సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో… రేవతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఇట్లు అమ్మ”. ఈ సందేశాత్మక చిత్రాన్ని బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మించారు. మిహిరా, రవికాలె, పోసాని, కృష్ణేశ్వర్ రావు, అరువీ బాల, ప్రశాంత్, వినీత్ తదితరులు నటీనటులు. నాగులపల్లి కనకదుర్గ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సోని లివ్ ఓటీటీలో “ఇట్లు అమ్మ” సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా ప్రివ్యూ షో ను మాజీ మంత్రి జె గీతారెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, సామాజిక వేత్త సాజయా, మహిళ సంఘ నేతలు దేవి, రచయిత జయరాజ్ తదితరులు చూసారు..
మాజీ మంత్రి జె గీతా రెడ్డి మాట్లాడుతూ…“శత్రువైనా మిత్రుడైనా అందరూ అమ్మకు బిడ్డలే అనే గొప్ప సత్యాన్ని ఇట్లు అమ్మ సినిమా చూపిస్తుంది. అమ్మ హృదయం ఎంత గొప్పదో ఈ సినిమా చూస్తే తెలు స్తుంది.. మా అమ్మ లైఫ్ డాక్యుమెంటరీ కూడా ఉమామహేశ్వరరావు తీయాలని కోరుతున్నాం. అభిరుచి చాటుకున్న నిర్మాత బొమ్మక్ మురళీకి నా అభినందనలు” అన్నారు.
నిర్మాత బొమ్మక్ మురళి మాట్లాడుతూ..“మంచి సమాజాన్ని నిర్మించేందుకు ప్రపంచంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలనే పిలుపునిస్తుందీ సినిమా. చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని ఇట్లు అమ్మ చిత్రం ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ కథ దర్శకుడు చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయి. ఒక మంచి చిత్రాన్ని సమాజానికి అందివ్వాలనే ఇట్లు అమ్మ చిత్రాన్ని నిర్మించాం.’ఇట్లు అమ్మ’ చిత్రాన్ని సోని లివ్ ఓటీటీలో తప్పక చూడండి” అన్నారు.
దర్శకుడు సి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..” మహిళ నాలుగు గోడలకు పరిమితం కాకూడదు. సమాజాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తమ అభిప్రాయాలను గొంతెత్తి చెప్పాలి. అలా ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. ప్రపంచ గతిని మార్చే శక్తి అమ్మకు ఉంది. సమాజంలో జరిగే హింసకు, బేధాలకు ఎక్కువగా ప్రభావితం అయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి మహిళ సొంతం. పురోగతి చెందే సమాజంలో మహిళ ప్రధాన భాగం కావాలని ఇందులో చూపిస్తున్నాం” అన్నారు.
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… “మన జీవితాలు, మన సమాజం ఈ చిత్రంలో కనిపించింది. సమాజానికి పనికొచ్చే ఇంత గొప్ప సినిమాను ప్రేక్షకులంతా చూసి ఆదరించాలి”అన్నారు.
వుమెన్ యాక్టివిస్ట్ దేవి మాట్లాడుతూ…“మగాడు ప్రతి మహిళలో అమ్మను చూసే రోజులు రావాలి. అమ్మ గొప్పదనం తెలిస్తేనే ఆ మార్పు వస్తుంది. ఇట్లు అమ్మ అమ్మంటే ఏంటో చూపించే సినిమా. నేటి సమాజం చూడాల్సిన సినిమా ఇది” అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనకదుర్గ మాట్లాడుతూ…“మహిళ అభ్యున్నతి కోరే అనేక మంది వుమెన్ ఆక్టివిస్టులు అండగా ఉండటం మా బలం. స్త్రీ శక్తికి నిదర్శనంగా ఇట్లు అమ్మ సినిమా ఉంటుంది” అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ :మధు అంబట్, సంగీతం :సన్నీ ఎంఆర్, ఎడిటింగ్ :ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్: సరితా మాధవన్, పాటలు: గోరటి వెంకన్న, రామ్, ఇండస్ మార్టిన్