మలయాళ హీరోయిన్ భావన 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, నిప్పు వంటి సినిమాల్లో నటించింది. భావన వేదింపుల కేసు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్‌పై కేరళ పోలీసులు తాజాగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని దీనిపై భావన సోషల్ మీడియాలో స్పందించింది….
“బాధితురాలినైనప్పటినుంచి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాలేదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడితో.. నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయినా, అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని… మరెవరికీ అలాంటి పరిస్థితి రాకూడదని.. నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది.