ఇది నాలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర !

స్టార్‌ కథానాయిక దీపికా పదుకొనె తాను తాజాగా నటిస్తున్న చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఆ ఫస్ట్‌లుక్‌ చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. ఈ ఫస్ట్‌లుక్‌లో ఉన్న దీపికా పదుకొనెని చూసి షాకయ్యారు. పాత్రకు ప్రాణం పోసినట్టు ఉందంటూ… దీపికా అభిమానులతోపాటు నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ‘ఛపాక్‌’ పేరుతో ఓ బయోపిక్‌ని రూపొందిస్తున్న విషయం విదితమే. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దీపికా పదుకొనె సోమవారం సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. ‘ఈ పాత్ర నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమా షూటింగ్‌ నేటి నుంచే మొదలు’ అంటూ దీపికా ఫొటోతోపాటు పేర్కొన్నారు. ఇందులో మాలతిగా దీపికా నటించబోతున్నారు. లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా సినిమాని వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆమె పేరుకి బదులు మాలతి అని పెట్టడంపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ్యాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌తోపాటు కెఎ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. దీపికా పదుకొనె నిర్మాతగా మారుతూ కెఎ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ని స్టార్ట్‌ చేసిన విషయం విదితమే. విక్రాంత్‌ మన్సే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
క్షమించండి.. ఇక నుంచి కష్టపడతాను !
దీపిక పదుకొణె అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఫిలింఫేర్‌ అవార్డుల వేడుక ముంబయిలో జరిగిన సంగతి తెలిసిందే. ‘పద్మావత్‌’ సినిమాకు గానూ దీపికకు ఉత్తమ నటి అవార్డు వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ‘రాజీ’ సినిమాకు గానూ ఆలియా భట్‌కు ఆ అవార్డు వరించింది. దాంతో దీపిక అభిమానులు నిరాశచెందారు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశిస్తూ.. దీపిక సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. మీ నమ్మకాన్ని వమ్ముచేశాను. ఇకనుంచి కష్టపడి పనిచేస్తానని మీకు మాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఫిలింఫేర్‌ షోలో ఉత్తమ నటిగా దీపిక పదుకొణె, ఆలియా భట్‌ నామినేట్‌ అయ్యారు. అవార్డు ఆలియాను వరించింది. ఆమె నటించిన ‘రాజీ’ సినిమా నాలుగు కేటగిరీల్లో నామినేట్‌ అయ్యి అవార్డులు దక్కించుకుంది. దీపిక భర్త రణ్‌వీర్‌ సింగ్‌కి ‘పద్మావత్‌’ సినిమాకు గానూ బెస్ట్‌ క్రిటిక్‌ అవార్డు దక్కింది. తన భార్య చేతుల మీదుగానే ఆయన అవార్డు అందుకున్నారు