‘టైమ్స్’ సెలెబెక్స్ మంత్లీ రేటింగ్ ఇండెక్స్ ‘టీ స్కోర్’ టాప్ 50 ర్యాంక్స్లోని కథానాయికల విభాగంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మొదటి స్థానంలో నిలవడం విశేషం ఓ విషయమైతే హీరోల విభాగంలో రణ్వీర్ సింగ్ ప్రధమ స్థానంలో నిలవడం మరో విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి పత్రికలు, టీవీ, ఆన్లైన్ మీడియా, వారి సినిమాల కలెక్షన్లు, నటన, ప్రకటనలు, పాపులారిటీ ఇలా విభిన్న అంశాలను ప్రధానంగా తీసుకుని నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంక్‌లను నిర్ణయించారు.
కథానాయికల విభాగంలో దీపికా తర్వాత సోనమ్ కపూర్, అలియా భట్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, జాక్వెలిన్, పరిణీతి చోప్రా, సోనాక్షి సిన్హా, బిపాసా బసు తొలి పది ర్యాంకులను దక్కించుకున్నారు. కత్రీనా కైఫ్ 16వ ర్యాంక్, రకుల్ ప్రీత్ సింగ్ 18వ స్థానంలో నిలవగా, ఐశ్వర్యరాయ్ 37వ ప్లేస్‌తో వెనుక పడ్డారు. హీరోల విభాగంలో రణ్వీర్ సింగ్ తర్వాత వరుసగా షాహిద్ కపూర్, అక్షరు కుమార్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, రాజ్ కుమార్ రావ్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ తొలి పది ర్యాంకులను దక్కించుకున్నారు. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 11వ స్థానానికి పరిమితం కాగా, రజనీకాంత్ 16వ స్థానంలో, రానా 37వ స్థానంలో నిలిచారు. ఇటీవల ‘పద్మావత్’ చిత్రంతో దీపికా మెప్పించిన విషయం విదితమే.