సినీవినోదం రేటింగ్ : 2 .25 /5
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీవాసు దర్శకత్వం లో అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే….
పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి స్వస్తిక్ పురం గ్రామంలోని రాజుగారు(శరత్‌కుమార్) . అదే ప్రాంతంలో ఉండే మునస్వామి అతని తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అతని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడటంతో తప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువు శివ ప్రకాశ్(జయప్రకాశ్) చెంతకు చేరుతాడు. పిల్లలు లేని శివ ప్రకాశ్ ఆ పిల్లాడికి విశ్వజ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.
పెరిగి పెద్దయిన విశ్వ వీడియో గేమ్ లను ప్లాన్ చేసి చిత్రీకరిస్తుంటాడు. సౌందర్యలహరి(పూజా హెగ్డే)ని చూసి ప్రేమిస్తాడు విశ్వ.ఆమెకు ఓ సందర్భంలో సహాయం చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోని సౌందర్య.. విశ్వపై కోపంతో ఇండియాకు వచ్చేస్తుంది. విశ్వ కూడా సౌందర్య కోసం ఇండియా వచ్చేస్తాడు. అదే సమయంలో హైదరాబాద్‌లోని సౌందర్య తండ్రి మునస్వామి ఆక్రమాలకు అడ్డుపడుతుంటాడు. మునస్వామికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సేకరిస్తుంటాడు. మునస్వామి తమ్ముడు వీరాస్వామి(రవికిషన్) సౌందర్యను చంపేయాలనుకుంటాడు. కానీ ప్రకృతి కారణంగా చనిపోతాడు. దానికి విశ్వ పరోక్షంగా కారణమవుతాడు. అలాగే మునస్వామి ఇద్దరు తమ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చస్తారు. అసలు మునస్వామి అండ్ బ్రదర్స్‌పై ప్రకృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి….
విశ్లేషిస్తే ….
భగవంతుడు మంచి చెడులను బేరీజు వేసి పాపాన్ని ప్రక్షాళన చేస్తాడు. పంచభూతాలే ప్రతీకారం తీర్చుకుంటాయని చెప్పే సినిమా ఇది. విభిన్నమైన కథ అయినప్పటికీ రొటీన్ తెలుగు సినిమాల్లాగే ఐదు ఫైట్స్, సాంగ్స్ తో పక్కా కమర్షియల్ గానే సాగుతుంది.సినిమా ఆసక్తికరం గానే మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అవసరంలేని సీన్లతో సినిమా దెబ్బతింది. కొత్తధనం సినిమాలో ఎక్కడా కనిపించదు.
పంచభూతాలు హీరోకి సాయపడే విధానం బాగున్నప్పటికీ మరీ నాటకీయంగా అనిపిస్తాయి. వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అయ్యే సందర్భాలు చాల తక్కువ.
నటీనటులు….
వీడియో గేమ్ డెవలపర్ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ , ఫిజిక్ పరంగా బాగున్నాడు. పైగా తన సిక్స్ ప్యాక్ తో, గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో పాత్రకు న్యాయం చేశాడు. రిస్క్ తో చేసిన ఇంట్రడక్షన్ సీన్‌లోని అడ్వంచరస్ చాలా బాగున్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. విలన్ గా జగపతి బాబు మరోసారి తన మార్క్ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ తన పర్ఫామెన్స్ తో మంచి విలనిజం పండించారు. జగపతి బాబు తమ్ముళ్లుగా నటించిన అశుతోష్ రానా, రవికిషన్‌లు కూడా తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. శరత్ కుమార్, మీనా, రావూ రమేష్, మధు, గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు బాగా చేసారు
సాంకేతికవర్గం ….
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, సన్నివేశాలకు సగం బలం రీరికార్డింగే. పాటలు ట్యూన్ల పరంగా గొప్పగా లేకపోయినా, రిచ్ చిత్రీకరణ వల్ల బావున్నాయి. అయితే పాటలు కథ మధ్యలో వచ్చిఇబ్బంది పెడతాయి. పీటర్ హైన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి.సినిమాటోగ్రఫర్ ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. యూఎస్, వారణాసి, దుబాయ్ వంటి లొకేషన్స్ లో ఆయన తీసిన విజువల్స్ మంచి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ మంచి స్థాయిలో అర్ధవంతంగా ఉన్నాయి.కోటగిరి వెంకటేశ్వర్రావు ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాత అభిషేక్ నామా పాటించిన నిర్మాణ విలువలు భారీగా చాలా బాగున్నాయి
– రవళి