అందం అవరోధంగా మారడం అప్పుడప్పుడు జరుగుతుంది. సౌందర్యాన్ని కలిగివుండటం చిత్రసీమలో ఒక్కోసారి శాపంగా మారుతుందని, తన అందం వల్ల పాత్రలపరంగా ఎన్నో గొప్ప అవకాశాల్ని కోల్పోయానని చెబుతున్నది బాలీవుడ్ సుందరి దీపికాపదుకునే. గ్లామర్ పాత్రలు ఒక స్థాయి వరకే గుర్తింపును తీసుకొస్తాయని, నటిగా సత్తా చాటాలంటే పాత్రల్లో నవ్యత ప్రదర్శించాలని ఈ బెంగళూరు అందగత్తె అంటున్నది.
దీపిక మాట్లాడుతూ…. చక్కటి అందం, అభినయసామర్థ్యం వుంటే చిత్రసీమలో అవకాశాల్ని సంపాదించుకోవచ్చు. అయితే కేవలం గ్లామర్‌తో పరిశ్రమలో సుదీర్ఘకాలం రాణించలేం. రెండేళ్ల క్రితం ఓ అగ్ర దర్శకుడు చెప్పిన మహిళా ప్రధాన కథాంశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో ద్విపాత్రాభినయం చేయాల్సివుంది. ఒక పాత్రలో పూర్తిగా ప్రతినాయిక ఛాయలతో కనిపించాలి. ‘మీరు చాలా అందంగా వుంటారు. మిమ్మల్ని నెగెటివ్ పాత్రలో మలచడం చాలా కష్టం’ అంటూ ఆ దర్శకుడు చివరి నిమిషంలో నన్ను వద్దనుకున్నాడు. ఇదే తరహాలో ఎన్నో సినిమాలు మిస్సయ్యాయి. అందంగా వుండటం వల్ల ఒక్కోసారి నష్టం కూడా వుంటుందని అర్థమైంది. నా విషయంలో అందం కూడా శాపమవుతున్నది అని బాధను వ్యక్తం చేసింది దీపికాపదుకునే. ఆమె కథానాయికగా నటించిన ‘పద్మావతి’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా రాజ్‌పుత్‌లు ఆందోళన బాటపట్టడంతో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది.