సెంట్రల్ మినిస్టర్ (సుమన్) కుమారుడు కాలేజీలో అల్లరి చేస్తుంటాడు. దాంతో ఒకమ్మాయి అతనికి భయపడి టీసీ తీసుకుని వెళ్తుంది. ఆమెను స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) ఆపుతుంది. అది గమనించిన ఆకతాయి ఆమెపై కూడా దౌర్జన్యం చేయాలనుకుంటాడు. అప్పుడు గగన్ (సాయిశ్రీనివాస్) ఆపుతాడు. గగన్‌కి తోడుగా అతని తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్), సోదరుడు (నందు) కూడా ఫైట్ చేస్తారు. సెంట్రల్ మినిస్టర్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని అశ్వత్ నారాయణ వర్మ (జగపతిబాబు) ఇంటి వేడుకకు హాజరవుతాడు. పరువు కోసం ప్రాణాలను లెక్కచేయని వర్మ తన కుమార్తె ఆత్మహత్యకు, కాబోయే అల్లుడి చావుకు కారణమవుతాడు. మరోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ను ప్రెస్టీజియస్‌గా తీసుకుంటాడు. అంతవరకు లిక్కర్ బిజినెస్‌లో ఉన్న పవార్ దృష్టి ఈ క్రాంటాక్ట్ మీద పడుతుంది. పవరు కోసం పాటుపడే పవార్, పరువు కోసం పాకులాడే వర్మ ఆడుతున్న గేమ్‌లోకి స్వీటీ అలియాస్ జానకి (రకుల్ ప్రీత్‌సింగ్) చేరుతుంది. ఆమెను వారిద్దరి నుంచి హీరో ఎలా కాపాడుకున్నాడు? అనేది సినిమా లో చూడాలి ….
మురిగి పోయిన మసాలా….. ‘జయ జానకి నాయక’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2/5
పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హిట్లు అందించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సినిమా ‘జయ జానకి నాయక’. దర్శకుడుగా బోయపాటి శ్రీను, తన మార్క్ మాస్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా ఫార్ములాని రొటీన్ గా ఈ సినిమాలో కూడా ప్రయోగించాడు .”ప్రేమించే వారి కోసం ఎంత వరకైనా వెళ్ళొచ్చు” అనే పాయింట్ తో బోయపాటి ఈ చిత్రం చేసారు . అలాగే సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా చాలా ప్రాధ్యానత ఉంటుంది. అయితే బోయపాటి మార్క్ అతి హింస ఈ చిత్రం లో అన్నింటినీ డామినేట్ చేసింది .
సినిమాలో మైనస్ పాయింట్ … కొత్తదనం లేకపోవడం. సినిమాలో అక్కడక్కడ లాజిక్ మిస్ అయ్యే సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లేని కొత్తగా చెప్పాలని ట్రై చేసినా కొన్ని పాత్రలకి సరైన ముగింపు ఉండదు. సినిమాలో నవ్వు లేదు. లవ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కడా పెద్ద ఎఫెక్టివ్ గా కనిపించవు. హీరోయిన్ ఊతపదంగా ‘నాగరాజా’ అనడం తప్పితే, ఎక్కడా నవ్వొచ్చే సన్నివేశాలు లేవు. విలన్లు, విలన్ చుట్టూ మనుషులు ఎక్కువగా కనిపిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువయ్యాయి . కొన్ని సన్నివేశాలు చాలా డల్‌గా ఉన్నాయి . రకుల్ డల్ మూడ్‌లో ఉండటం కొత్త ప్రయత్నమే అయినా, కొంచెం సేపటికి విసుగు వచ్చేస్తుంది. వాణీవిశ్వనాథ్ ఎంట్రీ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ పాత్ర గ్రాఫ్ సస్టెయిన్ కాలేదు . పరువు కోసం కూతురి ఆత్మహత్యకు కారణమైన వర్మ, తన ఫ్యామిలీనే మట్టుబెట్టించాలని చూసిన చెల్లిని ఏమీ అనకపోవడం, తనకు తానే కాల్చుకోవడం అర్ధం కాని విషయాలు . కొన్ని సందర్భాల్లో డైలాగులు బాగున్నాయి .
హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ వరకు గత సినిమాలతో పోల్చుకుంటే చాలా మెరుగు పడ్డాడు . తండ్రికి విలువిచ్చే కుర్రాడిగా, తొలిసారి అమ్మాయి ప్రేమను చవిచూసిన యువకుడిగా, కసితో పోరాడే హీరోలా.. బాగా చేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్లు కూడా బావున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ అటు అల్లరి పిల్లగా, బాధ్యతగా ఉన్న అమ్మాయిగా, డిప్రెషన్‌కు గురైన మగువగా పాత్రలో రక రకాల వేరియేషన్స్ ని బాగా ప్రెజెంట్ చేసింది . ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో జగపతి బాబు పాత్రలో ఎమోషనల్ విలనిజం కనిపిస్తుంది. ఆ పాత్రకి జగపతి బాబు పూర్తి న్యాయం చేశాడు.ఇక సినిమాలో శరత్ బాబు చాలా కీలకమైన పాత్ర చేసి మెప్పించాడు. కొడుకులని ప్రేమించే తండ్రిగా, ప్రేమని గౌరవించే తండ్రిగా అతని పాత్ర చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక మెయిన్ విలన్ గా చేసిన తరుణ్ అరోరా, హీరో అన్నగా చేసిన నందు, మినిస్టర్ గా చేసిన సుమన్ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా కేవలం అందాల ప్రదర్శన, ఓ రెండు సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యింది, ఇక చాలా ఏళ్ల తర్వాత అలనాటి గ్లామర్ నటి వాణీ విశ్వనాధ్ పాత్ర ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో అయితే లేదు. ఆ పాత్రకి ఆమె అవసరం కూడా లేదనిపిస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బావుంది. ‘వీడే వీడే’, ‘ఎ ఫర్’ అనే ఐటమ్ సాంగ్ ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గ విధంగా అందించాడు. రిషి పంజాబీ తన సినిమాటోగ్రఫీతో ఆద్యంతం విజువల్ ట్రీట్ అందించారు. హంసలదీవి అందాలని భాగా చూపించాడు. బోయపాటి సినిమా అంటే కచ్చితంగా ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో రామ్- లక్ష్మణ్ లు తమ మార్క్ ఫైట్స్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు . ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి -ధరణి