ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్ 18న మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ”క్రియేటివ్ కమర్షియల్స్ మా కె.ఎస్. రామారావుగారి నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమిది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నేషనల్ వైడ్‌గా స్పోర్ట్స్ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది . గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో క్రికెట్ అనేది ఒకరకంగా చెప్పాలంటే నేషనల్ గేమ్‌లాంటిది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’.
ఇందులో హీరోయిన్‌గా చేసిన ఐశ్యర్యా రాజేష్… సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. క్రికెటర్ క్యారెక్టర్ ని జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్ చేయడం ప్రారంభించింది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఐశ్వర్యా రాజేష్ ఎవరో కాదు.. మా కొలీగ్ రాజేష్ కూతురు. అలాగే కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను.
ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా క్లైమాక్స్ ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్ కమర్షియల్స్‌కి ఇది మరో విజయం అవుతుంది. అలాగే కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు” అన్నారు.
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవిగారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో ఆయనకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెల్సిందే. ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్‌మెంట్ చాలా అవసరం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా, స్క్రీన్‌ప్లే పరంగా, సబ్జెక్ట్ పరంగా కానీ ఇది విభిన్నమైనది. తమిళ్‌లో శివ కార్తికేయన్‌గారి ఓన్ ప్రొడక్షన్‌లో వచ్చి అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ – ”40 సంవత్సరాలుగా మెగాస్టార్‌కి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెల్సిందే. రేపు మీరు చూడబోయే ఒక గొప్ప సినిమా అయిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ప్రత్యేకంగా, గర్వంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ప్యారలల్‌గా ఒక క్రికెటర్, రైతు కథ. ఈ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో రేపు సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. ఒకటి మాత్రం చెప్పగలను..ఈ సంవత్సరం రాబోయే గొప్ప సినిమాల్లో ఖచ్చితంగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఒకటి. ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతూ ఈ కథకు కారణమైన అరుణ్‌రాజ కామరాజ్ గారికి, ప్రత్యేకంగా మా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్,నటకిరీటి రాజేంద్రప్రసాద్, ప్రత్యేక పాత్ర చేసిన శివ కార్తికేయన్, హీరో కార్తీక్ రాజు లకు నా ధన్యవాదాలు” అన్నారు.
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్(స్పెషల్ రోల్), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్.నరసింహారావు, వెన్నెల కిశోర్, ‘రంగస్థలం’ మహేశ్, విష్ణు(టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్, కథ: అరుణ్‌రాజ కామరాజ్, మాటలు: హనుమాన్ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్(కెకె), కాసర్ల శ్యామ్, రాంబాబు గోసల, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, డాన్స్: శేఖర్, భాను, ఆర్ట్: ఎస్.శివయ్య, కో-డైరెక్టర్: బి.సుబ్బారావు, ప్రొడక్షన్ కంట్రోలర్: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు