ప్రముఖ బాలీవుడ్ న‌టుడు రిషీకపూర్‌ మరిలేరు!

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు రిషీకపూర్‌ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.
ముంబైలో 1952, సెప్టెంబర్‌ 4న జన్మించిన రిషీకపూర్‌ ‘మేరా నామ్‌ జోకర్’‌ చిత్రంలో బాల నటుడుగా… ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్ల‌లు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌భీర్ క‌పూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్‌ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.
 
రిషి క‌పూర్ మ‌ర‌ణంపై కుటుంబ స‌భ్యుల లేఖ…
“లుకేమియాతో రెండు సంవ‌త్సరాల‌పాటు పోరాడిన రిషి క‌పూర్ నేడు ఉద‌యం 8.45 గంట‌ల‌కు క‌న్నుమూశారు. చివ‌రి క్ష‌ణాల్లోనూ వైద్య సిబ్బందితో న‌వ్వుతూ న‌వ్విస్తూ గ‌డిపారు. క్యాన్స‌ర్‌కు చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనూ ఆయ‌న అంతే స‌ర‌దాగా ఉండేవారు. కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌ప‌డం, ఫ్రెండ్స్‌తో ముచ్చ‌టించ‌డం, ఇష్ట‌మైన ఫుడ్ త‌సుకోవ‌డం.. ఇవ‌న్నీ చూసి ఆయ‌న్ని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌వాళ్లంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేవాళ్లు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచీ అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మ‌న‌మంద‌రం ఆయ‌న్ను క‌న్నీళ్ల‌తో కాకుండా చిరున‌వ్వుతో గుర్తు చేసుకోవాల‌ని ఆయ‌న చివ‌రి క్ష‌ణాల్లో కోరుకున్నారు. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచం గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. కాబ‌ట్టి ప్ర‌భుత్వం విధించిన నిబంధ‌న‌ల‌ను అంద‌రూ త‌ప్ప‌క పాటించండ”‌ని కోరుతూ లేఖ‌లో పేర్కొన్నారు.
 
రిషి క‌పూర్ చివ‌రి ట్వీట్..
సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి క‌పూర్ ఏప్రిల్ 2న చివ‌రిసారిగా ట్వీట్ చేశారు. ఆఖ‌రి ట్వీట్‌లోనూ అత‌ను ఇత‌రుల శ్రేయ‌స్సును కోరుకుంటూ త‌న మంచిమ‌న‌సును చాటుకున్నారు. క‌రోనా వైర‌స్‌తో నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, న‌ర్సులు, పోలీసుల ప‌ట్ల హింస‌ను మానుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు చేతులెత్తి విజ్ఞ‌ప్తి చేశారు. మ‌న‌కోసం వారు ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్నార‌ని అలాంటి వారిపై దాడుల‌కు దిగ‌డం మానుకోవాల‌ని కోరారు. అయితే గ‌తంలో కొన్నిసార్లు ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారినప్ప‌టికీ త‌న అభిప్రాయాన్ని నిక్క‌చ్చిగా వెల్ల‌డిచేయ‌డంలో ఆయ‌నెప్పుడూ వెన‌క‌డుగు వేయ‌లేదు.