”ఓకే’ అని వినిపించాల్సిన ప్రతి సందర్భంలోనూ ‘నో’ అని వినిపించినప్పటికీ ఎక్కడో
ఒక చోట తప్పకుండా ‘ఓకే’ అనో ‘ఎస్’ అనో వినిపించడం ఖాయం. ఇందుకు మహిళా దర్శకురాలు పాఖీ.ఎ.టైర్‌వాలా చేసిన నేపాలీ చిత్రం ‘పహూనా’నే ప్రత్యక్ష ఉదాహరణ’ అని అంటోంది గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా. సొంత నిర్మాణ సంస్థ పర్పల్ పెబ్బుల్ పిక్చర్స్ పతాకంపై పాఖీ.ఎ.టైర్‌వాలా దర్శకత్వంలో ప్రియాంక చోప్రా ‘పహూనా: ద లిటిల్ విజిటర్స్’ అనే నేపాలీ చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ప్రశంసల వర్షంలో తడిసి ముద్దైన తన చిత్రం గురించి ప్రియాంక మాట్లాడుతూ….’ఈ చిత్రకథను దర్శకురాలు పాఖీ చాలా మందికి వినిపించారు. మెయిన్ స్ట్రీమ్‌కి దూరంగా ఉందని చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ ఆమె ఎంతో ఓర్పు, సహనంతో మరిన్ని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆమెకు నిరాకరణే ఎదురైంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆమె నన్ను కలిసి ఈ కథ నెరేట్ చేశారు. కథ అద్భుతంగా ఉంది. పలు కారణాలతో తల్లిదండ్రులకు దూరమైన ముగ్గురు నేపాలీ పిల్లల కథ. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగే కథ. రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే చాలా భిన్నమైన కథ. ఈ కథతో సినిమా చేసేందుకు నేను ముందుకొచ్చాను. దర్శకురాలు పాఖీ తాను ఏమైతే అనుకుందో ఆ భావాన్ని యధాతథంగా ప్రజెంట్ చేసింది. ఆమె చేసిన ప్రయత్నానికి టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ మద్దతు పలికింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌తో ఓ చిన్న సందేశాత్మక చిత్రం గురించి ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు, విమర్శకులు సైతం ప్రశంసించడంతోపాటు … మా ఎఫర్ట్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం నా జీవితంలో మరచిపోలేనిది. ఆ సమయంలో నాకు అర్థమైంది ఒక్కటే.. ‘ఓకే’ అని వినిపించాల్సిన ప్రతి చోటా ‘నో’ అని వినిపించినా సరే.. ఎక్కడో ఒక చోట ‘ఎస్’ అని వినిపించడం ఖాయమని. ఓ మంచి సినిమా చేసేందుకు సహకరించిన మా అమ్మ మధుచోప్రాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ అని చెప్పింది.