తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించి అన్ని వర్గాల్లో భయాందోళనలను రేకెత్తించిన జీవో ఏదైనా ఉందంటే అది ఇదే. జీవో 111… ఈ పేరు వింటేనే అందరికీ హడల్. ఈ రాజకీయ రాక్షస క్రీడలో వ్యవసాయ రైతులు బలవుతున్నారు. మెతుకునిచ్చి బతుకులు పండించే పచ్చని పల్లెలు కాంక్రీట్ సౌధాలకు సమాధులవుతున్నాయి. జీవోలను అడ్డుపెట్టుకుని నాయకులు, వారి తొత్తులు చేసే దురాగతాలపై ఓ యువకుని తిరుగుబాటు ఫలితమే ఈ 111. సమాజంలోని వాస్తవ పరిస్థితులకు, మృగ్యమౌతున్న ప్రశాంత జీవనబంధాలకు హృద్యమైన దృశ్యరూపం, ఇది ఏ ఒక్కరిదో కాదు… ఇది అందరి కథ. మనందరి వ్యథ. సజీవమైన వాస్తవ కథ . ప్రభుత్వ జీవోలు ఏవైనా ప్రజల మెరుగైన జీవన విధానానికి బలమైన ఆయుధాలవ్వాలని చెప్పే ప్రయత్నంతో తెరకెక్కుతున్న చిత్రమిది. హైదరాబాద్ శివారులో జీవో 111 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ 111 సినిమా ఉంటుంది.
వి.ఆర్.ఈ చిత్రానికి దర్శకుడు. సురేష్ కొండేటి సమర్పణలో వై. రఘునాథరెడ్డి, స్నేహలత ఈ సినిమాని నిర్మిస్తున్నారు ‘విక్రమార్కుడు’ లాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన సర్వేస్ మురారి ఈ 111 సినిమాకి డీవోపీ, కమల్ హాసన్ బ్యానర్లో పనిచేసి తమిళ చిత్రసీమలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న లెండర్ లీ మార్టి సంగీతం అందిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్. మంచి మేకింగ్ విలువలు, మంచి నటులు, విప్లవాత్మక కథ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి తారాగణంతో రూపొందుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. మంచి చిత్రాలను అందించాలన్న సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నామన్నారు.