి ఆయన్ని ఆపి ఇంట్లోకి పిలిచి పది రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి తనకి పాటలు నేర్పమంది. నేర్పుతానన్నారు బాలకృష్ణ ప్రసాద్. నమ్మాళ్వార్ గుడిలో బసకి రమ్మన్నారు. ఈ సంగీత సాధన ఏడాది సాగింది. ఇద్దరి గొంతులు కలిశాయి. క్రమంగా మనసులు కలిశాయి. ఇంటికన్నా గుడి పదిలమని రోజూ భవానీనగర్ ఆంజనేయ స్వామి గుడిలో కలుసుకునేవారు. మరొక పక్క బాలకృష్ణ ప్రసాద్ తల్లి దగ్గర కూడా ఆ అమ్మాయి పాఠాలు చెప్పించుకునేది. ఎన్నాళ్లు ఈ సాంగత్యం? చివరికి బాలకృష్ణ ప్రసాదే బయిటపడి పెళ్లి ఊసెత్తారు. మరో ఏదాది ఆగాలి. పెద్దల అంగీకారం కావాలంది రాధ. రాధ తండ్రికి రైల్వేలో ఉద్యోగం. బాలకృష్ణ ప్రసాదే వెళ్లి రాధ తండ్రితో తన ఆలోచన చెప్పారు. ఎవరికీ అభ్యంతరం లేదు. జీవితాలు ముడిపడ్డాయి. ఇద్దరూ కలసి పదేళ్లు కచ్చేరీలు చేశారు. ఏడాది తిరగకుండా పెద్దబ్బాయి పవన్ కుమార్ (ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఏకమైన జంట కదా!) పుట్టాడు. రెండో అబ్బాయిది భరణీ నక్షత్రం. ‘ఆ’ అక్షరంతో పేరు రావాలి. ఏం చేయాలని ఆలోచిస్తుండగా అన్నమాచార్య ప్రాజెక్టులో పని చెయ్యడానికి వచ్చిన మరో ప్రసిద్ధ విద్వాంసులు సంధ్యావందనం శ్రీనివాసరావు సూచన చేశారు. రెండో అబ్బాయికి ‘అనిల్ కుమార్’ అని బారసాల చేశారు. పెళ్లయ్యాక సొంతంగా ఒక స్కూలు పెట్టాలని, తిరుపతి, చిత్తూరులలో ఆ స్కూలును నిర్వహించాలని బాలకృష్ణ ప్రసాద్, తల్లి, రాధలు అనుకొన్నారు. అయితే టీటీడీవారు కేవలం అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఒక విభాగాన్ని ఏర్పరుస్తు న్నారని, అందులో పనిచేయడానికి ఆర్టిస్టులను పిలుస్తున్నారని తెలిసింది. ఇంకేముంది? రొట్టె విరిగి నేతిలోనే పడబోతోంది. దరఖాస్తు పెట్టమని శ్రీమతి, పశుపతి అంతా ముందుకు తోశారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పి.వి.ఆర్.కె. ప్రసాద్, కామిశెట్టి శ్రీనివాసులు స్పెషలాఫీసరుగా ఆ విభాగం ఏర్పడింది. బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు ఎంపికయ్యారు. ఇక ముమ్మరంగా అన్నమాచార్య బాలకృష్ణ ప్రసాద్ జీవితంలో స్థిరపడ్డాడు. ఆయన గాత్రం ద్వారా వెంకటేశ్వర స్వామి భక్తుల రసజ్ఞుల గుండెల్లో కొలువు తీరాడు. అదొక ఉద్యమం. మహాయజ్ఞం.
జీవితంలో మరిచిపోలేని, అపూర్వమైన అనుభవాలేవి? ఎన్నో ఎన్నో అంటూ శ్రీమతి చెప్పారు. తిరుమలలో స్వామివారి సన్నిధిలో కనీసం నాలుగుసార్లు గంట చొప్పున కచ్చేరీలు చేశారు. స్వామి వారి సన్నిధిలో- భాండాగారంలో శతాబ్దాలు నిలచిన సాహితీ, సంగీత పరంపరని వారి సమక్షంలోనే సేవించుకునే అదృష్టం ఎందరికి వస్తుంది? ఏ కీర్తనలు పాడారు? వినరో భాగ్యము (శుద్ధ ధన్యాసి), కొండలలో నెలకొన్న (హిందోళ), నారాయణ నీ నామము (హిందోళ), పొడగంటిమయ్యా (మోహన), ఇతడొకడే (మోహన) ఇలా… విశాఖపట్నంలో చంద్రశేఖర్ అనే ఒకాయన వేంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన కలలో స్వామి కనిపించి తిరుపతిలో ఉన్న బాలకృష్ణ ప్రసాద్ అనే గాయకుడి గురించి తెలిపారు. అంతవరకూ ఆ పేరు వినలేదు చంద్రశేఖర్. సరాసరి తిరుపతికి వచ్చి అన్నమాచార్య ప్రాజెక్టులో వాకబు చేశాడు. అప్పటి నుంచీ ఆయన బాలకృష్ణ ప్రసాద్ పాటకి భక్తుడయ్యాడు. 1984లో బాలకృష్ణ ప్రసాద్ వెన్నుపూసకి ఆపరేషన్ జరిగింది. వైద్యం శరీరానికి జరిగినా మంచం మీద ‘బ్రహ్మ కడిగిన పాదము’, ‘వినరో భాగ్యము’ వంటి కీర్తనలు పాడుతూ మనసుకు చికిత్స చేసుకుంటూనే ఉన్నారు. అన్నమాచార్య కీర్తనలకు స్వయంగా బాణీలు సమకూర్చారు. మధ్య మధ్య లలిత సంగీత రచనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ ప్రసాద్ శిష్యగణం వందకి పైగానే ఉన్నారు. వారిలో ఎన్.సి. శ్రీదేవి, గురజాడ మధుసూదనరావు, రంగనాథ్, వి. రఘు, ఆర్. బుల్లెమ్మలను గుర్తు చేసుకున్నారు. రెండవ కుమారుడు అనిల్ కుమార్ తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకుని తండ్రితోనే కచ్చేరీలో పాల్గొన్నాడు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన సంకీర్తన యజ్ఞం, హైదరాబాద్‌లో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన అన్నమాచార్య కీర్తనల లక్ష గళార్చనను అనిల్ కుమార్ గుర్తు చేసుకున్నారు.
“మీ వారిలో మీరు గుర్తించిన గొప్ప లక్షణం?” శ్రీమతిని అడిగిన ప్రశ్న. “హృదయాన్ని స్పందింపజేసే ధోరణి. పాటలో, పద్ధతిలో నిర్దుష్టత(పెర్ఫెక్షన్)” అన్నారు. బాలకృష్ణ ప్రసాద్ సినిమాలు చూస్తారా? విరివిగా. అభిమాన నటులు ఎన్.టి. రామారావు, కమల్ హాసన్, శివాజీ గణేశన్. ఇష్టమైన సినిమాలు? సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాల జాబితా ముందుకు దూకింది. నవరంగ్, సీతారామ కళ్యాణం, లవకుశ, నర్తనశాల, భూకైలాస్, శాస్త్రీయ సంగీతానికి, సంప్రదాయ బద్ధమైన జీవుని వేదనకే ఆయన ఆలోచనలు ఎలా ముడిపడ్డాయో ఇది చెప్తుంది. జీవితంలో ఇంకా ఏం చేయాలని ఉంది అని అడిగినప్పుడు చాలా మంది సంగీతజ్ఞుల మనసులో ఉండే కోరికలనే ఆయన కూడా వెల్లడించారు. తాను బాణీలు చేసిన పాటలు తన గొంతుతోనే రికార్డు చేయాలి. స్వయంగా రచన చేసిన 400 కీర్తనలు తన గొంతుతో రికార్డు చేయాలి. 400కు పైగా లలిత సంగీత గేయాలు అలాగే చేయాలని, మరో వింత కోరిక, విలక్షణమైన కోరిక తెలియజే శారు బాలకృష్ణ ప్రసాద్. సంగీతం మనిషిని ఎలా ఉన్నత స్థితికి తీసుకు వెళ్తుందో, ఎంత గొప్ప స్థితికి తీసుకురాగలదో అన్న ఇతివృత్తంతో ఒక నవల రాయాలని. “నా సంగీతమంతా మా అమ్మ నుంచి వచ్చింది. నా బాణీకి మూడు సూత్రాలు చెప్పమంటే బాల మురళీకృష్ణ, నేదునూరి, ఎస్. జానకి సమ్మేళనం” అంటారు. ఆయన అభిమాన గాయకులు ఓ పది స్థానాలలో నేదునూరి కృష్ణమూర్తి, బాల మురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, ఎమ్మెస్ బాల సుబ్రహ్మణ్య శర్మ. వీరు కాక మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, పి. సుశీల, జానకి, ఘంటసాల. “మా నాన్నగారు అన్నమాచార్య సంకీర్తనలకు చేసిన సేవలో పెద్ద వాటా మా అమ్మది. ఆయన్ని, ఇంటిని, బిడ్డల్ని సాకడంలో, ఈ కుటుంబాన్ని నిర్వహించడంలో, పరోక్షంగా ఆయన కృషికి దోహదం చెయ్యడంలో ఎప్పటికప్పుడు స్ఫూర్తినీ, దోహదాన్ని ఇవ్వడంలో, మాకు ప్రేమనీ, అభిమానాన్నీ…..” అనిల్ కుమార్ గొంతులో ఆర్ద్రత, ఆవేశం అర్థమవుతున్నాయి. మహానుభావుల జీవన ప్రస్థానాలలో మౌనంగా నివాళులర్పించే చలివేంద్రాలు జీవన భాగస్వాములు. ఆ వాటా శ్రీమతి రాధకి నిర్దుష్టంగా దక్కాలని ఇద్దరు కొడుకుల ఆవేశం, భర్త ఆనందం చెప్పకనే చెప్పాయి.
వారికి వైకుంఠ ప్రాప్తి ప్రాప్తిస్తుందని ఆశిస్తూ…
శ్రీ ఎమ్ వి ఎస్ ప్రసాద్ గారి సౌజన్యంతో…