హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో.. మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి జీవిత iరాజశేఖర్‌తో టాలీవుడ్‌కు చెందిన పలువురు హాస్పిటల్‌లో వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే ఆరోగ్యం మరింత విషమించి.. తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు.
సూర్యపేట జిల్లా కోదాడలో 1969 డిసెంబర్ 30న జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా.. హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన అతనికి పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది. వేణుమాధవ్ తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా మంచిపేరు తీసుకొచ్చాయి.వెంకటేశ్ హీరోగా.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మి’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ కు ‘నంది’ పురస్కారం లభించింది
ఎమ్మెల్యేగా విజయం సాధించాలని
వేణుమాధవ్.. రాజకీయాల్లో కూడా రాణించాలని అనుకున్నారు. సినిమాల్లోకి రాకముందే.. టీడీపీ ఆఫీసులో ఆయన పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలకు ఇచ్చారు. తన టాలెంట్‌తో ఎన్టీఆర్ దృష్టిలో పడ్డాడు.హైదరాబాద్‌లోని తెదేపా కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా.. టీడీఎల్పీ కార్యాలయంలో లైబ్రరీ అసిస్టెంటుగా … కొన్నాళ్లు ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్‌గానూ పనిచేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. కోదాడ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..ఎమ్మెల్యేగా విజయం సాధించాలనేది వేణుమాధవ్ చిరకాల కోరిక. ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన మీడియా ముందు బహిరంగంగా చెప్పారు. గత ఎన్నికల్లో కోదాడ స్థానానికి ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే… ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక తీరకుండా కన్నుమూయడం దురదృష్టకరం.
కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయా
వేణు మాధవ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి వేణుమాధవ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి ‘మాస్టర్’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయన్నంతగా నటించేవాడు. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చేవాడు . వయసులో చిన్నవాడు. తనకింకా బోలెడంత భవిష్యత్ ఉందని అనుకునే వాడిని. కానీ దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నా అన్నారు
లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు
వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని కథానాయకుడు రాజశేఖర్ అన్నారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు….వేణుమాధవ్ మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. నన్ను ‘బావా’ అని, జీవితను ‘అక్క’ అని వేణుమాధవ్ పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం.మేమిద్దరం సుమారు పది చిత్రాల్లో కలిసి నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తనకు మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సమయంలో వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట. కానీ, ఎవరికీ తెలియనివ్వలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేసి… ఎన్నికల్లో విజయం సాధించారు. ‘మా’కు సంబంధించి ఏ విషయం వచ్చినా వెంటనే స్పందించేవారు. అందరినీ ఎన్నో ఏళ్లు నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నాడు వేణుమాధవ్ ’’ అని అన్నారు.