‘యువ కళా వాహిని’ &’సీల్ వెల్ కార్పోరేషన్’ ఆధ్వర్యంలో… మార్చి 20 ఉదయం పదిగంటలకు ప్రసాద్ ఫిలిం లాబ్ లో పసుపులేటి రామారావు గారు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ గ్రంథం ఆవిష్కరణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది.సినీతార రకుల్ ప్రీత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని నిర్మాత ‘దిల్’ రాజుకు అందించారు. నటులు మాదాల రవి, శివాజీరాజా ప్రతులను కొనుగోలు చేశారు. ‘‘అతిలోకసుందరి అనే బిరుదు శ్రీదేవిగారికి సరిగ్గా సరిపోతుంది. మనదేశంలో తొలి మహిళా సూపర్‌స్టార్ ఆమె. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి’’ అని నటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు.
ముఖ్యఅతిథి దిల్ రాజు,సభాధ్యక్షులు బండారు సుబ్బారావు, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ రచయిత పసుపులేటి రామారావు గారిని సన్మానించారు.బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హాలీవుడ్ స్థాయికి వెళ్లినప్పటికీ, శ్రీదేవి చాలా అణకువగా ఉండేవారనీ, క్రమశిక్షణకు ఆమె మారుపేరని అతిథులు గుర్తుచేసుకున్నారు. ఆమె గురించి ఎన్నో విషయాలను పసుపులేటి రామారావు రాసిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈకార్యక్రమంలో నిర్మాతలు బి వి యస్ యన్ ప్రసాద్, కె.అచ్చిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు,వై వి యస్ చౌదరి, నటులు ఆర్ నారాయణ మూర్తి, శివాజీ రాజా, మాదాల రవి, ఏడిద శ్రీరాం, ‘సంతోషం’ పత్రిక సురేష్ కొండేటి, కళా ప్రముఖులు పి.జయ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గాయని పద్మశ్రీ ప్రార్ధనాగీతం ఆలపించారు.లయన్ వై కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో సభాకార్యక్రమం విజయవంతంగా ముగిసింది.