ప్రముఖ సినీ నటి శ్రీదేవి(54) ఇకలేరు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బోని కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ధ్రువీకరించారు.
శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మా యాంగేర్ అయ్యపాన్’. తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
1975 చిన్నతనంలో ‘తునాయివన్’ సినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి.. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా వెలుగొందారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.
2017లో చివరిగా ‘మామ్’ చిత్రంలో నటించారు. తన కెరీర్లో 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్లో తెరంగేట్రం తర్వాత 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి-బోనికపూర్ దంపతులకు జాన్వీ, ఖుషిలు ఉన్నారు. పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా 2013లో భారత ప్రభుత్వం శ్రీదేవికి ‘పద్మ శ్రీ’ పురస్కారాన్ని ప్రధానం చేసింది.
ఆమె నిజ జీవితంలో అడుగడుగునా కష్టాలే !
శ్రీదేవి అందానికి ఫిదా అయి ఆమె అభిమానులుగా మారినవారు ఎందరో ఉన్నారు కానీ ఆమె నిజ జీవిత కష్టాలు చాలా మందికి తెలియవు. చిన్నప్పటి నుంచి ఆమె కోరుకున్నది ఏదీ ఆమెకు దొరకలేదు. అడుగడుగునా కష్టాలే.. బాల నటిగా ఉన్నప్పుడు ఐష్‌క్రీం తినాలని తపించిపోయేది కానీ ఆమె తల్లి రాజేశ్వరీ వద్దని చెప్పేదట. అలా తింటే బాగా లావు అవుతావని దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని చెప్పడంతో ఐష్‌క్రీం తినడం మానేసింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తోటి స్నేహితులతో ఆటపాటలు లేకుండా సినిమాల్లోనే నటించింది. రాత్రి సమయాల్లో నిద్రపోతున్నప్పుడు కూడా ముఖం మీద నీళ్లు కొట్టి నిద్రలేపేవారు… అంత చిన్న వయసులోనే శ్రీదేవి తన బాల్యాన్ని కుటుంబం కోసం బలిపెట్టి డబ్బు సంపాదించింది. పెరిగి పెద్ద అయిన తర్వాత శ్రీదేవి హీరోయిన్ అయింది. పేరు ప్రఖ్యాతలతో పాటు కష్టాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇంట్లో వారు ఆమె సంపాదించే డబ్బు మాత్రమే చూసే వారు కానీ ఆమె మనసులో ఉన్న బాధను పట్టించుకునే వారు కాదట.
అప్పట్లో కమల్-శ్రీదేవి ఓ హిట్ పెయిర్‌గా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న పరిచయమే ప్రేమగా మారిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఓక రోజు కమల్‌ను పెళ్లి చేసుకుంటానని శ్రీదేవి తల్లి రాజేశ్వరితో చెప్పిందట… దీనిని ఆమె వ్యతిరేకించి సినిమా వాళ్లు మోసం చేస్తారని సర్ధిచెప్పిందట. అంతేకాక పెళ్లి చేసుకొని వెళ్లిపోతే కుటుంబాన్ని పోషించేది ఎవరు అని శ్రీదేవితో వారించిందట. మరోసారి పెళ్లి విషయం తెస్తే ఉరి వేసుకొని చస్తానని కూడా శ్రీదేవి తల్లి బెదిరించిందట. దీంతో కమల్‌తో పెళ్లికి ఫుల్స్టాప్ పడపోయిందట. తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. దక్షిణాదిలో పెద్ద స్టార్ అయిన శ్రీదేవి ఉత్తరాదిలో కూడా తన సత్తా చూపించింది. తండ్రి, తల్లి ఒకరి తర్వాత ఒకరు మృతిచెందారు. దీంతో తన సంపాదన విషయాలు అన్నీ తన చెల్లికి అప్పగించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆస్థిలో వాట కావాలంటూ శ్రీదేవి చెల్లెలు కోర్టుకు ఎక్కింది. ఆ సమయంలోనే శ్రీదేవికి దగ్గర అయ్యాడు బోనీకపూర్… ‘మిస్టర్ ఇండియా’ సినిమాలో హీరోయిన్గా నటించాలంటూ శ్రీదేవి వద్దకు మొదటిసారి బోనీకపూర్ వచ్చాడు. తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆపై చెల్లెలితో ఉన్న ఆస్థి తగాదా విషయాన్ని బోనీకపూర్‌తో శ్రీదేవి చెప్పుకుంది. ఆమె కష్టాలన్నీ విన్న ఆయన శ్రీదేవికి ధైర్యం చెప్పాడు. నేనున్నాననే భరోసా శ్రీదేవికి కల్పించాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే బోనీకపూర్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్ని విషయాలు తెలిసే బోనీకపూర్‌కు శ్రీదేవి దగ్గరైంది. దీంతో బాలీవుడ్ ఉలిక్కిపడినట్లైంది. ఎందుకంటే గతంలో ఓ సందర్భంలో బోనీకపూర్‌కు శ్రీదేవి రాఖీ కూడా కట్టింది. చివరకు బోనీకపూర్‌కు రెండో భార్యగా శ్రీదేవి ఏడు అడుగులు వేసింది. బోనీకపూర్ మొదటి భార్య నుంచి తీవ్రమైన అవమానానికి శ్రీదేవి గురైంది. ఆమె నుంచి ఎన్నో అవమానాలను దిగమింగిన శ్రీదేవి తర్వాత బోనీకపూర్‌తో సంతోష జీవితాన్ని గడిపింది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన శ్రీదేవి పిల్లల ఎదుగుదల చూడకుండానే ప్రాణాలు వదిలేయడం బాధాకరం. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి చిత్ర పరిశ్రమలో రానించాలనేది ఆమె కోరిక కానీ జాహ్నవిని వెండితెర మీద చూడకుండానే ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు వదిలేసింది.