సీనియర్ నటుడు దేవదాస్ కనకాల సతీమణి లక్ష్మీదేవి శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు సంతాపం తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి వి.కె. నరేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
దేవదాస్ కనకాల అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆయన గతంలో ఓ యాక్టింగ్ స్కూల్‌ను నడిపారు. ఆ స్కూల్‌కు లక్ష్మీదేవి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. యాక్టింగ్ స్కూల్ ద్వారా కొత్త నటులను ప్రోత్సహించడంలో ఆమె ముందుంటారు. ఆమె పలు నాటకాల్లో నటించారు. యుక్త వయసులో ఉన్న సమయంలో దేవ్‌దాస్ కనకాలతో కలిసి ‘చుట్టుముట్టండి’ అనే నాటకంలో నటించారు. ఆ నాటకంలో లక్ష్మీదేవి.. దేవ్దాస్కు తల్లిగా నటించారు. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉండటంతో దేవదాసు కనకాలను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.యాక్టింగ్ స్కూల్ ద్వారా అనేకమందికి నటనలో ఓనమాలు దిద్దించిన లక్ష్మీదేవి ‘మాస్టారు కాపురం’, ‘మాయలోడు’ తదితర చిత్రాల్లో నటిగా అద్భుతమైన పాత్రలు పోషించారు.
లక్ష్మీదేవిగారి శిష్యుడినైనందుకు గర్వపడుతున్నాను !
`పేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. వారు దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని` మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
కాగా చిరంజీవి హైదరాబాద్ సిటీ లో లేని కారణంగా దేవదాసు-లక్ష్మీదేవి కుమారుడు రాజీవ్ కనకాలను ఫోన్లో పరామర్శించారు.
సొంత మనిషిని పోగొట్టుకున్నా !
రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్‌ల స్నేహం గురించి తెలియంది కాదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన చిత్రంలో కీలకమైన పాత్రను రాజీవ్ కనకాల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహాబంధం ఉంది. కనకాల ఫ్యామిలీలో ఒకడిగా ఫీలయ్యే ఎన్టీఆర్.. కనకాల లక్ష్మీదేవి మరణం పట్ల తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. తన సొంత మనిషిని పోగొట్టుకున్నానని, ఆమె మరణం తనకి తీరనిలోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ తెలిపారు.
కన్న కూతురిలా చూసుకున్నారు !
అమ్మది సంపూర్ణమైన జీవితం. నట శిక్షకురాలిగా ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. నటుడిగా, నటిగా చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని ప్రయతించే ప్రతి ఒక్కరినీ తన కన్నబిడ్డలా చేరదీశారు. నిన్నటి వరకూ ‘ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.’’ అని ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తన మాతృమూర్తి గురించి వ్యాఖ్యానించారు.రాజీవ్ సతీమణి, ప్రముఖ యాంకర్, నటి సుమ అత్తగారితో ఆమె అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనను కోడలిగా కాకుండా కన్న కూతురిలా చూసుకున్నారని సుమ తెలిపారు.